సాక్షిప్రతినిధి, ఖమ్మం : పేపర్‌తో పని లేకుండా జీతాల బిల్లులన్నీ ఆన్‌లైన్‌లో సమర్పిస్తే.. నెలనెలా ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు వారి ఖాతాలో పడతాయి. ఇటువంటి కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది ఖమ్మం ఖజానా(ట్రెజరీ) శాఖ. ఇక ప్రతి చిన్న పనికి శాఖ ఉద్యోగులు ఉన్నతాధికారి వద్దకు ఫైల్ పట్టుకుని వెళ్లడం.. దీనిపై అనుమానాలుంటే సదరు అధికారికి వివరించాల్సిన అవసరం ఉండదు. వివిధ శాఖల ఉద్యోగులకు ఏ పని కావాలన్నా ఆన్‌లైన్‌లో ట్రెజరీ శాఖ ప్రత్యేక పోర్టల్‌ను సంప్రదించవచ్చు. అలాగే నేరుగా కాగితపు రహిత బిల్లులతో వేతనాల చెల్లింపును కూడా అన్ని ప్రభుత్వ శాఖలకు వర్తింపజేసేలా ఖజానా శాఖ కసరత్తు ప్రారంభించింది.
జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ విధానం ద్వారా మే నెలకు సంబంధించి ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలను అందజేస్తారు. 2020 జనవరి నుంచి జిల్లాలో పూర్తిస్థాయిలో దీనిని అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ప్రతి ఉద్యోగి నెలవారీ వేతనం పొందాలంటే ఆ శాఖకు చెందిన పాలనా సిబ్బంది నెలవారీ హాజరును ముందుగానే ట్రెజరీ శాఖకు పంపాలి. సంతకాలు చేసిన ఫైళ్లను అందజేయాలి. ఈ మొత్తం వివరాలన్నీ సక్రమంగా పంపితేనే ఉద్యోగికి వేతనాలు సక్రమంగా వస్తాయి. వివరాలు పంపడంలో ఏమాత్రం ఆలస్యమైనా.. వేతనాలు కూడా లేటుగానే వస్తాయి. ఉద్యోగులకు నెలవారీగా వేతనం అందాలంటే ఉద్యోగులకు, ట్రెజరీకి మధ్య అకౌంటింగ్ వ్యవస్థ అమలులో ఉంటుంది. అయితే ప్రస్తుతం రూపొందించిన పోర్టల్ ద్వారా ఇక ఈ వ్యవస్థ అవసరం ఉండదు. ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(ఐఎఫ్‌ఎంఐఎస్) ద్వారా ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా వేతనాలు నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల వివరాలను ఐఎఫ్‌ఎంఐఎస్ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. దీని ద్వారా జిల్లాలోని 13,320 మంది రెగ్యులర్ ఉద్యోగులకు, 12,453 మంది పెన్షనర్లకు ఉపయోగం కానున్నది.
ప్రస్తుత విధానం ఇలా..
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడానికి ఇంపాక్ట్ సాఫ్ట్‌వేర్ సేవలు వినియోగిస్తున్నారు. దీని ద్వారా ఉద్యోగి వేతనాలు, ఇతర బిల్లులు ఆన్‌లైన్‌లో నమోదు చేసి.. వాటికి సంబంధించిన హార్డ్ కాపీలను డీడీఓ(డిపార్ట్‌మెంటల్ డ్రాయింగ్ ఆఫీసర్) ధ్రువీకరణతో ట్రెజరీలో ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల పనిభారంతోపాటు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అయితే కొత్త విధానం అమలు జరిగితే ఇలాంటి ఇబ్బందులు ఉండవు. హార్డ్ కాపీలను సమర్పించే అవకాశం ఉండదు.
ఐఎఫ్‌ఎంఐఎస్ చేసే ప్రక్రియ..
ఐఎఫ్‌ఎంఐఎస్‌లో ప్రతి శాఖకు ఒక యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఉంటుంది. దీని ద్వారా లాగిన్ అయిన తర్వాత పూర్తి పేరు, బ్యాంక్ అకౌంట్, పాన్‌కార్డు, ఆధార్ కార్డు వివరాలతోపాటు మొదటి పోస్టింగ్ ఎక్కడ.. గతంలో ఎక్కడ పని చేశారు.. పదోన్నతులు పొందితే ఆ వివరాలు, ప్రస్తుతం ఎక్కడ పని చేస్తున్నారనే వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. పూర్తి చేసిన వివరాలను ఆన్‌లైన్ ద్వారా అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్‌కు పంపాల్సి ఉంటుంది. డీటీఓకు వచ్చిన సమాచారాన్ని పరిశీలించి.. వేతనాలు చెల్లించే ఈ–కుబేర్‌కు పంపిస్తారు.
ట్రెజరీలో కాగితం రహిత పాలన..
జిల్లా ట్రెజరీ కార్యాలయంలో కాగితం రహిత విధానం అమలు చేయనున్నారు. మరికొద్ది నెలల్లో పూర్తిగా కాగితం రహిత పాలన అమలు కానున్నది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అన్ని శాఖల డ్రాయింగ్ అధికారులకు ఐఎఫ్‌ఎంఐఎస్ కేటాయించారు. ఆయా శాఖల పరిధిలోని అధికారులు, ఉద్యోగుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత ఉద్యోగుల వ్యక్తిగత వేతనాలు వారి ఖాతాలో జమ అయ్యేలా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఆన్‌లైన్‌లో వివరాల నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత మే నెల వేతనాలు ఈ విధానం ద్వారా చెల్లించనున్నారు. అయితే ఈ విధానాన్ని ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఉద్యోగుల వివరాలు అందజేసినా ట్రెజరీకి మళ్లీ హార్డ్ కాపీని కూడా సమర్పించాల్సి ఉంటుంది. జనవరి 2020 నుంచి హార్డ్ కాపీలతో పనిలేకుండా నేరుగా వేతనాలు, ఇతర బిల్లులు అందజేయనున్నారు.
వివరాలు సమర్పించాల్సి ఉంది..
రాష్ట్ర ప్రభుత్వం ఖజానా శాఖలో ఐఎఫ్‌ఎంఐఎస్ అనే నూతన విధానాన్ని తెచ్చింది. దీని ద్వారా జిల్లాలోని ఉద్యోగులందరి వేతనాలు సకాలంలో అందనున్నాయి. కొత్త విధానం ద్వారా పేపర్ రహిత పాలన అమలు కానున్నది. శాఖలవారీగా వేతనాల కోసం ఆన్‌లైన్‌లో వివరాలు సమర్పించిన తర్వాత కూడా డిసెంబర్ వరకు హార్డ్ కాపీలను ట్రెజరీలో అందజేయాలి. 2020 జనవరి నుంచి హార్డ్ కాపీలు లేకుండా నేరుగా ఆన్‌లైన్‌లో వివరాలు సమర్పిస్తే ట్రెజరీ ద్వారా వేతనాలు అందనున్నాయి.
– ముత్తినేని వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, ఖమ్మం
Comments
Please login to add a commentAdd a comment