జిల్లాలో కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మున్సిపాలిటీల డిమాండ్ ఫైల్‌కు కొత్త ప్రభుత్వంలో మోక్షం లభించనుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ వేగంగా పూర్తి చేసేలా రాష్ట్ర మున్సిపల్ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. అన్నీ సక్రమంగా జరిగితే వచ్చే నెలాఖరు నాటికి జిల్లాలో ఏడు కొత్త గ్రేడ్–3 మున్సిపాలిటీలు ఏర్పాటు కానున్నాయి. విస్తీర్ణం, జనాభా పరంగా నెల్లూరు జిల్లా పెద్దది. ఇతర జిల్లాలో లేని విధంగా ఇక్కడ వాణిజ్య సెజ్‌లు ఉండడంతో సమీప గ్రామాల్లో జనాభా పెరగడంతో పాటు గ్రామ పంచాయతీల ఆదాయ వనరులు కూడా పెరిగాయి. కొన్ని నియోజక వర్గాల్లో మండల కేంద్రాలుగా ఉన్న పెద్ద పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చేందుకు కసరత్తు జోరుగా సాగుతోంది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో బుచ్చిరెడ్డిపాళెం, కోట, అల్లూరు, పొదలకూరు, ముత్తుకూరు, రాపూరు, తడ తదితర గ్రామ పంచాయతీలను నగరపాలిక పంచాయతీ (గ్రేడ్–3 మున్సిపాలిటీ)గా మార్చనున్నారు. 2013లోనే జిల్లాలోని బుచ్చిరెడ్డి పాళెం, పొదలకూరులు మున్సిపాలిటీలు చేయడానికి ప్రతిపాదనలు పంపినా అప్పటి సర్కార్ దీనిని పట్టించుకోలేదు. గడిచిన ఐదేళ్లలో దీనిపై రెండు పర్యాయాలు ప్రతిపాదనులు పంపినా వాటికి మోక్షం లభించలేదు. ఇటీవల అసెంబ్లీలో కొందరు ప్రజాప్రతినిధులు మున్సిపాలిటీల ఏర్పాటుపై మాట్లాడడం, రాష్ట్ర మున్సిపల్ శాఖ స్థానిక సంస్థల కంటే ముందుగానే రాష్ట్రంలో కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయాలని భావించడంతో వేగంగా ప్రతిపాదనలు తెరపైకి వచ్చి కార్యరూపం దిశగా అడుగులు వేస్తున్నారు. మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్ కమిషనర్ విజయ్‌కుమార్ ప్రభుత్వ ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాలో కలిపి 50 ప్రధాన గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చడానికి వీలుగా ఉన్న ప్రతిపాదనల్ని పంపాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా జనాభా, గ్రామ పంచాయతీ ఆదాయం, విస్తీర్ణం తదితర అంశాలతో పాటు ఇతర ప్రత్యేక అంశాలను పరిగణలోకి తీసుకొని నివేదికలు ఈ నెల 31లోగా పంపాలని ఉత్తర్వులు జారీ చేశారు.
సమీప గ్రామాలను కలుపుకుని..
జిల్లాలోని ఏడు గ్రామ పంచాయతీలను గుర్తించి కొన్నింట్లో వాటికి సమీపంలోని గ్రామాలను కూడా కలుపుకొని మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయడానికి కసరత్తు మొదలు పెట్టారు. మున్సిపల్ శాఖ మార్గదర్శకాల ప్రకారం 20 వేల పైన 40 వేల లోపు జనాభా ఉండాలని సూచించారు. అలాగే ఏటా రూ.40 లక్షలపైనే వార్షిక పంచాయతీ ఆదాయం ఉండాలని కూడామార్గదర్శకాల్లో ఉంది. దీనికి అనుగుణంగానే జిల్లాలో గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారు. కోవూరు నియోజకవర్గంలో బుచ్చిరెడ్డిపాళెం, దాని పక్కన ఉన్న వవ్వేరును కలిపి మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. దీనికి అనుగుణంగా బుచ్చిరెడ్డిపాళెం జనాభా 24,975, వవ్వేరు జనాభా 6359గా ఉంది. గూడూరు నియోజకవర్గంలోని కోట, వాకాడు Ðగ్రామాలు, గూడలి గ్రామం కలిపి మున్సిపాలిటీగా ఏర్పాటు చేయనున్నారు. కోటలో 16,200 మంది, వాకాడులో 8,420 మంది గూడలిలో 6,472 మంది జనాభా ఉన్నారు.
కావలి నియోజకవర్గంలోని అల్లూరు గ్రామ పంచాయతీ జిల్లాలోని ప్రధాన గ్రామ పంచాయతీల్లో ఒకటి. ఇక్కడ జనాభా 28 వేల మంది ఉన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు గ్రామ పంచాయతీలో జనాభా 25 వేల పైచిలుకు ఉంటుంది. సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు గ్రామ పంచాయతీ ఆదాయపరంగా పెద్దది. ఇక్కడ జనాభా 15 వేల పైచిలుకు ఉంటారు. అయితే ఇక్కడ సమీపంలో కృష్ణపట్నం పోర్టు ఉండటంతో పారిశ్రామికంగా ముత్తుకూరు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో దీనికి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు గ్రామ జనాభా 15 వేల పైనే ఉంది. అయితే భౌగోళికంగా పంచాయతీ పెద్దది కావడం, ఆదాయం కూడా ఎక్కువగా ఉండడంతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని సరిహద్దు ప్రాంతం తడ, తడ కండ్రికలను కలిపి 15 వేల పైనే జనాభా ఉంటుంది.
అయితే ఇది పూర్తిగా పారిశ్రామిక ప్రాంతం కావడంతో వలస ఉద్యోగులు ఎక్కువ మంది ఉంటారు. దీనికి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో కావలి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట, ఆత్మకూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. కొత్తగా వచ్చే వాటితో కలిపి జిల్లాలో మున్సిపాలిటీల సంఖ్య 13కు చేరే అవకాశం ఉంది. మరో రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త మున్సిపాలిటీలను దాని కంటే ముందుగా ఏర్పాటు చేసి అక్కడ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment