ఒకప్పుడు వెలుగు వెలిగిన జిల్లా పరిషత్ నేడు కళావిహీనంగా మారింది. నిధులు, విధులు లేక కొట్టుమిట్టాడుతోంది. జిల్లా పరిషత్‌తో పాటు మండల పరిషత్‌లలో కరెంటు బిల్లులు చెల్లించేందుకు కూడా అష్టకష్టాలు పడే పరిస్థితి దాపురించింది. సమావేశాల నిర్వహణ అంటేనే అధికారులు ఆందోళన చెందుతున్నారు. బిల్లుల చెల్లింపులు, నిధుల కేటాయింపులకు డబ్బులు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇక, మండల కార్యాలయాల్లోనైతే కనీసం జిరాక్స్ బిల్లులు చెల్లించడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి నెలకొంది.
నిజామాబాద్‌అర్బన్: గతంలో జిల్లా, మండల పరిషత్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు భారీగా వచ్చేవి. అయితే, మూడేళ్ల వ్యవధిలో కేంద్రానికి సంబంధించి కీలకమైన బీఆర్‌జీఎఫ్ సహా రెండు పథకాలు నిలిచిపోయాయి. బీఆర్‌జీఎఫ్ నిధులు జీపీలకే చెల్లిస్తున్నారు. ఇక, మూలధన నిధి సమకూరడం లేదు. 2016–17కు గాను సీనరేజ్ గ్రాంట్ రాలేదు. మొత్తంగా నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో జెడ్పీకి కేటాయించింది రూ.9.64 కోట్లు మాత్రమే. ఈ నిధులతో జిల్లా, మండల పరిషత్‌ల నిర్వహణ కష్టంగా మారింది. అభివృద్ధి పనులకు నిధుల్లేక జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి నెలకొంది. ప్రతి సమావేశంలో నిధుల కోసం జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఆందోళన చేస్తున్నారు.
పేరుకే మండల పరిషత్‌లు..
ఉమ్మడి జిల్లాలో 36 మండల పరిషత్‌లు ఉన్నాయి. వీటి పరిస్థితి నామమాత్రంగానే ఉంది. కేంద్ర ప్రభుత్వం గతంలో ఒక్కో మండలానికి రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఆర్థిక సంఘం నిధులు, రూ.కోటి నుంచి రూ.5 కోట్ల వరకు బీఆర్‌జీఎఫ్ నిధులు విడుదల చేసేది. ప్రస్తుతం అన్ని రకాల నిధులు నిలిచిపోయాయి. ఇప్పుడు ఒక్కో మండలానికి రూ.10 లక్షలు కుడా రాని పరిస్థితి ఏర్పడింది. నిధులు లేక గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి నిలిచి పోయింది. ‘మన ఊరు–మన ప్రణాళిక’, ‘గ్రామజ్యోతి’ పథకాలు పడకేశాయి. మురికినీటి కాలువలు, సీసీ రోడ్లు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలకు ప్రహరీలు, మరుగుదొడ్ల నిర్మాణాలు మూడేళ్లుగా నిలిచి పోయాయి.
ఏం చేయలేక పోతున్నాం..
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత మాపై ఉంది. కానీ నిధులు లేక మేము ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి మండల, జిల్లా పరిషత్‌లను బలోపేతం చేయాలి.
– శ్రీనివాస్, నవీపేట జెడ్పీటీసీ
నిలిచిన అభివృద్ధి..
నిధులు లేక అభివృద్ధి నిలిచి పో యింది. గ్రామాలకు వెళ్లాలంటేనే ఇబ్బందిగా ఉంది. ప్రజలకు సమాధానం చెప్పు కోలేక పోతున్నాం. ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి. – పుప్పాల శోభ,
నిజామాబాద్ జెడ్పీటీసీ
Comments
Please login to add a commentAdd a comment