Smartphones Usage
-
ప్రాభవం కోల్పోతున్న డెబిట్ కార్డ్
న్యూఢిల్లీ: యూపీఐ అత్యంత సౌకర్యవంతమైన చెల్లింపుల సాధనంగా మారిపోవడంతో, ఇంత కాలం సంపద్రాయ చెల్లింపుల్లో సింహభాగం ఆక్రమించిన డెబిట్ కార్డ్ చిన్నబోతోంది. ముఖ్యంగా కరోనా తర్వాతి నుంచి డిజిటల్ చెల్లింపుల్లో సమూల మార్పు కనిపిస్తోంది. వర్తకుల చెల్లింపులు, వ్యక్తిగత నగదు బదిలీలకు సైతం యూపీఐని ఎక్కువ మంది అనుసరిస్తున్నారు. ఈ వివరాలను ఆర్బీఐ వెల్లడించింది. 2020 జూలైలో డెబిట్ కార్డులపై చేసిన చెల్లింపుల విలువ రూ.2.81 లక్షల కోట్లు. 2023 జూలైలో డెబిట్ కార్డుల చెల్లింపుల విలువ రూ.3.15 లక్షల కోట్లుగా ఉంది. అంటే మూడేళ్లలో వృద్ధి 12 శాతంగా ఉంది. కానీ, ఇదే కాలంలో యూపీఐ చెల్లింపుల్లో ఎన్నో రెట్ల వృద్ధి నమోదైంది. ఈ కాలంలో యూపీఐ చెల్లింపుల విలువ రూ.2.90 లక్షల కోట్ల నుంచి రూ.15.33 లక్షల కోట్లకు దూసుకుపోయింది. ఇది 428 శాతం వృద్ధికి సమానం. చిన్న మొత్తాల చెల్లింపుల్లో యూపీఐకి ఉన్న సౌలభ్యంతో డెబిట్ కార్డు చెల్లింపులపై ప్రభావం పడినట్టు తెలుస్తోంది. ఎన్నో సానుకూలతలు.. ఈ ఏడాది ఆగస్ట్ నెలలో యూపీఐ లావాదేవీలు మొదటి సారి 1000 కోట్లను అధిగమించాయి. విలువ రూ.15 లక్షల కోట్లుగా ఉంది. 2020 జూలై నాటికి బ్యాంకులు 85 కోట్ల డెబిట్ కార్డులను జారీ చేశాయి. వీటి సంఖ్య తాజాగా 97 కోట్లను అధిగమించాయి. ఈ వృద్ధి కూడా ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ఖాతాలకు అనుబంధంగా ఉచితంగా డెబిట్ కార్డులు జారీ చేయడం వల్లేనని చెప్పుకోవాలి. ముఖ్యంగా యూపీఐ లావాదేవీలు ఎన్నో రెట్లు వృద్ధి చెందడానికి గ్రామీణ ప్రాంతాల్లోనూ స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడం ఓ కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి చార్జీల్లేకపోవడం, వేగంగా, సౌకర్యంగా చెల్లింపులు చేసుకునే వెసులుబాటు, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ వినియోగం విస్తరణ ఇందుకు దోహదం చేసినట్టు క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అనికేత్ దని తెలిపారు. కేంద్రం డిజిటైజేషన్‌కు ప్రాధాన్యం ఇస్తుండడంతో యూపీఐ చెల్లింపులు ఇక ముందూ జోరుగా కొనసాగుతాయన్న అంచనా వ్యక్తమవుతోంది. వచ్చే 18–24 నెలల్లో 2,000 కోట్ల నెలవారీ యూపీఐ లావాదేవీలు నమోదు కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. క్రెడిట్ కార్డుకూ ఆదరణ మరోవైపు క్రెడిట్ కార్డు చెల్లింపులు కూడా గణనీయమైన వృద్ధిని చూస్తున్నాయి. 2020 జూలైలో 0.45 లక్ష కోట్ల విలువైన లావాదేవీలు నమోదు కాగా, 2023 జూలై నెలకు రూ.1.45 లక్షల కోట్ల వినియోగం నమోదైంది. ‘‘రివార్డుల రూపంలో వచ్చే ప్రయోజనాలను పొందేందుకు, క్యాష్ బ్యాక్ లేదా తగ్గింపు ప్రయోజనాల కోసం ఎక్కువ మంది క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా గ్రోసరీ, ఎల్రక్టానిక్స్ కొనుగోళ్లు తదితర పెద్ద చెల్లింపులకు క్రెడిట్ కార్డుల రూపంలో చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనివల్ల వారు పలు రకాల ప్రయోజనాలు పొందే అవకాశం వారిని ఈ దిశగా ప్రోత్సహిస్తోంది’’అని పైసాబజార్ క్రెడిట్ కార్డ్ హెడ్ రోహిత్ చిబార్ తెలిపారు. కో బ్రాండెడ్ కార్డులు సైతం మొత్తం మీద క్రెడిట్ కార్డుల వినియోగం వృద్ధికి దోహదపడుతున్నాయి. కరోనా అనంతరం వినియోగదారుల వ్యయాల్లో వచి్చన మార్పులను గమనించిన బ్యాంకర్లు పలు రకాల ఆకర్షణీయమైన రివార్డులతో కస్టమర్లకు క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తుండడం కూడా ఈ వృద్ధిని ప్రోత్సహిస్తోంది. -
పిల్లలకు వాటిని దూరం చేయండి.. లేదంటే రాత్రి నిద్రపోయే ముందు పడకపై..
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్... ఆధునిక యుగంలో మనుషుల శరీరంలో ఒక అవయవంగా మారిపోయిందనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. కోవిడ్–19 మహమ్మారి రంగప్రవేశం చేశాక స్మార్ట్ఫోన్ల బెడద మరింత పెరిగింది. ఆన్లైన్ క్లాసుల పేరుతో పిల్లలు సైతం ఈ ఫోన్లకు అలవాటుపడ్డారు. ఎంతగా అంటే.. మన దేశంలో 23.8 శాతం మంది పిల్లలు పడుకునే ముందు పడకపై ఫోన్ ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ఫోన్లు ఉపయోగిస్తున్న చిన్నారుల్లో 37.15 శాతం మందిలో ఏకాగ్రత స్థాయిలు తగ్గిపోతున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బుధవారం లోక్‌సభలో లిఖితపూర్వకంగా తెలియజేశారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చేపట్టిన అధ్యయనాన్ని బట్టి చూస్తే.. భారత్‌లో 23.80 శాతం మంది రాత్రిపూట నిద్రపోయే ముందు పడకపై స్మార్ట్‌ఫోన్ వాడుతున్నట్లు స్పష్టమవుతోందని పేర్కొన్నారు. 37.15 శాతం మంది చిన్నారుల్లో స్మార్ట్‌ఫోన్ వాడకంవల్ల ఎల్లప్పుడూ లేదా తరచుగా ఏకాగ్రతా స్థాయిలు తగ్గుతున్నాయి. -
పుర్రె ఎముకలు పెరుగుతున్నాయి
స్మార్ట్ఫోన్లతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అంతేస్థాయిలో నష్టాలు ఉన్నాయని మనం తరచూ వింటుంటాం. సామాజిక సంబంధాలు తగ్గిపోతాయని.. అదేపనిగా టైప్ చేయడం వల్ల వేళ్లు, కీళ్ల నొప్పులు ఎక్కువవుతాయని చెబుతుంటారు. తాజాగా స్మార్ట్‌ఫోన్ అతి వాడకం పుణ్యమా అని మన పుర్రెల్లో కొన్ని ఎముకలు అవసరానికి మించి పెరుగుతున్నాయని ఆస్ట్రేలియాలోని సన్‌షైన్ కోస్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఊరట కలిగించే విషయం ఏంటంటే దీంతో ఎలాంటి ఆరోగ్య సమస్యల్లేకపోవడం. ఒకప్పుడు ఇలాంటి ఎముక పెరుగుదల అరుదుగా.. లక్షల్లో కొందరికి జరుగుతాయని భావించినా.. స్మార్ట్ఫోన్ల పుణ్యమా అని ఇప్పుడు వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. పుర్రె వెనుక భాగంలో తాకితే తెలిసేంత సైజుకు ఎముకలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాము 18–30 ఏళ్ల మధ్య వయసున్న ఓ వెయ్యి మంది పుర్రెలను పరిశీలించిన తర్వాత తాము ఈ అంచనాకు వచ్చామని డాక్టర్ డేవిడ్ షహర్ అనే శాస్త్రవేత్త తెలిపారు. వైద్య వృత్తిలో 20 ఏళ్లుగా ఉన్న తాను గత పదేళ్ల నుంచి ఎముక పెరుగుదలకు సంబంధించిన కేసులను ఎక్కువగా చూస్తున్నట్లు డేవిడ్ తెలిపారు. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లను వాడేటప్పుడు మనం మెడను వంచి కిందకు చూస్తూ ఉండటం సమస్యకు మూలకారణమని.. సాధారణ పరిస్థితుల్లో అతితక్కువగా ఉపయోగించే కండరాలను తల వంచినప్పుడు వాడుతుండటంతో ఆ అదనపు బరువును తట్టుకునేందుకు, తల నిలకడగా ఉండేందుకు ఈ ఎముకల పెరుగుదల అవసరమవుతుందని చెప్పారు. మెడను, వెన్నును కలిపే కండరాలపై ఎక్కువ ఒత్తిడి పడకుండా ఉండేందుకు శరీర వ్యవస్థ ఎముకలు పెరిగేలా చేస్తుందని అంచనా. అంగుళం మేర పెరుగుదల.. ఈ అధ్యయనంలో కొంతమంది యువకుల ఎముకలు ఒక అంగుళం మేర పెరిగినట్లు తెలిసింది. 1996 నాటితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. గతేడాది నీల్సన్ సంస్థ జరిపిన ఒక సర్వే ప్రకారం భారత్‌లో మొబైల్‌ఫోన్ సగటు వినియోగం రోజుకు 90 నిమిషాలు. బాగా ఖరీదైన ఫోన్లు వాడే వారైతే 2 గంటల 10 నిమిషాలు వాడుతున్నారు. బ్రిటన్‌లో ఇది రెట్టింపు కంటే ఎక్కువ. కచ్చితంగా చెప్పాలంటే రోజుకు మూడున్నర గంటల పాటు యువత స్మార్ట్ఫోన్లను వాడుతోంది. -
21 బిలియన్ డాలర్లకు మొబైల్ సర్వీసెస్ మార్కెట్
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్‌లో మొబైల్ సర్వీసెస్ మార్కెట్ 21.4 బిలియన్ డాలర్లకు చేరుతుందని గార్ట్నర్ పేర్కొంది. ట్యాబ్లెట్స్, నోట్‌బుక్స్ వంటి డేటా-సెంట్రిక్ పరికరాల్లో సెల్యులార్ సేవల వినియోగం పెరగటమే దీనికి కారణంగా కనిపిస్తోంది. మొబైల్ సర్వీసెస్ మార్కెట్ వృద్ధి 4 శాతంగా ఉంటుందని అంచనా. డేటా సేవల వినియోగం పెరుగుదలతో మొబైల్ సేవల ఖర్చు 15 శాతం వృద్ధితో 6.5 మిలియన్ డాలర్లకు చేరనుంది. భారత్‌లో గతేడాది 83 కోట్లుగా ఉన్న మొబైల్ కనెక్షన్ల సంఖ్య ఈ ఏడాది 5 శాతం వృద్ధితో 88 కోట్లకు చేరుతుందని అంచనా. స్మార్ట్ఫోన్ల వినియోగంలో వృద్ధి వంటి అంశాలూ డేటా సేవల ఖర్చు పెరుగుదలకు దోహదపడనున్నాయి.