బలిమెలా నీటి వినియోగంపై సమీక్ష
మోతుగూడెం : ఉమ్మడి రాష్ట్రాల నిర్వహణలో ఉన్న బలిమెలా జలాశయంలో నీటి వినియోగంపై సీలేరు జెన్‌కో అతిథిగృహంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరురాష్ట్రాల అధికారులు బలిమెలా జలాశయం నిర్వహణపై సుమారు మూడుగంటలు చర్చించారు. బలిమెలా జలాశయంలో ప్రస్తుతం 101 టీఎంసీలు నీరు ఉండగా, ఇరు రాష్ట్రాల లెక్కల ప్రకారం ఒడిశాకు 68.8652 టీఎంసీలు నీటి వాటా ఉండగా, ఏపీపీ జెన్‌కోకు 32.1348 టీఎంసీలు నీరు ఉంది. దీని ప్రకారం ఏపీపీ జెన్‌కో 36.7305 టీఎంసీలు నీరును అదనంగా వాడుకుంది. ఈ బాకీ పడ్డ నీటిని రాబోయే సీజన్‌లో ఏపీపీ జెన్‌కో వాటా నుంచి వాడుకోవడానికి నిర్ణయించారు. ఈ నీటి సంవత్సరంలో ఏపీపీ జెన్‌కో 62.0680 టీఎంసీలు నీరు వాడుకోగా, ఒడిశా 25.3375 టీఎంసీల నీటిని వాడుకుంది. ప్రస్తుతం ఏపీ అవసరాల కోసం 1,500 క్యూసెక్కులు నీరు వాడుకోవడానికి, ఒడిశా 2,600 క్యూసెక్కులు నీరును వాడుకోవడానికి నిర్ణయించారు. ప్రస్తుతం జోలాపుట్‌లో 25.6132 టీఎంసీలు నీరు ఉండగా, బలిమెలాలో 74.6800 టీఎంసీలు నీరు ఉంది. ఈ సమీక్షా సమావేశంలో ఒడిశా తరఫున చీఫ్ కనస్ట్రక‌్షన్ ఇంజనీరు హర్షవర్థన్ మోహంతి, ఈఈ డి.బి.మిశ్రా, ఏఈఈలు ఉమాశంకర్ సాహూ, ప్రియభ్రత్తా నాయక్,, ఎస్టిమేటర్ ఏబీ నారాయణ, జూనియర్ ఇంజనీరు గధాదర్ ప్రధాన్, మేనేజర్(ఎలక్ట్రికల్) ఎస్.ఎస్.పి.రావు, జూనియర్ మేనేజర్లు మధబ్ సీహెచ్ బారిక్, ఎం.అశోక్, ఉజ్వల్‌కుమార్ నాయక్, ఏపీపీ జెన్‌కో తరఫున ముఖ్య ఇంజనీరు ఎల్.మోహనరావు, ఎస్‌ఈ ఎన్.మురళీమోహన్, ఈఈ వి.ఎల్.రమేష్, డీఈలు సుబ్రహ్మణ్యం, కె.సుధాకర్, ఏఈఈ సిÐంహాచలం, ఏఈ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.