రూ. 4 వేలలోపు పన్ను ఉన్న గృహాలకు ఆస్తి పన్నురద్దు..!
జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సంచలన నిర్ణయం
చట్టసవరణ అవసరమైనందున ప్రభుత్వానికి నివేదిస్తామన్న మేయర్
10 లక్షల మందికిపైగా లబ్ధి
జీహెచ్‌ఎంసీపై భారం
రూ.100 కోట్లు ఉంటుందని అంచనా
లోటు భర్తీకి చర్యలు తీసుకుంటాం: మేయర్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పాలకమండలి గడువు మరో మూడు వారాల్లో ముగిసిపోనున్న తరుణంలో స్టాండింగ్ కమిటీ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. నగర మేయర్ మాజిద్ హుస్సేన్ అధ్యక్షతన గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ గ్రేటర్‌లో 4 వేల రూపాయల లోపు ఆస్తి పన్ను ఉన్న అన్ని నివాస గృహాలకు పన్నును రద్దుచేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని త్వరలో జరగబోయే జీహెచ్‌ఎంసీ(బహుశా చివరి) సర్వసభ్య సమావేశం ముందుంచనున్నారు. సమావేశానంతరం మేయర్ మాజిద్ హుస్సేన్ వివరాలను వెల్లడించారు.
పేదలు, మధ్య తరగతి ప్రజలకు ప్రయోజనం కలిగేలా స్టాండింగ్ కమిటీ ఆస్తిపన్ను రద్దు నిర్ణయం తీసుకుందన్నారు. ఇది కార్యరూపం దాల్చాలంటే ప్రభుత్వ ఆమోదంతోపాటు జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ కూడా జరగాల్సి ఉన్నందున ఈ అంశాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూల నిర్ణయం తీసుకోగలరన్న విశ్వాసం ఉందని చెప్పారు. జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశంలోనూ తీర్మానం చేస్తామన్నారు. కాగా, లెక్కల కోసం ఆయా ఇళ్ల వారి నుంచి నామమాత్రంగా రూ. 10 లేదా రూ. 20 ఆస్తిపన్నుగా వసూలు చేస్తామన్నారు.
ఎవరికి ప్రయోజనం.. ?
పేదలు, మురికివాడలతోపాటు కాలనీల్లోని సింగిల్, డబుల్ బెడ్‌రూం ఫ్లాట్స్ వారికి సైతం ప్రయోజనం కలుగుతుంది. సంపన్న కాలనీల్లో ప్లింత్ ఏరియా 700 ఎస్‌ఎఫ్‌టీ నుంచి సాధారణ కాలనీల్లోని 950 ఎస్‌ఎఫ్‌టీ వారికి, స్లమ్స్‌లోని 1,100 ఎస్‌ఎఫ్‌టీ వరకు ఆస్తిపన్ను రద్దవుతుంది. ఇది సగటు అంచనా. ఆస్తిపన్ను రేటు ఒక్కో చోట ఒక్కో విధంగా ఉంది. సగటున స్లమ్స్‌లో ఎస్‌ఎఫ్‌టీకి 90 పైసల ధర ఉండగా, సంపన్న కాలనీల్లో రూ. 1.25గా ఉంది. జీహెచ్‌ఎంసీలో ఆస్తిపన్ను చెల్లిస్తున్న నివాస, వాణిజ్య భవనాలు 13,63,607 ఉండగా, వీటిల్లో రూ. 4 వేల లోపు చెల్లించే ఇళ్లు 10 లక్షల 10 వేల వరకు ఉంటాయి. వీరి నుంచి ప్రస్తుతం జీహెచ్‌ంఎసీకి లభిస్తున్న ఆదాయం రూ. 100 కోట్లు. ఈ మొత్తాన్ని భర్తీ చేసేందుకు ఆస్తిపన్ను అసెస్‌మెంట్లలోని అవకతవకల్ని సరిచేయడంతో పాటు ఇప్పటి వరకు నివాస గృహాల ఆస్తిపన్నునే చెల్లిస్తున్న వాణిజ్య భవనాలనుంచి ట్రేడ్ లెసైన్స్ ఫీజు వసూలు చేయడం వంటి చర్యలు తీసుకుంటామని మేయర్ తెలిపారు.