ప్రజావసరాలకు అనుగుణంగా రైతుబజార్లు
సీఈవో రమణమూర్తి
కాకినాడ సిటీ : ప్రజల అవసరాలకు అనుగుణంగా రైతుబజార్లలో సేవలు అందేలా చర్యలు చేపడుతున్నట్టు సీఈవో బీవీ రమణమూర్తి తెలిపారు. ఆర్‌టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న రైతుబజార్‌లో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఆధ్వర్యంలో రూ.10 లక్షలతో నిర్మించిన షెడ్ ప్రారంభోత్సవం మంగళవారం జరిగింది. రమణమూర్తి మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా 10 రైతుబజార్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. రైతుబజార్లన్నింటికీ పటిష్టమైన షెడ్లు నిర్మించడంతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాకినాడ జగన్నాథపురంలోని జిల్లా పరిషత్‌కు చెందిన స్థలంలో రైతుబజార్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. తొలుత జిల్లాలోని రైతుబజార్ల పనితీరును జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ సీఈవోకు వివరించారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ ఏడీ కేవీఆర్‌ఎన్ కిషోర్, డీఈఈ ఎస్‌ఎస్‌వీ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.