ఒంగోలు టూటౌన్:ఖజానా శాఖలో కాగిత రహిత పాలనా విధానం అమలుకానుంది. పింఛన్లతో పాటు బిల్లులన్నీ ఇక ఆన్‌లైన్‌లోనే చెల్లించేందుకు ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే జిల్లాలోని డ్రాయింగ్ అధికారులు, ట్రెజరీ ఉద్యోగులకు కొత్త విధానం.. అంటే సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానం (సీఎఫ్‌ఎంఎస్)పై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఒంగోలు, మార్కాపురం, కందుకూరు డివిజన్ల వారీగా డ్రాయింగ్ అధికారులకు స్థానిక పేస్ ఇంజినీరింగ్ కళాశాలలో అవగాహన కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించింది. జిల్లా మొత్తం మీద 950 మంది డ్రాయింగ్ ఆఫీసర్లు ఉన్నారు. వీరందరికీ కొత్త విధానంపై అవగాహన కల్పించారు. ఈ నూతన విధానాన్ని గురువారం ప్రభుత్వం ఆవిష్కరించింది. ఏప్రిల్ నుంచి ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరు ఆధారంగా ఆన్‌లైన్‌లోనే బిల్లుల తయారీ ప్రక్రియ సాగనుంది. ఉద్యోగుల సెలవులు, ఇతరత్రా లావాదేవీలన్నింటినీ ఇక్ ఆన్‌లైన్‌లోనే నమోదు చేయాల్సి ఉంటుంది.
జిల్లాలో అద్దంకి, చీరాల, కంభం, దర్శి, గిద్దలూరు, కనిగిరి, కందుకూరు, మార్కాపురం, మార్టూరు, ఒంగోలు, పొదిలి, యర్రగొండపాలెంలో ఉపఖజానా కార్యాలయాలు ఉద్యోగులు, పింఛన్‌దారులకు సేవలందిస్తున్నాయి. వీటి పరిధిలో 32 వేల మంది వరకు వివిధ క్యాడర్లకు చెందిన ఉద్యోగులు, 26 వేల మంది వరకు పెన్షన్‌దారులు ఉన్నారు. వీరుగాకుండా మరో 13 వేల మంది పొరుగుసేవలు అందించే కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరందరికీ నెలకు జీతభత్యాల రూపంలో రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు చెల్లింపులు జరుగుతుంటాయి. ఉద్యోగుల జీతభత్యాల బిల్లులు, ఇతర బిల్లులను ప్రతినెలా ఏజీ ఆడిట్‌కు పంపించాల్సి ఉంటుంది. పెన్షనర్లు, ఉద్యోగులు, ఇతరుల బిల్లులను చెల్లించేందుకు ఎంతో మంది ఉద్యోగులు పనిచేయాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితులలో తమ సమస్యలపై ఉద్యోగ సంఘాలు సమ్మె, నిరసన కార్యక్రమాల వంటి వాటి వలన బిల్లులకు సంబంధించిన రికార్డులు నిలిచిపోవడం జరుగుతుంది.
దీని వలన ఖజానాపై పెద్ద భారమే పడుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత కాగిత రహిత పాలనవైపు సర్కార్ దృష్టిపెట్టింది. మానవ వనరుల వినియోగం తగ్గించి ఆధునిక టెక్నాలజీతో సత్వర సేవలందించేందుకు నిర్ణయించింది. అయితే, కొత్త విధానంలో బయోమెట్రిక్ కీలకం కానుంది. ఏప్రిల్ నుంచి ప్రతి కార్యాలయంలోని ఉద్యోగులు బయెమెట్రిక్ హాజరు వేయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్‌లో హాజరు నమోదైతేనే నెలవారీ జీతం సక్రమంగా బ్యాంకు ఖాతాలో జమవుతుంది. ఉద్యోగుల సెలవులు, ఇతరత్రా లావాదేవీల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో సీఎఫ్‌ఎంఎస్‌కు అనుసంధానం చేసి కంప్యూటర్ ద్వారానే సమగ్ర బిల్లు విధానాన్ని అమలు చేస్తారు. ఏప్రిల్ ఒకటి నుంచి అమలయ్యే కొత్త విధానంలో బయోమెట్రిక్ హాజరే కీలకం కానుందని ట్రెజరీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment