సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్‌లో తీవ్రంగా విస్తరిస్తోంది.మరోవైపు ఇప్పటికే దేశంలో కోవీషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్-వి అనే మూడు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా డిమాండ్‌కు తగినంత సరఫరా లేక వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ జైడస్ క్యాడిలా సంస్థ ఊరట నందించే కబురు చెప్పింది. తాము అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ `జైకోవ్-డి` భారత్‌లో అత్యవసర వినియోగానికి అనుమతులకు దరఖాస్తు చేయనుంది. అంతేకాదు త్వరలోనే అనుమతులు వస్తాయనే ధీమా వ్యక్తం చేస్తోంది.
తమ కంపెనీ కోవిడ్ వ్యాక్సిన్ జైకోవ్-డి భారతదేశంలో ఆమోదం పొందే సమయం చాలా దగ్గరలోనే ఉందని జైడస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ షార్విల్ పటేల్ తెలిపారు. ఈ నెలలో అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. దీనికి సంబంధించిన అనుమతులు కూడా ఈ నెలలోనే లభించనున్నాయనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. తమ పెయిన్‌లెస్ కోవిడ్ -19 వ్యాక్సిన్‌కు అనుమతి లభిస్తే నెలకు కోటి మోతాదులను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందన్నారు. రెగ్యులేటరీ అనుమతులు లభిస్తే, జూలై నుంచే వ్యాక్సిన్ల ఉత్పత్తిని ప్రారంభిస్తామని పటేల్ తెలిపారు.
ఇంట్రాడెర్మల్ ఇంజెక్షన్ ద్వారా అందించే ఈ వ్యాక్సిన్ 2-8 డిగ్రీల సెల్సియస్ మధ్య నిల్వ చేయవలసి ఉన్నప్పటికీ, 25 డిగ్రీల సెల్సియస్ రూం టెంపరేచర్ వద్ద కూడా స్టోర్ చేయవచ్చని, నిర్వహించడం చాలా సులభమని పటేల్ వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 28 వేల మందిపై `జైకోవ్-డీ’ వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌ను సంస్థ ప్రారంభించిందనీ, ఈ నెలలోనే దీనికి సంబంధించిన మధ్యంతర ఫలితాలు రానున్నాయని చెప్పారు. అంతేకాదు 12-17 ఏళ్లలోపు పిల్లలను కూడా ఇందులో చేర్చినట్టు తెలిపారు. ఈ మూడు డోసుల టీకా వల్ల యాంటీ బాడీలు ఎక్కువ కాలం శరీరంలో ఉంటాయని కంపెనీ చెబుతోంది. మేడిన్ ఇండియా టీకా ఉత్పత్తికి ఇప్పటికే మరో రెండు తయారీ సంస్థలతో చర్చలు జరుపుతోంది. తద్వారా నెలకు 3-4 కోట్ల మోతాదులను ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యం. దీనికి అమోదం లభిస్తే జైకోవ్-డీ దేశంలో నాలుగో వ్యాక్సిన్ అవుతుంది.
చదవండి : కోవిన్ యాప్: కొత్త సెక్యూరిటీ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?
కరోనా నుంచి కోలుకున్నారా? ఇక వీటిని పాడేయాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment