
పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి
గౌహతి: పెట్రోల్(Petrol)లో జీవ ఇంధనం ఇథనాల్(Ethanol)ను 20 శాతానికి పైగా కలపడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలనుకుంటున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఇందులో సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నీతి ఆయోగ్య సారథ్యంలో ఓ కమిటీ ఏర్పాటైందని వెల్లడించారు. పెట్రోల్‌లో 19.6 శాతం ఇథనాల్ కలపాలన్న లక్ష్యాన్ని ఇప్పటికే సాధించామన్నారు. 20 శాతం ఇథనాల్‌ను కలపాలన్న లక్ష్యాన్ని 2026 నాటికి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అయితే అంతకుమునుపే అంటే వచ్చే నెలలోనే ఈ లక్ష్యాన్ని సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అడ్వాంటేజ్ అసోం 2.0 బిజినెస్ సమిట్‌లో బుధవారం మంత్రి పురి ప్రసంగించారు. మనకు 1,700 కోట్ల లీటర్ల ఇథనాల్‌ను కలిపే సామర్థ్యముండగా ఇప్పటికే 1,500 కోట్ల లీటర్లను వాడుతున్నామని చెప్పారు. వివిధ రకాలైన ఇంధన దిగుమతుల కోసం దేశం ఏటా 15,000 కోట్ల డాలర్లను విచ్చిస్తోందని మంత్రి వివరించారు. అయితే, సంప్రదాయ ఇంధనాలకు బదులుగా గ్రీన్ హైడ్రోజన్‌పై దృష్టి సారించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్ ధర 4.5 డాలర్లుగా ఉంది. దీనిని 2.5 డాలర్లకు తగ్గించ గలిగితే ఈ రంగంలో పెను విప్లవమే వస్తుందన్నారు.
ఇదీ చదవండి: అగ్రి, గృహ రుణాల్లో ఎగవేతలు పెరగొచ్చు
ప్రస్తుతం మన దేశంలో రోజుకు 55 లక్షల బారెళ్ల ముడి చమురును వాడుతున్నామని మంత్రి తెలిపారు. సమీప భవిష్యత్తులో ఇది 65 లక్షల బ్యారెళ్ల నుంచి 70 లక్షల బ్యారెళ్లకు పెరగనుందని, అదేవిధంగా దేశీయ పెట్రోలియం, సహజ వాయువుల ఉత్పత్తి 2030కల్లా 50 లక్షల టన్నులకు చేరనుందని మంత్రి పురి అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment