న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఏషియన్ పెయింట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 29 శాతం క్షీణించి రూ. 605 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 852 కోట్లు ఆర్జించింది. ముడిసరుకుల వ్యయాలు పెరగడం ప్రధానంగా ప్రభావం చూపింది.
కాగా.. మొత్తం ఆదాయం మాత్రం రూ. 5,350 కోట్ల నుంచి రూ. 7,096 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 4,299 కోట్ల నుంచి రూ. 6,418 కోట్లకు పెరిగాయి. వీటిలో మెటీరియల్స్ వ్యయాలు రూ. 2,646 కోట్ల నుంచి రూ. 4,571 కోట్లకు పెరిగాయి. ఈ కేలండర్ ఏడాది(2021) జనవరి నుంచి ముడిసరుకుల ధరలు భారీగా పెరిగినట్లు కంపెనీ ఎండీ, సీఈవో అమిత్ సింగ్లే పేర్కొన్నారు. దీంతో అన్ని విభాగాలలోనూ స్థూల మార్జిన్లు ప్రభావితమైనట్లు తెలియజేశారు. ఫలితంగా ప్రొడక్టుల ధరలను పెంచినట్లు తెలియజేశారు. ఇకపైన కూడా ముడివ్యయాలకు అనుగుణంగా ధరలను పెంచాలని చూస్తున్నట్లు వెల్లడించారు.
ఫలితాల నేపథ్యంలో ఏషియన్ పెయింట్స్ షేరు బీఎస్‌ఈలో దాదాపు 5.2 శాతం పతనమై రూ. 3,004 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment