ఖజానా సేవలు బంద్!
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలోని ఖజా నా శాఖ ద్వారా అందుతున్న సేవలు పది రోజుల పాటు నిలిచిపోనున్నాయి. రాష్ట్ర విభజన కారణంగా ఈ శాఖ కూడా రెండుగా విడిపోనుండడంతో ఈ శాఖలో కార్యకలాపాలను ఈ నెల 24 నుంచి నిలిపివేయనున్నారు. తప్పనిసరిగా చెల్లించాల్సి న బిల్లులను అన్ని ఉప ఖజానా కార్యాల యాల నుంచి తెప్పించుకుని జిల్లా ఖజానా శాఖ కార్యాలయం ద్వారా పంపించారు. ఇక బిల్లుల సమర్పణకు కూడా అవకాశం లేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరి వేతనాలు, పింఛన్ల చెల్లింపుల కోసం బిల్లుల స్వీకరణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. గతంలో మే 17 నాటికి బిల్లుల స్వీకరణ పూర్తి చేస్తామని చెప్పిన యంత్రాంగం తరవాత 19 వరకూ అవకాశమిచ్చింది. తరవాత ఆ తేదీని 21వ వరకూ పొడిగించింది.
నాలుగైదు జిల్లాలను యూనిట్‌గా తీసుకుని యుద్ధ ప్రాతిపదికన బిల్లుల స్వీకరణ చేపట్టారు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు కొన్ని రోజులుగా ఖజానా శాఖ ఉద్యోగులు నానా హైరానా పడుతున్నారు. జిల్లాలోని అన్ని సబ్ ట్రెజరీ కార్యాలయాల పరిధిలో ఉన్న బిల్లులను జిల్లా కేంద్రానికి తీసుకువచ్చి ఇక్కడి సర్వర్‌తో సమర్పణ కార్యక్రమాన్ని ఎట్టకేలకు పూర్తి చేశారు. 21తో బిల్లుల స్వీకరణ, 24తో చెల్లింపులను నిలుపుదల చేసి, మళ్లీ ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చిన ఆదేశాల మేరకు బిల్లులను మంజూరు చేయనున్నారు. అంత వరకూ ఖజానా శాఖ ద్వారా బిల్లులను నిలుపుదల చేస్తారు. ఇప్పటి వరకూ జరిగిన వ్యయాలను సమైక్యాంధ్రప్రదేశ్ ఖాతాలో లెక్కించుకుని అనంతరం జరిగే బిల్లులను రెండు రాష్ట్రాల ద్వారా ఆయా యంత్రాంగాల ఆధ్వర్యంలో నిర్వహించడానికి వీలుగా ముందుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక నుంచి కార్యాలయ పరిధిలోని పనులే తప్ప బిల్లులకు సంబంధించిన పనులు మాత్రం చేసే అవకాశం లేదు.
అభివృద్ధి పనులకు బ్రేక్..
జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు నిలిచిపోనున్నాయి. దీని వల్ల పనులకు విఘాతం కలగనుంది. ముఖ్యంగా గతంలో మంజూరై, ప్రస్తుతం పనులు జరుగుతున్న వాటికి సంబంధించి బిల్లుల చెల్లింపులు కూడా రాష్ట్ర విభజన అనంతరం పునఃప్రారంభిస్తారు.
24 నుంచి బిల్లులు పాస్ కావు
జిల్లాకు సంబంధించిన వేతనాలు, పింఛన్లు తదితర బిల్లులు 24 తరవాత పాస్ కావు. ఇప్పటికే బిల్లుల సమర్పణ కూడా జరిగిపోయింది. బిల్లులను సమర్పించేందుకు కూడా గడువు బుధవారంతో(ఈ నెల 21తో) ముగిసిపోయింది. జూన్ రెండు తరవాతే బిల్లుల చెల్లింపులు, సమర్పణలు ఉంటాయి. ఇప్పటి వరకూ మా వద్ద పెండింగ్ బిల్లులు లేవు.
- పి.వి. భోగారావు, ఖజానా శాఖ డీడీ, విజయనగరం