సాక్షి, అమరావతి: ‘‘పేరు గొప్ప–ఊరు దిబ్బ’’ అనే రీతిలో ఉంది గ్రేటర్ విశాఖ, విజయవాడ కార్పొరేషన్ ఉద్యోగుల పరిస్ధితి. రాష్ట్రంలోని మిగిలిన కార్పొరేషన్ల ఉద్యోగులు, పెన్షనర్లు ట్రెజరీ ద్వారా ప్రతీ నెలా 1 వ తేదీన జీతాలు పొందుతుంటే, ఈ కార్పొరేషన్ల ఉద్యోగులు సకాలంలో జీతాలు పొందలేకపోతున్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చి చేతులు దులుపుకుంది. దానికి తగ్గ ఏర్పాట్లు చేయలేదు. ఫలితంగా ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒకటోతేదీ కష్టాలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లిస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పది సంవత్సరాల పోరాటం ఫలించిందని ఉద్యోగుల సంబరపడ్డారు. ట్రెజరీ శాఖ కొర్రీతో రెండు కార్పొరేషన్లలోని 8 వేల మంది ఉద్యోగులు జీతాలు, పెన్షనర్లు పెన్షన్లు మే 1న పొందలేకపోయారు.
జీతాలు ఆలస్యం...
గ్రేటర్ విశాఖలో మినిస్ట్రీరియల్ ఉద్యోగులు 2852, పెన్షనర్లు 2 వేల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.17.50 కోట్లు జీతాలుగా చెల్లించాలి. విజయవాడలో మినిస్ట్రీరియల్ ఉద్యోగులు 1700 మంది, పెన్షనర్లు 1650 మంది ఉంటే వీరికి రూ.16.50 కోట్లను చెల్లిస్తోంది. ఈ రెండు కార్పొరేషన్లు సాలీనా రూ.400 కోట్లను ఉద్యోగుల జీతాలకు చెల్లిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కార్పొరేషన్లు పన్నులు ద్వారా లభించిన ఆదాయంతోనే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నాయి. అయితే కార్పొరేషన్లకు పన్నులు రూపంలో వచ్చే ఆదాయం నిలకడగా ఉండకపోవడంతో తమకు జీతాల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని ఉద్యోగులు ఆందోళనా కార్యక్రమాలు చేపట్టారు.
ట్రెజరీ శాఖ కొర్రీలు..
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగులకు 010 పద్దు ద్వారా అంటే..ట్రెజరీల ద్వారా జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఉద్యోగుల వివరాలను ట్రెజరీలకు అందచేయాలని అధికారులను ఆదేశించింది. అదే ఉత్తర్వులను ట్రెజరీశాఖకు ప్రభుత్వం పంపడటంతో ఉద్యోగులు, పదోన్నతుల వివరాలను తమకు అందించాలని ట్రెజరీ శాఖ కార్పొరేషన్లను కోరింది. కౌన్సిల్, స్టాండింగ్ కమిటీ, ప్రభుత్వం కేటగిరీల వారీగా నియమించిన ఉద్యోగుల వివరాలు, పదోన్నతుల వివరాలను పంపాలని కోరింది. విజయవాడ కార్పొరేషన్ 1981లో ఏర్పాటైంది. మున్సిపాల్టీగా ఉన్న సమయంలో ఉన్న రికార్డులు, కార్పొరేషన్‌లోని రికార్డులను వేర్వేరుగా భద్రపరచడంతో వాటిని ఇప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు.
అక్రమ నియామకాలతో సమస్య...
కౌన్సిల్, స్టాండింగ్ కమిటీలు చేసిన నియామకాల్లో అక్రమాలు ఉండటంతో వారి విద్యార్హతలు, అనుభవాలకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేకపోవడంతో మున్సిపల్ అధికారులు ట్రెజరీశాఖకు వివరాలను అందించలేకపోయారు. పూర్తి వివరాలు లేకున్నా ఆడిట్ ఆఫీసర్లు ఆ ఉద్యోగుల వివరాలను ధ్రువీకరించి నివేదిక పంపినా సరిపోతుందని ట్రెజరీ శాఖ వివరించింది. అయితే ఆడిట్ ఆఫీసర్లు సర్టిఫికెట్లు లేనిదే వారి సర్వీసులు, ఉద్యోగ నియామకాలను ధ్రువీకరించలేమని స్పష్టం చేయడంతో కథ మొదటికి వచ్చింది. వీటిని ఇచ్చే వరకు ట్రెజరీ ద్వారా జీతాల చెల్లింపునకు సంబంధించిన ప్రక్రియ పూర్తికాదని అధికారులు భావిస్తున్నారు.
ఇది పూర్తికావడానికి కనీసం నాలుగైదు నెలల సమయం పడుతుందని ఉద్యోగులు భావిస్తున్నారు. దాంతో కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్లు జీతాలు సరిగా అందక ఇబ్బంది పడుతున్నారు. ఆడిట్ కొర్రీలు పరిష్కారమయ్యే వరకు నగర పాలక సంస్ధలు జీతాలు చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం ట్రెజరీ ద్వారా జీతాలు ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చిన తరువాత తాము నేరుగా జీతాలు చెల్లించలేమని గ్రేటర్ విశాఖ అధికారులు స్పష్టం చేశారు. విజయవాడ కార్పొరేషన్ ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ నుంచి ఇక్కడి ఉద్యోగులు వడ్డీకి రుణాలు తీసుకుంటున్నారు. ట్రెజరీ శాఖ అభ్యంతరాలకు సంబంధించిన పనులను అధికారులు వెంటనే పూర్తిచేసి తమకు ప్రతీ నెలా 1 వ తేదీన జీతాలు వచ్చేలా చూడాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment