సుమోటో పేరిట డాక్యుమెంట్లు కావాలంటున్న బల్దియా
అడ్డగోలుగా నోటీసులు జారీ చేస్తున్న జీహెచ్‌ఎంసీ
గగ్గోలు పెడుతున్న సామాన్య ప్రజలు
సాక్షి, సిటీబ్యూరో: ‘తిమ్మిని బమ్మి చేసే సత్తా వారి సొంతం. వారు తల్చుకుంటే లక్షల రూపాయల ఆస్తిపన్ను వేలల్లోనే వస్తుంది. వందల్లో రావాల్సింది వేలల్లో కూడా అవుతుంది’.. జీహెచ్‌ఎంసీ బిల్‌కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ల గురించి సామాన్య జనానికి ఉన్న అభిప్రాయం ఇది. ఈ పరిస్థితిని నివారించేందుకే గతంలో ఆస్తిపన్ను అసెస్‌మెంట్ల కోసం ప్రజల ఇళ్ల వద్దకు ట్యాక్స్ సిబ్బంది వెళ్లవద్దని అప్పటి కమిషనర్ లోకేశ్‌కుమార్ ఆదేశించారు.
ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోవాల్సిందిగా ప్రజలకు సూచించారు. ఆ విధానం వల్ల ఏ డాక్యుమెంట్లు పెట్టినా ఆస్తిపన్ను గుర్తింపు నంబరు(పీటీఐఎన్) జనరేట్ కావడంతో పాటు చివరకు జీహెచ్‌ఎంసీ భవనాలను సైతం ఎవరైనా తమ ఆస్తిగా చూపించుకునే అవకాశం ఏర్పడటంతో దానికి స్వస్తి పలికారు. మరోవైపు.. జీహెచ్‌ఎంసీకి వస్తున్న ఆదాయానికి, ఖర్చులకు హస్తిమశకాంతరం వ్యత్యాసం ఉండటంతో.. ఆదాయం పెంచుకునే చర్యల్లో భాగంగా తిరిగి అసెస్‌మెంట్‌ను ట్యాక్స్ సిబ్బంది ‘సుమోటో’గానే చేసేందుకు గత జూలైలో ఆదేశించారు.
దీంతో ఎంతోకాలం చేతులు కట్టిపడేసినట్లున్న ట్యాక్స్ సిబ్బందికి ఒక్కసారిగా వెయ్యేనుగుల బలం వచ్చినట్లయింది. ఇంకేముంది? అసెస్‌మెంట్ చేసుకోవాల్సిందిగా కొత్త భవనాల వద్దకు, అసెస్‌మెంట్లలో వ్యత్యాసాలున్నాయంటూ అన్ని భవనాల ప్రజల వద్దకు వెళ్తున్నారు. వారి వైఖరికి ఆసరానిస్తూ సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు నోటీసులు జారీ చేస్తున్నారు.
చెప్పిందొకటి.. చేస్తున్నదొకటి
ఆస్తిపన్ను ద్వారా ఆదాయం పెంచుకునే చర్యల్లో భాగంగా.. తేడాలున్నట్లు గుర్తించిన వాణిజ్య భవనాలను, అదనపు అంతస్తులు వెలసిన ఇతరత్రా భవనాలను గుర్తించి నిజమైన ఆస్తి పన్ను విధించాల్సిందిగా సంబంధిత ఉన్నతాధికారులు సూచించారు. ట్యాక్స్ సిబ్బంది మాత్రం నివాస, వాణిజ్య భవనం అన్న తేడా లేకుండా.. అదనపు అంతస్తులు నిర్మించినా, నిర్మించకున్నా జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 213 కింద నోటీసులిచ్చేస్తున్నారు. సదరు సెక్షన్ మేరకు సరైన ఆస్తిపన్ను నిర్ధారించేందుకు జీహెచ్‌ఎంసీ కోరిన వివరాల్ని భవన యజమానులు లేదా ఆక్యుపైయర్లు తెలియజేయాలి.
లక్ష్యం ఒకటి.. పని మరొకటి
నిజమైన ఆస్తిపన్ను కట్టకుండా లక్షలు, కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నవారి నుంచి సరైన ఆస్తిపన్ను వసూలు చేయడం, ఇప్పటికే ఉన్న భవనాల మీద కొత్తగా నిర్మించిన అదనపు అంతస్తులను ఆస్తిపన్ను పరిధిలోకి తేవడం ద్వారా ఆస్తిపన్ను ఆదాయం పెంచుకోవాలనేది ఉన్నతాధికారుల లక్ష్యం. దీంతోపాటు దశాబ్దం క్రితం జరిగిన కంప్యూటరీకరణ సందర్భంగా చాలా ఇళ్ల ప్లింత్ ఏరియా ఎంత ఉందో నమోదు చేయలేదు. అలాంటి వాటి ప్లింత్ ఏరియాను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు వివరాలు సేకరించాల్సి ఉండగా.. అన్ని ఇళ్లనూ ఒకే గాటన కట్టి నోటీసులిస్తూ సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఎక్కువ ఆస్తిపన్నును తక్కువ చేస్తామంటూ ట్యాక్స్ సిబ్బంది జేబులు నింపుకొంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లేని పక్షంలో ఎక్కువ ఆస్తిపన్ను కట్టాలంటూ బెదరగొడుతున్నట్లు సమాచారం. జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
నోటీసులిలా..
భవనం లేదా స్థలం.. యజమానులు కానీ ఆక్యుపైయర్లు కానీ ఏడు రోజుల్లోగా దిగువ పత్రాలు, సమాచారం అందజేయాలని నోటీసుల్లో పేర్కొంటున్నారు.
1. సేల్ డీడ్
2. లింక్ డాక్యుమెంట్ (ఏదైనా ఉంటే)
3. మంజూరు ప్లాన్/అనుమతి కాపీ
4. ఎప్పటి నుంచి ఉంటున్నారు ?
5.ఆక్యుపెన్సీ సర్టిఫికెట్
6. టాక్స్ రసీదు
7. రిజిస్టర్డ్ లీజ్ డీడ్(ఏదైనా ఉంటే) లేదా రెంటల్ అగ్రిమెంట్
8. భవనం కలర్ ఫొటో
దశాబ్దాల క్రితం నిర్మాణ అనుమతులు పొందిన వారిలో చాలామంది వద్ద పైన పేర్కొన్న డాక్యుమెంట్లన్నీ అందుబాటులో లేవు. కొన్ని భవనాలు చాలామంది చేతులు మారాయి. వాటన్నింటినీ ఇప్పుడెలా తేవాలో తెలియక వారు ఆందోళనకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment