కాలం తిరిగి రాదు. కాలం విలువైనది. తెలుసు మనకు. కాని డిజిటల్ చొరబాటు పెరిగాక సమయమంతా ఫోన్‌కే పోయిందా? ఒక ఇంట్లో భార్య 3 గంటలు, భర్త 3 గంటలు, పిల్లలు చెరి 3 గంటలు ఫోన్ వాడితే రోజులో 12 విలువైన గంటలు నాశనమైపోతాయి. 2023లో మీ కుటుంబం మొత్తం కనీసం 180 రోజులు ఫోన్‌లో వృథా చేసింది. 2024లో మీ సమయం మీరు పొందగలరా?
ఏదో సినిమాలో ‘నేనొక వంద రూపాయల అవినీతి చేస్తే తప్పేంటి?’ అని విలన్ అంటే, ‘అలా వంద రూపాయల అవినీతి కోటి మంది చేస్తే చిన్న తప్పు అవుతుందా?’ అని హీరో ప్రశ్నిస్తాడు.
సేమ్.
‘ఇంట్లో కాసేపు ఫోన్ చూస్తే తప్పేంటి?’ అని తల్లో, తండ్రో, కొడుకో, కూతురో అనుకోవచ్చు. ‘మీ అందరూ కలిసి చాలా టైమ్ వేస్ట్ చేయడం తప్పే’ అని సమాధానం చెప్పాల్సి వస్తుంది.
టైమ్‌ను సద్వినియోగం చేస్తే చాలా పనులు అవుతాయి. దుర్వినియోగం చేస్తే చాలా నష్టాలు తప్పక జరుగుతాయి.
ఇటీవల చాలా స్కూళ్లల్లో పిల్లలు సరిగ్గా ఎగ్జామ్స్ రాయడం లేదని టీచర్లు మొత్తుకుంటున్నారు. దానికి కారణం పిల్లలు ఎగ్జామ్స్‌కు చదవడానికి కూచుని ఫోన్లు చూస్తున్నారని అర్థమవుతోంది. కరోనా వల్ల జరిగిన చాలా నష్టాల్లో పిల్లలకు ఫోన్లు అలవాటు కావడం ఒకటి. వాళ్లు ఫోన్లకు అడిక్ట్ అవడం వారి భవిష్యత్తునే ప్రభావితం చేస్తోంది. పిల్లల్ని ఫోన్లు చూడొద్దని చెప్పే నైతిక హక్కు తల్లిదండ్రులకు ఎప్పుడు వస్తుంది? వాళ్లు ఫోన్లు చూడనప్పుడు. కాని తల్లిదండ్రులు పిల్లల కంటే ఎక్కువగా ఫోన్లకు అలవాటు పడి ఉన్నారు. మానసిక, శారీరక, కౌటుంబిక, ఆర్థిక, అనుబంధ జీవనాలన్నింటికీ ఈ ఫోన్ వల్ల వృథా అవుతున్న సమయం చావు దెబ్బ తీస్తోంది.
ఫోన్ ఎందుకు? కాల్స్ మాట్లాడేందుకు. ఏ మనిషికైనా రోజులో ఐదారు కాల్స్ మాట్లాడే అవసరం ఉంటుంది. ఉద్యోగాల్లో వృత్తిగతమైన కాల్స్ ఆఫీస్ టైమ్ కిందకే వస్తాయి. కాని ప్రయివేట్ టైమ్‌లో ఫోన్లు– అవసరమైనవి మాత్రమే తీసుకుంటే ఐదారు మించవు. మరి ఫోన్లకు ఇవాళ ఎలా వాడుతున్నారు? ఫోనులోని ఏవేవి మీ సమయాన్ని తీసుకుంటున్నాయి?
1. వాట్సాప్, 2.యూట్యూబ్, 3. రీల్స్
4. ఫేస్‌బుక్, 5. ఓటీటీ యాప్స్ 6. ‘ఎక్స్’(ట్విటర్) 7.ఇన్‌స్టా
ఇప్పుడు 2023లో వీటి ద్వారా నిజంగా మీరు పొందిన జ్ఞానం ఎంత? ప్రయోజనం ఎంత? లాభం ఎంత? ఆలోచించండి. వీటిని చూడటం వల్ల ఆర్థికంగా ఏమైనా ఉపయోగం జరిగిందా? ఆరోగ్య పరంగా ఏదైనా ఉపయోగం జరిగిందా? ఉద్యోగాలు వచ్చాయా? ప్రమోషన్లు సమకూరాయా? పిల్లలకు ర్యాంకులు వచ్చాయా?
కెరీర్, విద్య కోసం సోషల్ మీడియాను ఉపయోగిస్తే సరే. లేకుండా ఊరికే కాలక్షేపం కోసం ఫోన్‌ను స్క్రోల్ చేస్తూ రోజులు దొర్లించేస్తే ఏం సాధించినట్టు?
‘తేనెలో భార్యాభర్తల ఫొటో కూరితే వారు అన్యోన్యంగా ఉంటారు’, ‘షూటింగ్ మధ్యలో హీరో హీరోయిన్‌తో ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు’, ‘మా హోమ్‌టూర్‌కు రెడీయా?’... ఇలాంటి వీడియోలు, పిచ్చి నృత్యాల రీల్స్... వీటితో సమయం వృధా అయిపోతోంది ఫోన్ వల్ల. క్రైమ్, సస్పెన్స్, హారర్ వెబ్ సిరీస్‌లు బింజ్‌వాచ్ చేస్తే సమయం మొత్తం వృథా. గేమ్స్‌లో కూరుకు పోతే, ఫోన్‌లో బెట్టింగ్‌లకు అలవాటు పడితే, ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు అడిక్ట్ అయితే, పోర్న్ వీడియోలు వదల్లేకపోతే... సమయం వృథా, వృథా, వృథా.
పుస్తకం మనం ఎంచుకుని చదివేది. ఫోన్ అదేం చూపాలనుకుంటే అది చూపేది.
కుటుంబం మొత్తం కలిసి ఏదైనా రెస్టరెంట్‌కు వెళితే కుటుంబ సభ్యులు నలుగురూ ఫోన్లు చూసుకుంటూ కూచుని ఉంటే కనుక అది ఏ మాత్రం కమ్యూనికేషన్ ఉన్న కుటుంబం కాదు. ప్రతి ఒక్కరూ సంబంధం లేని కంటెంట్‌తో కమ్యూనికేషన్‌లో ఉన్నట్టు. కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం, వ్యాయామానికి ఇవ్వాల్సిన సమయం, స్నేహితులను పరామర్శించుకోవడానికి ఇవ్వాల్సిన సమయం, డాక్యుమెంట్స్ చక్కదిద్దుకోవాల్సిన సమయం, బ్యాంకు లావాదేవీలు.. పాలసీలు సరి చేసుకోవాల్సిన సమయం, సంపాదన మెరుగు పర్చుకోవాల్సిన సమయం, డబ్బు ఆదా కోసం వెచ్చించాల్సిన సమయం, పిల్లల్ని చదివించాల్సిన సమయం, భార్యాభర్తలు కలిసి మాట్లాడుకోవాల్సిన సమయం మొత్తం ఫోన్ల వల్ల, సోషల్ మీడియా వల్ల 2023లో ఎంత వృథా అయ్యిందో ఆలోచిస్తే 2024ను సరిగ్గా ఆహ్వానించగలుగుతారు.
2024వ సంవత్సరం విలువైన కాలాన్ని వెంటబెట్టుకుని వస్తోంది. సద్వినియోగం చేసుకోండి.
Comments
Please login to add a commentAdd a comment