Bill collectors
-
జీహెచ్ఎంసీ అడ్డగోలు నోటీసులు}
సాక్షి, సిటీబ్యూరో: ‘తిమ్మిని బమ్మి చేసే సత్తా వారి సొంతం. వారు తల్చుకుంటే లక్షల రూపాయల ఆస్తిపన్ను వేలల్లోనే వస్తుంది. వందల్లో రావాల్సింది వేలల్లో కూడా అవుతుంది’.. జీహెచ్ఎంసీ బిల్కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ల గురించి సామాన్య జనానికి ఉన్న అభిప్రాయం ఇది. ఈ పరిస్థితిని నివారించేందుకే గతంలో ఆస్తిపన్ను అసెస్మెంట్ల కోసం ప్రజల ఇళ్ల వద్దకు ట్యాక్స్ సిబ్బంది వెళ్లవద్దని అప్పటి కమిషనర్ లోకేశ్‌కుమార్ ఆదేశించారు. ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాల్సిందిగా ప్రజలకు సూచించారు. ఆ విధానం వల్ల ఏ డాక్యుమెంట్లు పెట్టినా ఆస్తిపన్ను గుర్తింపు నంబరు(పీటీఐఎన్) జనరేట్ కావడంతో పాటు చివరకు జీహెచ్ఎంసీ భవనాలను సైతం ఎవరైనా తమ ఆస్తిగా చూపించుకునే అవకాశం ఏర్పడటంతో దానికి స్వస్తి పలికారు. మరోవైపు.. జీహెచ్ఎంసీకి వస్తున్న ఆదాయానికి, ఖర్చులకు హస్తిమశకాంతరం వ్యత్యాసం ఉండటంతో.. ఆదాయం పెంచుకునే చర్యల్లో భాగంగా తిరిగి అసెస్మెంట్ను ట్యాక్స్ సిబ్బంది ‘సుమోటో’గానే చేసేందుకు గత జూలైలో ఆదేశించారు. దీంతో ఎంతోకాలం చేతులు కట్టిపడేసినట్లున్న ట్యాక్స్ సిబ్బందికి ఒక్కసారిగా వెయ్యేనుగుల బలం వచ్చినట్లయింది. ఇంకేముంది? అసెస్మెంట్ చేసుకోవాల్సిందిగా కొత్త భవనాల వద్దకు, అసెస్మెంట్లలో వ్యత్యాసాలున్నాయంటూ అన్ని భవనాల ప్రజల వద్దకు వెళ్తున్నారు. వారి వైఖరికి ఆసరానిస్తూ సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు నోటీసులు జారీ చేస్తున్నారు. చెప్పిందొకటి.. చేస్తున్నదొకటి ఆస్తిపన్ను ద్వారా ఆదాయం పెంచుకునే చర్యల్లో భాగంగా.. తేడాలున్నట్లు గుర్తించిన వాణిజ్య భవనాలను, అదనపు అంతస్తులు వెలసిన ఇతరత్రా భవనాలను గుర్తించి నిజమైన ఆస్తి పన్ను విధించాల్సిందిగా సంబంధిత ఉన్నతాధికారులు సూచించారు. ట్యాక్స్ సిబ్బంది మాత్రం నివాస, వాణిజ్య భవనం అన్న తేడా లేకుండా.. అదనపు అంతస్తులు నిర్మించినా, నిర్మించకున్నా జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 213 కింద నోటీసులిచ్చేస్తున్నారు. సదరు సెక్షన్ మేరకు సరైన ఆస్తిపన్ను నిర్ధారించేందుకు జీహెచ్ఎంసీ కోరిన వివరాల్ని భవన యజమానులు లేదా ఆక్యుపైయర్లు తెలియజేయాలి. లక్ష్యం ఒకటి.. పని మరొకటి నిజమైన ఆస్తిపన్ను కట్టకుండా లక్షలు, కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నవారి నుంచి సరైన ఆస్తిపన్ను వసూలు చేయడం, ఇప్పటికే ఉన్న భవనాల మీద కొత్తగా నిర్మించిన అదనపు అంతస్తులను ఆస్తిపన్ను పరిధిలోకి తేవడం ద్వారా ఆస్తిపన్ను ఆదాయం పెంచుకోవాలనేది ఉన్నతాధికారుల లక్ష్యం. దీంతోపాటు దశాబ్దం క్రితం జరిగిన కంప్యూటరీకరణ సందర్భంగా చాలా ఇళ్ల ప్లింత్ ఏరియా ఎంత ఉందో నమోదు చేయలేదు. అలాంటి వాటి ప్లింత్ ఏరియాను ఆన్లైన్లో నమోదు చేసేందుకు వివరాలు సేకరించాల్సి ఉండగా.. అన్ని ఇళ్లనూ ఒకే గాటన కట్టి నోటీసులిస్తూ సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఎక్కువ ఆస్తిపన్నును తక్కువ చేస్తామంటూ ట్యాక్స్ సిబ్బంది జేబులు నింపుకొంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లేని పక్షంలో ఎక్కువ ఆస్తిపన్ను కట్టాలంటూ బెదరగొడుతున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నోటీసులిలా.. భవనం లేదా స్థలం.. యజమానులు కానీ ఆక్యుపైయర్లు కానీ ఏడు రోజుల్లోగా దిగువ పత్రాలు, సమాచారం అందజేయాలని నోటీసుల్లో పేర్కొంటున్నారు. 1. సేల్ డీడ్ 2. లింక్ డాక్యుమెంట్ (ఏదైనా ఉంటే) 3. మంజూరు ప్లాన్/అనుమతి కాపీ 4. ఎప్పటి నుంచి ఉంటున్నారు ? 5.ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ 6. టాక్స్ రసీదు 7. రిజిస్టర్డ్ లీజ్ డీడ్(ఏదైనా ఉంటే) లేదా రెంటల్ అగ్రిమెంట్ 8. భవనం కలర్ ఫొటో దశాబ్దాల క్రితం నిర్మాణ అనుమతులు పొందిన వారిలో చాలామంది వద్ద పైన పేర్కొన్న డాక్యుమెంట్లన్నీ అందుబాటులో లేవు. కొన్ని భవనాలు చాలామంది చేతులు మారాయి. వాటన్నింటినీ ఇప్పుడెలా తేవాలో తెలియక వారు ఆందోళనకు గురవుతున్నారు. -
బస్తీల బాగుకు ‘బాధ్యులు’
- 330 మందికి బాధ్యతలు - సీఎం, మంత్రులతో పాటు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు సైతం.. - పచ్చదనం, పరిశుభ్రత, మౌలిక వసతుల కల్పనే ధ్యేయం సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని బస్తీలను సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు ప్రజలకవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సీఎం ఆలోచన మేరకు బస్తీల రూపురేఖలు మారేలా రంగం సిద్ధం చేస్తున్నారు. ఈమేరకు జీహెచ్ఎంసీలోని 330 డివిజన్లకు ప్రత్యేక బాధ్యులను నియమించనున్నారు. ఈ బాధ్యుల్లో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుతో పాటు ఆయన మంత్రి మండలి సభ్యులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఐఎఫ్ఎస్లు, ఇతరత్రా సివిల్‌సర్వీస్ అధికారులుండనున్నారు. తాము బాధ్యత వహించే డివిజన్లో పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం, మౌలిక సౌకర్యాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ముఖ్యంగా మహిళలకు ఎక్కువ భాగస్వామ్యం కల్పిస్తారు. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే 330 డివిజన్ల ముసాయిదాలను సిద్ధం చేసినట్లు తెలిసింది. జీహెచ్ఎంసీలో ఆస్తిపన్ను వసూళ్లు చేసే బిల్కలెక్టర్ల పరిధిలోకి వచ్చే ప్రాంతాల వారీగా ఈ 330 డివిజన్లు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఒక్కో డివిజన్‌కు ఒక్కో మంత్రి/ ఉన్నతాధికారి బాధ్యత వహించనున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సమన్వయ బాధ్యతలు నిర్వహించనున్నారు. జీహెచ్ఎంసీ విస్తీర్ణం 625 చ.కి.మీలు కాగా ఒక్కో అధికారి దాదాపు 2 చ.కి.మీల పరిధిలో పారిశుధ్యం, పరిశుభ్రత, పచ్చదనం పెంపు వంటి చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించి నగరాన్ని క్లీన్ సిటీగా మార్చనున్నారు. ఒక్కో అధికారి పరిధిలో దాదాపు 4 వేల ఇళ్ల వరకు ఉండే వీలుంది. సంబంధిత డివిజన్లోని కాలనీసంఘాలు, అసోసియేషన్ల నాయకులతోనూ తరచూ సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తారు. జీహెచ్ఎంసీకి చెందిన సంబంధిత అధికారులతోనూ సమీక్షలు నిర్వహించి చేపట్టాల్సిన కార్యక్రమాలు వివరిస్తారు. ప్రగతినగర్ తరహాలో కాలనీలు, బస్తీలను తీర్చిదిద్దేందుకు ఇక మంత్రులు, అధికారులు తమవంతు బాధ్యతగా ఈ పనులు నిర్వహించనున్నారు. త్వరలోనే ఏయే డివిజన్‌కు ఎవరెవరు బాధ్యత వహిస్తారో ప్రకటించనున్నారు. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం 150 కార్పొరేటర్ల డివిజన్లున్నాయి. 24 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. నగరాన్ని ఎలా విభజించాలా అనేదానిపై గందరగోళం, సందేహాల్లేకుండా ఉండేందుకు ఒక్కో బిల్ కలెక్టర్ పరిధిలోకి వచ్చే ప్రదేశాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి 330 డివిజన్లతో ముసాయిదా రూపొందించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ 330 ప్రాంతాలకు 330 మంది బిల్కలెక్టర్లు, 330 మంది నోడల్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. అదే తరహాలో 330 మంది మంత్రులు/ ఉన్నతాధికారులు తమ బాధ్యతలు నిర్వహించనున్నారు. వీటిని 330 డాకెట్లుగా పరిగణిస్తారు. ఒక్కొక్కరికి ఒక్కో డాకెట్ బాధ్యతలప్పగిస్తారు. అవసరాన్ని బట్టి కొందరికి రెండు, మూడు డాకెట్లు అప్పగించే అవకాశాలున్నాయి. -
ఎన్ని అసెస్మెంట్లో తెలియదు.. ఏం పనిచేస్తున్నారు?
రెవెన్యూ పనితీరుపై కమిషనర్ ఫైర్ 21 వార్డు బిల్‌కలెక్టర్‌ను విధులనుంచి తప్పించాలని ఆదేశం విజయవాడసెంట్రల్ : ‘మీ వార్డులో ఎన్ని అసెస్మెంట్లు ఉన్నాయో తేలియదు. మీరు బిల్ కలెక్టర్లుగా పనిచేస్తున్నారు. అధికారుల పనితీరు అంతంతమాత్రంగానే ఉంది’ అంటూ నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండియన్ సిబ్బందికి చురకలు అంటించారు. శాఖలవారీ సమీక్షకు గురువారం శ్రీకారం చుట్టారు. తొలిరోజు రెవెన్యూ అధికారులు, సిబ్బందితో కౌన్సిల్హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రశ్నలతో అధికారులకు ముచ్చెమటలు పట్టించారు. వార్డుల వారీగా ఆస్తిపన్ను, ఖాళీస్థలాల వివరాలపై ప్రశ్నించారు. కొందరు బిల్ కలెక్టర్లు సమాచారం సక్రమంగా అందించకలేక సార్.. అంటూ సాగదీయడం మొదలెట్టారు. 21 వార్డు బిల్‌కలెక్టర్ సమగ్ర సమాచారం అందించకపోవడంతో కమిషనర్ సీరియస్సయ్యారు. ఆయన్ను విధుల నుంచి తప్పించి సంబంధిత రెవెన్యూ ఇన్స్పెక్టర్కు బాధ్యతలు అప్పగించాల్సిందిగా డెప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు. నగరపాలక సంస్థ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది, ఆస్తిపన్ను వసూళ్లపై ప్రత్యే దృష్టిసారించాలని పేర్కొన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఇది మొదటి వార్నింగ్‌గా భావించి పద్ధతి మార్చుకోవాలన్నారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న అసెస్మెంట్లకు సంబంధించి పరిష్కారం దిశగా దృష్టిసారించాలని ఆదేశించారు. ఖాళీస్థలాల నుంచి పన్నులు వసూలు చేసేం దుకు శ్రద్ధ పెట్టాలన్నారు. వార్డుల వారీగా సమగ్ర సమాచారం అందుబాటులో ఉంచాల్సిందిగా ఆదేశించారు. రెవెన్యూ వసూళ్లలో లక్ష్యసాధన దిశగా పనిచేయాల న్నారు. డెప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) డి.వెంకటలక్ష్మి, అసిస్టెంట్కమిషనర్లు అనసూయాదేవి, నాగకుమారి, టి.శ్రీనివాసరావు, ఆర్ఐలు, బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు.