నేడే ఆఖరు
► సమగ్ర వివరాలు సమర్పించిన ఉద్యోగులు 50 శాతమే
► వేతనాలు నిలిపివేస్తామన్నా.. కొరవడిన స్పందన
► ఈరోజు భారీ సంఖ్యలో అందే అవకాశం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ సమగ్ర సమాచారం అందించడానికి గడువు నేటితో ముగియనుంది. ఇంతవరకు 50 శాతం ఉద్యోగుల వివరాలు మాత్రమే జిల్లా ట్రెజరీ శాఖకు చేరినట్లు తెలుస్తోంది. నిర్ణీత ఫార్మెట్‌లో వివరాలు అందజేయాలని, లేకుంటే ఫిబ్రవరి నెలకు సంబంధించిన వేతనాలు నిలిపివేస్తామని గత నెలలో ప్రభుత్వం హెచ్చరించిన విషయం తెలిసిందే.
పరిపాలనా సౌలభ్యం, బడ్జెట్ అంచనాలు, ఖాళీగా ఉన్న పోస్టులు తదితర లెక్కలపై స్పష్టమైన సమాచారం రాబట్టడానికి వీలుగా ఈ చర్యలకు ఉపక్రమించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. దీనికి అనుగుణంగా ఈనెల 20వ తేదీలోగా శాఖల వారీగా ఉద్యోగుల వివరాలను అందజేయాలని డిస్బర్సింగ్ అండ్ డ్రాయింగ్ ఆఫీసర్ల (డీడీఓ)కు జిల్లా ట్రెజరీ శాఖ సూచిం చింది. ఆలస్యం చేయకుండా వివరాలు పంపేందుకు వీలుగా ప్రతిశాఖకు నమూనా ఫారాలను కూడా చేరవేసింది.
బిల్లులతోనే వివరాలు
వాస్తవంగా అన్ని శాఖల నుంచి ఉద్యోగుల పే బిల్లులు ప్రతినెలా 25వ తేదీలోగా ట్రెజరీకి అందుతాయి. వీటి ఆధారంగానే వేతనాలు విడుదల చేస్తారు. ఈ నిర్ణీత తేదీకి ఐదు రోజుల ముందుగానే అంటే 20వ తేదీలోగా వివరాలు తమకు అంద జేయాలని ట్రెజరీ శాఖ అధికారులు చెప్పినప్పటికీ.. పెద్దగా స్పందన రాలేదు. పే బిల్లుల అందజేతకు గడువు నేటితో ముగియనుంది. వివరాల అందజేతకూ ఇదే వర్తిస్తుంది. జిల్లాలో 18 వేల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షర్లు ఉన్నారు. ఇందులో ఇంకా 50 శాతం మంది వివరాలు ట్రెజరీకి అందాల్సి ఉందని సమాచారం.
ముఖ్యంగా పోలీస్ శాఖ నుంచి చాలా మంది ఉద్యోగులు వివరాలు చేరలేదని తెలుస్తోంది. ఈ శాఖ పరిధిలో జిల్లాలో అధిక సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో కానిస్టేబుల్ నుంచి ఐఏఎస్ ర్యాంకు వరకు దాదాపు ఐదు వేల మంది ఉంటా రని అంచనా. వీరిలో దాదాపు రెండు వేల మందే సమర్పించారని సమాచారం. తమ పరిధిలో ఉన్న ఉద్యోగుల వివరాల పత్రాలను డీడీఓలు సేకరిస్తున్నారు. ఇలా తీసుకున్న ప్రతి ఉద్యోగి సమాచారాన్ని సర్వీస్ పుస్తకంలో ఉన్న అంశాలతో సరిచూ డాల్సి ఉంటుంది. ఇవన్నీ సహేతుకంగా ఉంటేనే ఒకే చెబుతున్నారు.
ఈ ప్రక్రియ పూర్తి కావడానికి అధిక సమయం పడు తోం దని అధికారులు వివరిస్తున్నారు. ఈ కారణంగా అందజేతలో కాస్త జాప్యం చోటుచేసుకుంటుందని చెబుతున్నారు. అయితే డీడీఓల నుంచి చివరి రోజు పెద్ద ఎత్తున అందవచ్చని ట్రెజరీ శాఖ భావిస్తోంది. మరోవైపు సాయంతంల్రోగా తమకు చేరిన పత్రాలకు సంబంధించిన ఉద్యోగులకే వేతనాలు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మిగిలిన వారు అందుకు నోచుకోక పోవచ్చని పేర్కొంటున్నారు.