రెవెన్యూ పనితీరుపై కమిషనర్ ఫైర్
21 వార్డు బిల్‌కలెక్టర్‌ను విధులనుంచి తప్పించాలని ఆదేశం
విజయవాడసెంట్రల్ : ‘మీ వార్డులో ఎన్ని అసెస్‌మెంట్లు ఉన్నాయో తేలియదు. మీరు బిల్ కలెక్టర్లుగా పనిచేస్తున్నారు. అధికారుల పనితీరు అంతంతమాత్రంగానే ఉంది’ అంటూ నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండియన్ సిబ్బందికి చురకలు అంటించారు. శాఖలవారీ సమీక్షకు గురువారం శ్రీకారం చుట్టారు. తొలిరోజు రెవెన్యూ అధికారులు, సిబ్బందితో కౌన్సిల్‌హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రశ్నలతో అధికారులకు ముచ్చెమటలు పట్టించారు. వార్డుల వారీగా ఆస్తిపన్ను, ఖాళీస్థలాల వివరాలపై ప్రశ్నించారు. కొందరు బిల్ కలెక్టర్లు సమాచారం సక్రమంగా అందించకలేక సార్.. అంటూ సాగదీయడం మొదలెట్టారు. 21 వార్డు బిల్‌కలెక్టర్ సమగ్ర సమాచారం అందించకపోవడంతో కమిషనర్ సీరియస్సయ్యారు. ఆయన్ను విధుల నుంచి తప్పించి సంబంధిత రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌కు బాధ్యతలు అప్పగించాల్సిందిగా డెప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు.
నగరపాలక సంస్థ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది, ఆస్తిపన్ను వసూళ్లపై ప్రత్యే దృష్టిసారించాలని పేర్కొన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఇది మొదటి వార్నింగ్‌గా భావించి పద్ధతి మార్చుకోవాలన్నారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న అసెస్‌మెంట్లకు సంబంధించి పరిష్కారం దిశగా దృష్టిసారించాలని ఆదేశించారు. ఖాళీస్థలాల నుంచి పన్నులు వసూలు చేసేం దుకు శ్రద్ధ పెట్టాలన్నారు. వార్డుల వారీగా సమగ్ర సమాచారం అందుబాటులో ఉంచాల్సిందిగా ఆదేశించారు. రెవెన్యూ వసూళ్లలో లక్ష్యసాధన దిశగా పనిచేయాల న్నారు. డెప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) డి.వెంకటలక్ష్మి, అసిస్టెంట్‌కమిషనర్లు అనసూయాదేవి, నాగకుమారి, టి.శ్రీనివాసరావు, ఆర్‌ఐలు, బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు.
ఎన్ని అసెస్‌మెంట్లో తెలియదు.. ఏం పనిచేస్తున్నారు?
Published Fri, Jan 30 2015 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM
Advertisement
Advertisement