న్యూఢిల్లీ: ఈ20 పెట్రోల్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో తగు స్థాయిలో ఇంధనం అందుబాటులో ఉండేలా చూసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఇథనాల్ ఉత్పత్తిని మరింతగా పెంచడంపై దృష్టి పెడుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 31 నగరాల్లో 100 బంకుల్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) ఈ20 ఇంధనాన్ని విక్రయిస్తున్నాయి. అంతా సక్రమంగా సాగితే ఈ ఇంధన వినియోగం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు కేంద్ర ఆహార శాఖ అదనపు కార్యదర్శి సుబోధ్ కుమార్ తెలిపారు.
దీంతో చక్కెర తరహాలోనే 2023–24 ఇథనాల్ సంవత్సరానికి గాను (డిసెంబర్–నవంబర్) ఇథనాల్ నిల్వలను పెంచుకునే యోచనలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఇథనాల్ ఉత్పత్తి కోసం మరింతగా చక్కెరను మళ్లించే అవకాశం ఉందని వివరించారు. ఫిబ్రవరి ఆఖరు నాటి వరకూ 120 కోట్ల లీటర్ల పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపినట్లు కుమార్ చెప్పారు. ఇథనాల్ లభ్యత, ఉత్పత్తి సామర్థ్యాలు ఈ ఏడాది లక్ష్యాల సాధనకు సరిపడేంత స్థాయిలో ఉన్నట్లు వివరించారు.
పరిశ్రమకు ప్రోత్సాహం..
పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపి వినియోగించడం ద్వారా క్రూడాయిల్ దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం 20 శాతంగా ఉంటే దాన్ని ఈ20 ఇంధనంగా వ్యవహరిస్తారు. 2001ల నుంచి దీనికి సంబంధించి ప్రయోగాలు జరుగుతున్నాయి. గతేడాది 10.02 శాతం ఇథనాల్‌ను కలిపిన పెట్రోల్‌ను వినియోగంలోకి తెచ్చారు. 2022–23 ఇథనాల్ సంవత్సరంలో (డిసెంబర్–నవంబర్) దీన్ని 12 శాతానికి, వచ్చే ఏడాది 15 శాతానికి పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
2030 నాటికల్లా దీన్ని 20 శాతానికి పెంచుకోవాలన్న లక్ష్యం గడువును కుదించుకుని 2025 నాటికే సాధించాలని నిర్దేశించుకుంది. ప్రస్తుత ఏడాదికి గాను 50 లక్షల టన్నుల చక్కెరను ఇథనాల్ ఉత్పత్తి కోసం మళ్లించనున్నారు. వచ్చే ఏడాది నిర్దేశించుకున్న 15 శాతం మిశ్రమ లక్ష్య సాధన కోసం అదనంగా 150 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరమవుతుందని అంచనా. దీనితో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలంటూ చక్కెర మిల్లులు, డిస్టిలరీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 243 ప్రాజెక్టులను కేంద్రం ఆమోదించగా, బ్యాంకులు రూ. 20,334 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. వచ్చే 9–10 నెలల్లో అదనంగా 250–300 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి రాగలదని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment