మీడియాతో మాట్లాడుతున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి నల్లగొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నల్లగొండ నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నారని, ఇప్పుడు ఆ మాటకు విలువ పెంచాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నల్లగొండ పట్టణంలో 5 వేలు, ప్రతి గ్రామంలో 300 చొప్పున డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి పేదలకు పంపిణీ చేయాలని కోరారు.
సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గాల్లో 20 వేల చొప్పున ఇళ్లు కట్టించారన్నారు. నల్లగొండలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఎందుకు కట్టించడం లేదని ప్రశ్నించారు. సీఎం దత్తత తీసుకున్న నియోజకవర్గం అన్యాయం అయిపోతుందనే బాధతో తాను మాట్లాడుతున్నానన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం పేదలు ఎంతోమంది ఎదురు చూస్తున్నారన్నారు. ‘చేతులు జోడించి అడుగుతున్నా.. సీఎం గారూ.. డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇవ్వండి’అని విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్ ఇక్కడికి వచ్చి సమీక్ష నిర్వహించి అభివృద్ధి చేయాలని సూచించారు. దళితబంధుకు బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలను మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామన్నారు. ఎమ్మెల్యేలకు రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షలు ముట్టజెప్పిన వారికి ఇస్తామని చెబుతున్నారని ఆరోపించారు. లాటరీ పద్ధతిన అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని, లేదంటే ఆందోళనలు నిర్వహిస్తామన్నారు.
నాకు పదవులు ముఖ్యం కాదు
‘పీసీసీ కమిటీలో నా పేరు లేకపోవచ్చు. ఢిల్లీలో హైపవర్ కమిటీలు చాలా ఉన్నాయి’అని వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. తాను మంత్రి పదవికే రాజీనామా చేసినవాడినని, తనకు పదవులు ముఖ్యం కాదని, ప్రజలు, కార్యకర్తలే ముఖ్యమని చెప్పారు. ‘కాంగ్రెస్ పార్టీ కండువానే కప్పుకున్నాను కదా. రేపు ఏ కమిటీలో ఉంటానో మీకేం తెలుసు‘అని ప్రశ్నించారు. ఎన్నికలకు నెలరోజుల ముందు నుంచే రాజకీయాల గురించి మాట్లాడతానన్నారు.
రెండు రాష్ట్రాలు కలవడం అనేది అసాధ్యమని, సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు సరైనవి కావని, అలాంటి మాటలు మాట్లాడవద్దని సీరియస్‌గా చెబుతున్నానని అన్నారు. రాష్ట్రం ఏర్పాటైనా తెలంగాణ అమరవీరుల స్తూపం కూడా కట్టుకోలేదని, ప్రజలు ఇళ్లు కట్టుకోలేదన్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక కేసీఆర్ మాత్రమే హ్యాపీగా ఉన్నారన్నారని అన్నారు. ఆయన బీఆర్‌ఎస్ పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా తెలంగాణ అనే పదం తీసేయడం బాధగా అనిపించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment