
సాక్షి, హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రోజూ కొత్త కొత్త మోడళ్లు.. బ్రాండ్ల మధ్య నువ్వా నేనా అన్న పోటీ.. ఇదీ మొబైల్స్, ల్యాప్‌టాప్స్, టెలివిజన్ సెట్ల పరిశ్రమలో నాలుగు నెలల క్రితం వరకు ఉన్న పరిస్థితి. కోవిడ్–19 కారణంగా ఇప్పుడు వాతావరణం మారిపోయింది. కొత్త మోడళ్ల రాక తగ్గిపోయింది. విక్రేతల వద్ద నిల్వలు నిండుకున్నాయి. పాత స్టాక్‌తోనే ఇప్పటి వరకు అమ్మకందార్లు నెట్టుకొచ్చారు. ప్రస్తుతం కొత్త స్టాక్ రాక సగానికి తగ్గింది. కొన్ని నెలలుగా విదేశాల నుంచి ముడి సరుకు రాక తగ్గడంతో దేశీయంగా పరిశ్రమ తయారీ అడ్డంకులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు తాజాగా ఎలక్ట్రానిక్ విడిభాగాలు పోర్టుల వద్ద నిలిచిపోయాయి. కస్టమ్స్ క్లియరెన్స్ కోసం ఇవి ఎదురు చూస్తున్నాయి. ముడి సరుకు లేక ప్లాంట్లు మూసివేత దిశగా సాగుతున్నాయి. మరోవైపు ఎలక్ట్రానిక్స్ అమ్మకాలు సగానికి పడిపోయాయని పరిశ్రమ చెబుతోంది.
మూసివేత దిశగా ప్లాంట్లు..
ప్రధానంగా చైనా నుంచి వచ్చిన ముడిసరుకు నిల్వలు పోర్టుల వద్ద కస్టమ్స్ క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నాయి. షావొమీ, ఒప్పో, రియల్‌మీ, హాయర్, క్యారియర్ మిడియా వంటి కంపెనీల ఉత్పత్తులు వీటిలో ఉన్నాయి. కొన్ని తయారీ కేంద్రాల్లో విడిభాగాలు లేక ఉత్పత్తి ప్రక్రియ నిలిచిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ వారం ప్లాంట్లను మూసివేయక తప్పదని కొన్ని కంపెనీలు అంటున్నాయి. జైనా గ్రూప్ ఇటీవలే ప్లాంటును మూసేసింది. కార్బన్ మొబైల్స్‌ను ప్రమోట్ చేస్తున్న ఈ కంపెనీకి సాన్‌సూయ్ టీవీ తయారీ లైసెన్స్ ఉంది.
15 రకాల బ్రాండ్ల ఎల్‌ఈడీ టీవీలను తయారు చేస్తున్న వీడియోటెక్స్ ఇంటర్నేషనల్ సైతం ముడిసరుకు లేక ఇబ్బంది పడుతోంది. మొబైల్ ఫోన్లు, టెలివిజన్లకు సంబంధించి 65–70% విడిభాగాల కోసం చైనాపై భారత్ ఆధారపడింది. ఏసర్, హెచ్‌పీ, డెల్, లెనోవో, ఆసస్ కంపెనీల ల్యాప్‌టాప్‌ల సరఫరా సైతం తగ్గింది. కంపెనీల నుంచి సరఫరా 50 శాతమే ఉంటోందని ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ తెలిపారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అధికం కావడంతో ల్యాప్‌టాప్‌లకు డిమాండ్ పెరిగిందని చెప్పారు.
ఆందోళనలో రిటైలర్లు..
కోవిడ్–19 విస్తృతి, దాని ప్రభావంతో మొబైల్స్ విక్రయ రంగం రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోందోనని పరిశ్రమ ఆందోళనగా ఉంది. నిరుద్యోగిత పెరిగితే స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్లు పడిపోతాయి. ఈఎంఐ ద్వారా మొబైల్స్ కొనుగోలు చేసే వారి సంఖ్య గతంలో 35–40 శాతముండేది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈఎంఐల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుండడంతో ఇప్పుడీ సంఖ్య 5 శాతానికి వచ్చింది. పైగా డౌన్‌పేమెంట్ 35 శాతం కట్టాల్సిందే అన్న నిబంధన అమలు చేస్తున్నారు. దుకాణాలు తెరుచుకున్నా అమ్మకాలు 50 శాతం కూడా లేవు. దీంతో విక్రేతలు ఆందోళనగా ఉన్నారు.
అధిక అద్దెలతోనే ముప్పు..
సాధారణ దుకాణాలతో పోలిస్తే మొబైల్ రిటైల్ ఔట్‌లెట్లు చెల్లిస్తున్న అద్దె ఎక్కువే. ప్రధాన ప్రాంతాల్లో అయితే ఇది ఏకంగా 40–50% అధికంగా ఉంటోంది. దీనికంతటికీ కారణం రిటైలర్ల మధ్య తీవ్ర పోటీయే. అయితే లాక్‌డౌన్ కారణంగా దుకాణాలు మూసివేశామని, వ్యాపారం జరగనందున అద్దె చెల్లించలేమని రిటైలర్లు భవన యజమానులకు తేల్చిచెప్పారు.
అద్దె పూర్తిగా మినహాయింపు ఇస్తేనే వ్యాపారాలు చేసుకోగలమని వారు అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో కొన్ని దుకాణాలను మూసివేయాల్సిన స్థితికి వచ్చామని ఓ రిటైలర్ వ్యాఖ్యానించారు. ఫోర్స్ మెజోర్ నిబంధనను అడ్డుపెట్టుకుని జాతీయ బ్రాండ్లు అద్దె చెల్లించడం లేదని ఆయన గుర్తు చేశారు. అయితే ఏదైనా మొబైల్ షాపు ఖాళీ అయితే.. అట్టి దుకాణాన్ని అద్దెకు తీసుకోరాదని దక్షిణాదికి చెందిన మొబైల్ ఫోన్ల రిటైలర్లు నిర్ణయించడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment