బీజింగ్ : సినోవాక్ బయోటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కరోనావాక్‌కు జులైలోనే చైనా అత్యవసర వాడకానికి అనుమతించింది. వైద్య సిబ్బంది వంటి హైరిస్క్ గ్రూపులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కరోనావ్యాక్సిన్ అత్యవసర వాడకానికి తమకు కూడా అనుమతి లభించిందని చైనా జాతీయ ఫార్మస్యూటికల్ గ్రూప్‌నకు చెందిన చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్ (సీఎన్‌బీజీ) కూడా సోషల్ మీడియా వేదిక విచాట్‌లో పేర్కొంది. సీఎన్‌బీజీ అభివృద్ధి చేస్తున్న రెండు కరోనా వ్యాక్సిన్లు మూడో దశ పరీక్షల్లో ఉండగా ఏ వ్యాక్సిన్‌కు అత్యవసర వాడకానికి చైనా అనుమతించిందనేది ఆ సంస్థ వెల్లడించలేదు. ప్రయోగ దశలో ఉన్న వివిధ కరోనా వ్యాక్సిన్లను జులై నుంచే అధిక ముప్పున్న వ్యక్తులకు ఇచ్చేందుకు చైనా అనుమతించింది. వర్షాకాలంలో వ్యాధి తీవ్రతను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ అత్యవసర వాడకాన్ని స్వల్పంగా విస్తరించేందుకు అధికారులు కసరత్తు చేయాలని ఆరోగ్య శాఖ అధికారి ఓ వార్తఛానెల్‌తో మాట్లాడుతూ అన్నారు.
అయితే హైరిస్క్ ప్రజలకు ఏయే కరోనా వ్యాక్సిన్లను అత్యవసర వాడకానికి అనుమతించారు, ఎంతమందికి వ్యాక్సినేషన్ జరిగిందనే వివరాలను చైనా అధికారికంగా వెల్లడించలేదు.జులైలో ఎమర్జెన్సీ యూజ్ కార్యక్రమం ప్రారంభయ్యే ముందు చైనా మీడియా కొన్ని వివరాలు వెల్లడించింది. విదేశీ పర్యటనలకు వెళ్లే ప్రభుత్వ ఉద్యోగులకు సీఎన్‌బీజీ అభివృద్ధి చేస్తున్న రెండు కరోనా వ్యాక్సిన్లలో ఒక వ్యాక్సిన్‌ను వేస్తారని చైనా మీడియా అప్పట్లో తెలిపింది. మరోవైపు కాన్‌సినో బయలాజిక్స్ వ్యాక్సిన్ వాడకాన్ని చైనా సైన్యం ఆమోదించింది. కరోనా వైరస్ నిరోధానికి ప్రపంచవ్యాప్తంగా ఏడు వ్యాక్సిన్లు తుది దశ పరీక్షల్లో ఉండగా వాటిలో చైనా వ్యాక్సిన్లు నాలుగు ఉన్నాయి. కరోనా వైరస్ నుంచి పూర్తి భద్రత, సామర్ధ్యాన్ని కల్పించే దిశగా ఏ ఒక్క వ్యాక్సిన్ తుది దశ పరీక్షలను ఇప్పటివరకూ విజయవంతంగా పూర్తిచేయలేదు. కరోనా వైరస్‌తో ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 8 లక్షల మంది మరణించారు. చదవండి : వీచాట్ బ్యాన్ : డ్రాగన్ టిట్ ఫర్ టాట్ వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment