సాక్షి, నల్లగొండ: వికలాంగుల సంక్షేమంపై సర్కారు శీతకన్ను ప్రదర్శిస్తోంది. వారిని అన్నిరకాలుగా ఆదుకుని అండగా నిలవాల్సిన ప్రభుత్వమే పట్టనట్లు వ్యవహరిస్తోంది. వికలాంగులను పెళ్లి చేసుకుంటే ప్రోత్సాహకంగా ప్రభుత్వం నగదు చెల్లించాలని ప్రభుత్వ నిబంధనలున్నాయి. జిల్లాలో ఈ పారితోషికం అందుకునేందుకు వందల సంఖ్యలో జంటలు ఎదురుచూస్తున్నాయి. అయితే, వీరికి నిధులు ఇచ్చేం దుకు ప్రభుత్వానికి మనసొప్పడం లేదు.
లబ్ధిదారులకు పిల్లలు పుట్టినా వారికి ప్రోత్సాహం అందడం లేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతోంది. వికలాంగులను పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఒక్కో జంటకు 50వేల రూపాయలు అందజేస్తామని చెప్పింది. అయితే, 2011కు ముందు ఈ మొత్తం 10వేల రూపాయలుమాత్రమే ఉంది. ప్రభుత్వం ఇచ్చే ఈ అరకొర సాయం కోసం కార్యాలయం చుట్టూ తిరగలేక చాలామంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు మొగ్గు చూపలేదు. దీనిని గమనించిన ప్రభుత్వం ఆ సాయాన్ని పదివేల రూపాయల నుంచి రూ.50వేలకు పెంచింది. ఈ మేరకు 2011 జూలైలో జీఓ 14 విడుదల చేసింది. దీంతో అందరి నుంచి సంతృప్తి వ్యక్తమైంది. ఈ క్రమంలో దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూవస్తోంది.
తప్పని నిరీక్షణ.....
ప్రోత్సాహక నగదు కోసం 2011 జూలై నుంచి వికలాంగుల సంక్షేమ శాఖాధికారులకు 400 దరఖాస్తులు అందాయి. గతేడాది సర్కారు మెతుకులు విదిల్చినట్లు రూ.27 లక్షలు విడుదల చేసి చేతులు దులుపుకుంది. ఈ మొత్తాన్ని 54మంది దంపతులకు అందజేశారు. మిగిలిన వారికి డబ్బులు సరిపోలేదు. ఇంతకంటే ముందు మరో రూ.10 లక్షల నిధులు మంజూరు చేసింది. అయితే జీఓ నంబర్ 14 విడుదల కంటే ముందు దరఖాస్తు చేసుకున్నవారికి ఆ మొత్తాన్ని అందజేశారు. ఇప్పటికీ 346మంది దంపతులు రెండేళ్లుగా ప్రోత్సాహకం కోసం ఎదురు చూస్తున్నారు. నగదు మొత్తాన్ని పెంచామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా.. నిధులు విడుదల చేయకపోతే లాభమేంటని లబ్ధిదారులు విమర్శిస్తున్నారు. నగదు త్వరితగతిన అందితే తమకు ఏదో ఒకరకంగా ఆసరా అవుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే, వీరి ఆశలను సర్కారు వమ్ము చేస్తోంది. అసలు ఎప్పటిలోగా నిధులు విడుదల చేస్తారో తెలియక వారు అయోమయంలో పడ్డారు. పలుమార్లు వికలాంగుల సంక్షేమ శాఖ చుట్టూ తిరిగి విసిగి వేసారి పోతున్నారు. జిల్లా నలుమూలల నుంచి వ్యయప్రయాసాలకోర్చి అధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
ప్రోత్సాహం.. నేతిబీరే !
Published Thu, Dec 26 2013 4:03 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement