బస్తీల బాగుకు ‘బాధ్యులు’
- 330 మందికి బాధ్యతలు
- సీఎం, మంత్రులతో పాటు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులకు సైతం..
- పచ్చదనం, పరిశుభ్రత, మౌలిక వసతుల కల్పనే ధ్యేయం
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని బస్తీలను సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు ప్రజలకవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సీఎం ఆలోచన మేరకు బస్తీల రూపురేఖలు మారేలా రంగం సిద్ధం చేస్తున్నారు.
ఈమేరకు జీహెచ్‌ఎంసీలోని 330 డివిజన్లకు ప్రత్యేక బాధ్యులను నియమించనున్నారు. ఈ బాధ్యుల్లో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుతో పాటు ఆయన మంత్రి మండలి సభ్యులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఐఎఫ్‌ఎస్‌లు, ఇతరత్రా సివిల్‌సర్వీస్ అధికారులుండనున్నారు. తాము బాధ్యత వహించే డివిజన్‌లో పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం, మౌలిక సౌకర్యాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ముఖ్యంగా మహిళలకు ఎక్కువ భాగస్వామ్యం కల్పిస్తారు. దీనికి సంబంధించి జీహెచ్‌ఎంసీ అధికారులు ఇప్పటికే 330 డివిజన్ల ముసాయిదాలను సిద్ధం చేసినట్లు తెలిసింది.
జీహెచ్‌ఎంసీలో ఆస్తిపన్ను వసూళ్లు చేసే బిల్‌కలెక్టర్ల పరిధిలోకి వచ్చే ప్రాంతాల వారీగా ఈ 330 డివిజన్లు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఒక్కో డివిజన్‌కు ఒక్కో మంత్రి/ ఉన్నతాధికారి బాధ్యత వహించనున్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సమన్వయ బాధ్యతలు నిర్వహించనున్నారు. జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం 625 చ.కి.మీలు కాగా ఒక్కో అధికారి దాదాపు 2 చ.కి.మీల పరిధిలో పారిశుధ్యం, పరిశుభ్రత, పచ్చదనం పెంపు వంటి చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించి నగరాన్ని క్లీన్ సిటీగా మార్చనున్నారు.
ఒక్కో అధికారి పరిధిలో దాదాపు 4 వేల ఇళ్ల వరకు ఉండే వీలుంది. సంబంధిత డివిజన్‌లోని కాలనీసంఘాలు, అసోసియేషన్ల నాయకులతోనూ తరచూ సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తారు. జీహెచ్‌ఎంసీకి చెందిన సంబంధిత అధికారులతోనూ సమీక్షలు నిర్వహించి చేపట్టాల్సిన కార్యక్రమాలు వివరిస్తారు. ప్రగతినగర్ తరహాలో కాలనీలు, బస్తీలను తీర్చిదిద్దేందుకు ఇక మంత్రులు, అధికారులు తమవంతు బాధ్యతగా ఈ పనులు నిర్వహించనున్నారు. త్వరలోనే ఏయే డివిజన్‌కు ఎవరెవరు బాధ్యత వహిస్తారో ప్రకటించనున్నారు. జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం 150 కార్పొరేటర్ల డివిజన్లున్నాయి.
24 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. నగరాన్ని ఎలా విభజించాలా అనేదానిపై గందరగోళం, సందేహాల్లేకుండా ఉండేందుకు ఒక్కో బిల్ కలెక్టర్ పరిధిలోకి వచ్చే ప్రదేశాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి 330 డివిజన్లతో ముసాయిదా రూపొందించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ 330 ప్రాంతాలకు 330 మంది బిల్‌కలెక్టర్లు, 330 మంది నోడల్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. అదే తరహాలో 330 మంది మంత్రులు/ ఉన్నతాధికారులు తమ బాధ్యతలు నిర్వహించనున్నారు. వీటిని 330 డాకెట్లుగా పరిగణిస్తారు. ఒక్కొక్కరికి ఒక్కో డాకెట్ బాధ్యతలప్పగిస్తారు. అవసరాన్ని బట్టి కొందరికి రెండు, మూడు డాకెట్లు అప్పగించే అవకాశాలున్నాయి.