కొత్త మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను పెంపు
త్వరలో ఆస్తుల గణనకు సర్వే
అనంతరం కొత్త రేట్లపై నిర్ణయుం
ఏప్రిల్ 2015 నుంచి సవరించిన పన్నుల వసూళ్లు
పురపాలక శాఖ ప్రతిపాదనలకు సీఎం ఆమోదం
8 నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఫైల్‌కు మోక్షం
హైదరాబాద్: రాష్ట్రంలోని కొత్త మున్సిపాలిటీలతో పాటు నరగపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో విలీనమైన గ్రామ పంచాయతీల్లో త్వరలో ఆస్తి పన్ను పెరిగే అవకాశముంది. కొత్త మున్సిపాలిటీలు, విలీన గ్రామాల్లో మున్సిపల్ చట్టం ఆధారంగా ఆస్తి పన్నుల సవరణకు అనుమతులు కోరుతూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వానికి 8 నెలల క్రితం అప్పటి పురపాలక శాఖ కమిషనరేట్ కార్యాలయం ప్రతిపాదనలు పంపింది. అరుుతేమున్సిపల్ ఎన్నికల కారణంగా అప్పటి ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను పెండింగ్‌లో పెట్టింది. తాజాగా పాత ఫైళ్ల క్లియరెన్స్‌ను వేగవంతం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవలే ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు అధికారవర్గాలు వెల్లడించారుు. దీంతో రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 46 నగర పంచాయతీలతో పాటు వందకు పైనే ఉన్న విలీన గ్రామాల్లో 2015 ఏప్రిల్ నుంచి సవరించిన ఆస్తి పన్నులు అమలులోకి రానున్నాయి.
ప్రస్తుతం ఈ మున్సిపాలిటీల్లో పంచాయతీ చట్టాలకు అనుగుణంగానే ఆస్తి పన్నులు వసూలు చేస్తున్నారు. భూమి విలువ, అద్దెధర తదితర అంశాల ఆధారంగా రాష్ట్రంలోని పంచాయతీల్లో ఆస్తి పన్నులను నిర్ణయించి వసూలు చేస్తున్నారు. దీంతో ఒక్కో చోట ఒక్కో విధంగా ఆస్తి పన్నుల రేట్లు ఉంటున్నాయి. నివాస, వ్యాపార సంస్థల నుంచి వసూలు చేసే పన్నుల్లో సైతం పెద్దగా తేడా ఉండడం లేదు. ఈ నేపథ్యంలో కొత్త మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుల సవరణ కోసం త్వరలో గెజిట్ ప్రకటన జారీ చేయనున్నారు. మెుదట మున్సిపాలిటీని వివిధ భాగాలుగా విభజించి శాస్త్రీయ పద్ధతులో ఆస్తుల గణనకు సర్వే నిర్వహిస్తారు. దీని కోసం భవనాల కొలతలు నమోదు చేస్తారు. అద్దె విలువ, వినియోగం, ఏరియా ఆధారంగా ఆస్తి పన్నులను నిర్ణయించి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించేందుకు ప్రకటన జారీ చేస్తారు. గడువులోగా అభ్యంతరాలు పరిష్కరించిన అనంతరం మరో మారు అభ్యంతరాలకు అవకాశమిస్తారు. చివరగా నిర్ణయించిన ఆస్తి పన్నుల రేట్లతో తుది గెజిట్ ప్రకటన జారీ చేస్తారు. ఆస్తి పన్నుల గణన, ప్రజామోదం పొందే వరకు కనీసం మూడు నెలల సమయం ఇస్తారు.
ఆస్తి పన్ను బోర్డుకు సుస్తి!
మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుల సవరణ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ ప్రాపర్టీ ట్యాక్స్ బోర్డు ఆధ్వర్యంలో జరగాల్సి ఉంది. రిటైర్డు హైకోర్టు జడ్జి నేతృత్వంలో స్వతంత్ర సంస్థగా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేసింది. కొత్త నగర పంచాయతీల్లో ఆస్తి పన్నుల సవరణ విషయంలో ఈ బోర్డును అప్పటి ప్రభుత్వం పక్కనపెట్టింది. తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ అధికారులు సైతం ఆస్తి పన్ను బోర్డును పక్కనపెట్టి స్వయంగా నిర్ణయం తీసుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నారుు.