ముంబై: బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వసూలు చేసే వడ్డీరేటు– రెపోను తగ్గించే పరిస్థితి ప్రస్తుతం లేదని గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ ఉద్ఘాటించింది. అదే జరిగితే.. ధరలు తగ్గుదలకు ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలు ప్రయోజనం లేకుండా పోతాయని అభిప్రాయపడింది. ధరల కట్టడే ఆర్‌బీఐ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేసింది.
ఈ నెల ప్రారంభంలో జరిగిన ఆర్‌బీఐ పాలసీ సమీక్షా సమావేశం మినిట్స్ ఈ అంశాలను వెల్లడించాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్‌బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగా అదుపులోకి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో ఈ నెల ప్రారంభ సమీక్ష సహా గడచిన ఐదు ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్‌బీఐ పెద్దపీట వేసింది.
4 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యం...
రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం ప్లస్, 2 శాతం మైనస్‌తో 4 శాతంగా ఉండాలని కేంద్రం ఆర్‌బీఐకి నిర్దేశిస్తున్నప్పటికీ తమ లక్ష్యం 4 శాతమేనని గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గుతుందని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో 5 శాతం ద్రవ్యోల్బణం నమోదవుతుందని ఆర్‌బీఐ భావిస్తోంది. తగిన స్థాయిలో వర్షపాతం నమోదయితే.. 2024–25 క్యూ1,క్యూ2, క్యూ3, క్యూ4లలో వరుసగా 5 శాతం, 4 శాతం, 4.6 శాతం, 4.7 శాతం చొప్పున ద్రవ్యోల్బణం నమోదవుతని పాలసీ సమీక్ష అంచనా వేసింది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సరఫరా వ్యవస్థను ప్రభావితం చేస్తోందని, వస్తువుల ధరలపై ఇది తీవ్ర ఒత్తిడి తెస్తోందని, ఆహార ధరల్లో అనిశ్చితి ప్రధాన ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతోందని కమిటీ అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment