సర్పంచ్‌ల.. లబోదిబో! | Grama Sarpanch Funds Shortage In Telangana | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ల.. లబోదిబో!

Published Thu, May 2 2019 10:18 AM | Last Updated on Thu, May 2 2019 10:18 AM

Grama Sarpanch Funds Shortage In Telangana - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది గ్రామ పంచాయతీల పరిస్థితి. మూడు నెలల కిందట   పంచాయతీలకు కొత్తగా ఎన్నికైన సర్పంచుల చేతి చమురు వదులుతోంది. పంచాయతీ ఖాతాల్లో నిధులు ఉన్నా.. అత్యవసర పనుల కోసం పైసా ఖ ర్చు చేయలేని దుస్థితిని వారు ఎదుర్కొంటున్నారు. కొత్త సర్పంచులు పదవీ బాధ్యతలు స్వీకరించి మూడు మాసాలు కావస్తోంది. గ్రామాల్లో పెద్ద ఎత్తున సమస్యలు పేరుకుపోయాయి. గత సర్పంచుల పదవీ కాలం 2018 ఆగస్టు 1వ తేదీతో ముగిసింది. నాటినుంచి గ్రామాల్లో ఎక్కడి పనులు అక్కడే పేరుకుపోయాయి.

ప్రత్యేక అధికారులు బాధ్యత చేపట్టిన వెంటనే అసెంబ్లీ రద్దు కావడం, ముందస్తు ఎన్నికలు కూడా రావడం, ఆ వెంటనే పంచాయతీ ఎన్నికలు కూడా పూర్తయి కొత్త సర్పంచులు కొలువుదీరారు. ప్రభుత్వం మొదట సర్పంచులు, ఉప సర్పంచులకు జాయింట్‌చెక్‌ పవర్‌ ఇస్తామని ప్రకటించింది. ఆ తర్వాత కార్యదర్శి, సర్పంచులకే చెక్‌ పవర్‌ ఇస్తామని ప్రకటించినా.. ఈ విషయంలో ఇప్పటికీ ప్రభుత్వం ఎలాంటి తుది నిర్ణయమూ తీసుకోలేదు. దీంతో 2018 మార్చిలో 14వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలకు వచ్చి ఉన్నా కొత్త సర్పంచులు అత్యవసర పనులకు కూడా ఖర్చు చేయలేక పోతున్నారు. అత్యవసరమైన తాగునీటి సమస్య పరిష్కారం కోసం కొందరు సొంత డబ్బులు ఖర్చు చేస్తుండగా, మరికొందరు అప్పు తెచ్చి పనులు పూర్తి చేస్తున్నారు.

పంచాయతీల ఖాతాల్లో రూ.31.69కోట్లు
జిల్లాలో మొత్తం 844 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 837 గ్రామ పంచాయతీలకు ఈ సంవత్సరం జనవరిలో 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి 2వ తేదీన కొత్త సర్పంచులు అంతా కొలువుదీరారు. ఆ తర్వాత ప్రభుత్వం కొత్త సర్పంచులకు గ్రామ పంచాయతీల్లో చేపట్టాల్సిన పనులు, మొక్కల పెంపకం, ఆదాయ వనరులు ఎలా పెంపొందించుకోవాలనే విషయంతో పాటు రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చింది. కాగా, 2018 మార్చి మాసంలో 14వ ఆర్థిక సంఘం నిధులు జిల్లాకు వచ్చాయి. అయితే, పాత సర్పంచుల పదవీ కాలం దగ్గరపడిన నేపథ్యంలో నిధులు వృథా అవుతాయని భావించి 14వ ఆర్థిక సంఘం నిధులపై ప్రభుత్వం ఫ్రీజింగ్‌ విధించింది. దీంతో పాత సర్పంచులు ఆ నిధులు ఖర్చు చేయకుండానే దిగిపోయారు. ఆ తర్వాత ఆగస్టు 2వ తేదీ నుంచి ప్రత్యేక అధికారులు ఆయా గ్రామాల్లో బాధ్యతలు స్వీకరించారు. కానీ, నిధులు మాత్రం ఖర్చు పెట్టలేదు. 14వ ఆర్థిక సంఘం నిధులు గత సంత్సరం మార్చిలోనే రూ.31,69,41,000 జిల్లాకు అందాయి. ఆనిధులను ఆయా గ్రామ పంచాయతీల వారీగా జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు పంపిణీ కూడా చేశారు. అయితే, చెక్‌పవర్‌ వ్యవహారం ఇప్పటికీ తేలకపోవడంతో నిధుల పంచాయతీ ఖాతాల్లోనే మూలుగుతున్నాయి.
 
తల ఒక్కంటికి  రూ.253.7 చొప్పున నిధులు

14వ ఆర్థిక సంఘం నిధులు ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి రూ.253.7 చొప్పున ఆయా గ్రామ జనాభాను బట్టి విడుదల చేసింది. ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు ఎక్కువ, తక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు తక్కువగా ఆయా ఖాతాల్లో జమ అయ్యాయి. ప్రభుత్వం గ్రామ పంచాయతీలో చెక్‌ పవర్‌ విషయంలో ఎటూ నిర్ణయం తీసుకోలేదు. కానీ, ఎన్నికల అనంతరం బిన్నాభిప్రాయాలు రావడంతో ప్రభుత్వమే సర్పంచ్, కార్యదర్శులకు జాయింట్‌ చెక్‌ పవర్‌ పాత పద్ధతిలోనే ఇస్తామన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి జీఓ విడుదల చేయలేదు.

నిధులున్నా ఖర్చు చేయలేని పరిస్థితి
ఒక్కో గ్రామ పంచాయతీలో ఆయా గ్రామ జనాభాను బట్టి 14వ ఆర్థిక సంఘం నిధులు జమ అయి ఉన్నాయి. కానీ చెక్‌ పవర్‌ తేలని కారణంగా నిధులు ఉన్నా వాటిని ఖర్చు చేయలేని పరిస్థితి. గత ఆగçస్టు మాసంలో పాత సర్పంచులు దిగిపోయిన నాటి నుండి గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. ప్రత్యేక అధికారులు తాగునీరు, అత్యవసరాలకు తప్ప నిధులు ఖర్చు చేయలేదు. ప్రస్తుతం వచ్చిన కొత్త సర్పంచులుకు చెక్‌పవర్‌ లేక వాటిని ఖర్చు చేయలేని పరిస్థితి. దీంతో సొంత డబ్బులు ఖర్చు పెట్టి గ్రామాల్లో తాగునీరు, వీధి లైట్లతో పాటు మోటార్ల రిపేర్లు, కొత్త మోటార్ల కొనుగోలు వంటి పనులు చేస్తున్నారు. మరికొందరు సర్పంచులు తమ వద్ద డబ్బులు లేకున్నా అçప్పు చేసి మరీ గ్రామాల్లో అత్యవసర పనులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. 

సొంతడబ్బులు ఖర్చు చేస్తున్నాం
గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. దాన్ని పరిష్కరించేందుకు కాలిపోయిన మోటార్ల స్థానంలో కొత్త మోటారు, స్టార్టర్లు కొనుగోలు చేశాం. దీంతో తాగునీటికి ఇబ్బంది లేకుండా చేశాం. వీధి లైట్లు ఏర్పాటు చేయడంతోపాటు మురుగు నీటి కాల్వను కూడా క్లీన్‌ చేసే కార్యక్రమాన్ని సొంత డబ్బులతోనే చేయించాల్సి వస్తుంది.    – పంతంగి సరిత శ్రీనాథ్, గుండ్లపల్లి సర్పంచ్‌ 

సర్పంచ్‌గా ఎన్నిక అయిన నాటికి మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. తాగునీటి సమస్య అయితే మరింత తీవ్రంగా ఉంది. గతంలో బోర్లు బాగా పోసేవి. ప్రస్తుతం గ్రౌండ్‌ వాటర్‌ తగ్గి బోర్లు పోయకపోవడంతో కొత్తగా బోర్లు వేశాం. మూడు బోర్లను ఒకే పైప్‌లైన్‌కు జాయింట్‌ చేసి ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంక్‌కు ఎక్కిస్తున్నాం. దానికోసం 100 పైపులు వేశాం. పక్కనబోరు నుంచి మరో వంద పైపులు వేసి అక్కడి నుంచి కూడా ట్యాంక్‌ పైకి నీరు ఎక్కించి తాగునీటి  ఇబ్బందులను అధిగమించాం. వీధిలైట్లు కొత్తగా వేశాం. కొత్త మోటార్లను కూడా కొనుగోలు చేసి పనులు చేపట్టాం. ఇప్పటి వరకు రూ.6లక్షల పై చిలుకే ఖర్చు చేశాం. పంచాయతీ ఖాతాలో డబ్బులు ఉన్నా ఖర్చు చేయలేని పరిస్థితి.. ఇదీ.. తిప్పర్తి మండలం ఇండ్లూరు సర్పంచ్‌ మార్త శ్రీదేవీసైదులు 
ఆవేదన..!! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement