paperless system
-
Budget 2024: ఉమెన్ పవర్‌కు ఊతం ఇచ్చేలా...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్ గురించి గత వారం రోజుల నుంచి ‘ఈసారి కూడా పేపర్‌లెస్ బడ్జెటే’ అనే విశేషంతో పాటు ఫైనాన్స్ బిల్లులు, కేటాయింపులు, స్మార్ట్ ఫోన్ పరికరాలపై దిగుమతి సుంకాలు, వాయుకాలుష్యం తగ్గించడానికి ఎలక్ట్రానిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ఏంచేయబోతున్నారు... ఇలా రకరకాల విషయాలపై ఉహాగానాలు, చర్చలు జరిగాయి. వ్యాపార రంగంలో మహిళ వ్యాపారవేత్తలు సత్తా చాటుతున్న కాలం ఇది. వారి అడుగులను మరింత వేగవంతం చేయడానికి ఈ బడ్జెట్లో ఏం చేయబోతున్నారు? మహిళల్లో నైపుణ్యాభివృద్ధికి ఎలాంటి కార్యాచరణ ఉండబోతోంది? ఔత్సాహిక మహిళ పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ప్రోత్సాహకాలు, రాయితీలు అందనున్నాయి... ఇలాంటి ప్రశ్నలెన్నో బడ్జెట్ నేపథ్యంలో మదిలో మెదులుతాయి. ‘మహిళలకు సంబంధించి బడ్జెట్ 2024 ఎలా ఉండాలి?’ అనే దానిపై కొందరు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ల అభిప్రాయాలు... ప్రత్యేక నిధి గత అయిదేళ్లలో మన దేశంలో మహిళల యాజమాన్యంలోని వ్యాపారాలు 20 శాతానికి పైగా పెరిగాయి. రాబోయే అయిదేళ్లలో 90 శాతం వరకు పెరుగుతాయని అంచనా. ఎన్నో నగరాల్లో మహిళా వ్యాపారుల ప్రతిభాసామర్థ్యాలను ప్రత్యక్షంగా చూశాను. ఇలాంటి వారికి 2024 బడ్జెట్ ఫండింగ్, మౌలిక సదుపాయాల విషయంలో వెన్నుదన్నుగా నిలవాలి. మహిళా పారిశ్రామికవేత్తల కోసం నిధుల కేటాయింపులో గణనీయమైన పెరుగుదల ఉండాలి. –స్వాతి భార్గవ, కో–ఫౌండర్, క్యాష్ కరో మహిళా శ్రేయస్సు మహిళల హెల్త్‌కేర్ బ్రాండ్ వ్యవస్థాపకురాలిగా మహిళల శ్రేయస్సుకు 2024 బడ్జెట్ దోహదకారి కావాలని కోరుకుంటున్నాను. స్కిల్ డెవలప్మెంట్, హెల్త్‌కేర్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లలో మహిళలు రాణించేందుకు, వారికి సాధికారత కల్పించేందుకు బడ్జెట్ ఉపయోగపడాలని ఆశిస్తున్నాను. – రచనా గుప్తా, కో–ఫౌండర్, జినోవేద గేమ్ చేంజర్‌గా... మహిళలు నిర్వహించే వ్యాపారాలను ముందుకు నడిపించే గేమ్‌చేంజర్‌గా ఈ బడ్జెట్ ఉండాలని ఆశిస్తున్నాను. రుణ ప్రక్రియను సరళతరం చేయాలి. మహిళల నేతృత్వంలోని వ్యాపారాల్లో వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులను ప్రోత్సహించాలి. నిధుల అంతరాన్ని పూడ్చాలి. గ్రాంట్లు, సబ్సిడీలు, పన్ను మినహాయింపుల రూపంలో ఆర్థిక ప్రోత్సాహకాల కోసం ఎదురు చూస్తున్నాం. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల వ్యాపార చతురత, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించే శిక్షణా కార్యక్రమాల కోసం బడ్జెట్లో కేటాయింపులు అవసరం. మహిళలకు సంక్షేమ పథకాలు అందే విషయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చేయాలి. మాటలు కాదు కార్యాచరణ కనిపించాలి. ‘ఇది కొత్త బడ్జెట్’ అనిపించాలి. – సోమ్దత్తా సింగ్, ఇ–కామర్స్ ఎంటర్ ప్రెన్యూర్, ఏంజెల్ ఇన్వెస్టర్, రైటర్ మరిన్ని పొదుపు పథకాలు గ్రామీణ సమాజంలోని మహిళల కోసం మరిన్ని పొదుపు పథకాలను రూపొందిస్తారని ఆశిస్తున్నాను. వడ్డీ లేని రుణాలను ప్రవేశ పెట్టాలి. మహిళల నేతృత్వంలోని సంస్థల అభివృద్ధికి తోడ్పడేలా బడ్జెట్ ఉండాలి. మహిళలకు సంబంధించి ఎంటర్ ప్రెన్యూర్షిప్కు ప్రోత్సాహం అందేలా, స్కిల్ బిల్డింగ్‌కు ప్రయోజనం చేకూర్చే పథకాలను ప్రవేశపెట్టాలని ఆశిస్తున్నాను. స్కిల్ గ్యాప్స్ లేకుండా ఉండడానికి మహిళల కోసం ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు రూపొందించాలి. కృత్రిమ మేధ ఆధారిత రంగాలలో మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సాంకేతిక శిక్షణా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. – ఉపాసన టకు, కో ఫౌండర్–మొబిక్విక్ ప్రపంచ ఆర్థికశక్తిగా ఎదిగేలా... పన్నెండవ తరగతి తరువాత యువతులకు నైపుణ్యశిక్షణా కార్యక్రమాలు చేపట్టాలి. ‘మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తాం’ అని ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. వ్యవసాయరంగంలో ఉన్న మహిళలపై దృష్టి సారించాలి. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న మన దేశ లక్ష్యం నెరవేరేలా వివిధ రంగాల మహిళలకు బడ్జెట్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. – జ్యోతీ బండారీ, లోవక్ క్యాపిటల్ ఫౌండర్, సీయివో బాలికల విద్యకు ప్రాధాన్యత రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అలవెన్స్ పెంచాలి. ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలి. బాలికల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. బాలికలకు సంబంధించి ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్‌ను పెంచాలి. – రాధిక దాల్మియ, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (కోల్‌కతా చాప్టర్)– చైర్పర్సన్ మహిళా రైతుల కోసం... బడ్జెట్లో మహిళా రైతులు, కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యవసాయ రంగంలో మహిళల భాగస్వామ్యానికి గుర్తింపు ఇచ్చే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. రాయితీల ద్వారా మహిళా రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా ప్రోత్సాహకాలు అందించాలి. – ధనశ్రీ మంధానీ, సలాం కిసాన్–ఫౌండర్ ఫ్యూచర్ రెడీ స్కిల్స్ ‘ఫ్యూచర్ రెడీ’ స్కిల్స్ కోసం మహిళలను సన్నద్ధం చేసే కార్యాచరణను రూపొందించాలి. మహిళల నైపుణ్య శిక్షణకు సంబంధించి పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు ఇవ్వాలి. స్కిల్ డెవలప్మెంట్ వల్ల కెరీర్ బ్రేక్ తీసుకున్న మహిళలు తిరిగి ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉంటుంది. – నేహా బగారియా, ఫౌండర్– జాబ్స్ ఫర్ హర్ -
చేతిరాతకు చెల్లు !
సాక్షి, ఒంగోలు సిటీ: చేతిరాతకు ఇక చెల్లు. ఇలాంటి దస్త్రాలను అధికారులు వెనక్కి పంపుతున్నారు. అన్ని కార్యాలయాల్లో పూర్తిగా ఎలక్ట్రానిక్ లావాదేవీలు అమలులోకి వచ్చాయి. రెవెన్యూ శాఖతో మొదలై ఇప్పుడు అన్నింటా ఎలక్ట్రానిక్ కార్యాలయాలు నడుస్తున్నాయి. ఆరు నెలల సమయంలోనే 2.2 లక్షల దస్త్రాలు ఎలక్ట్రానిక్ పద్ధతిలో నడిచాయి. మార్క్‌ఫెడ్ కార్యాలయం నుంచే ఒక్క కాగిత లావాదేవీ లేదు. పారదర్శక పాలన..జవాబుదారి తనం పెంచడానికి ఇవి కీలకపాత్ర వహిస్తున్నాయి. జిల్లాలోని పలు రెవెన్యూ కార్యాలయాల్లో రికార్డులు సక్రమంగా లేవు. జిల్లా కేంద్రం ఒంగోలులోనే ఇంప్లిమెంట్ ఆర్ఎస్ఆర్ తస్కరించారు. ఇక చీమకుర్తి తహశీల్దార్ కార్యాలయంలో అయితే రికార్డు కార్యాలయంలో కన్నా ప్రైవేటు వ్యక్తుల వద్దే ఉంది. ఇలా రెవెన్యూ కార్యాలయంలోనే కాదు పలు ప్రభుత్వ కార్యాలయాల్లో కీలక దస్త్రాలు మాయమయ్యాయి. దీని వల్లే రికార్డు సరిగ్గా లేదు. కోర్టు వివాదాలకు దారి తీశాయి. లిటిగేషన్లతో కొత్త తరం అధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎలక్ట్రానిక్ కార్యాలయాలు పూర్వపు లావాదేవీలలో లోపాలను సరిచేయలేకపోయినా ఇప్పుడు కొత్తగా జరిగే లావాదేవీలను పారదర్శకంగా చేశారు. ఒక అంశంపై రికార్డు తయారైందంటే వాటికి సంబంధించి ప్రతి డాక్యుమెంట్ ఎలక్ట్రానిక్ లావాదేవీలో రికార్డవుతుంది. దీని వల్ల భవిష్యత్తులో చేర్పులు, మార్పులు చేయాలంటే ఏ ఒక్కరి వల్ల కాని పనిగా తయారైంది. ఇప్పుడు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే దస్త్రాలు నడుస్తున్నాయి. జిల్లా, మండల స్థాయిలో సంపూర్ణంగా ఎలక్ట్రానిక్ కార్యాలయాల ద్వారా లావాదేవీలు నడుస్తున్నాయి. ఇక త్వరలోనే గ్రామ స్థాయిలోనూ ఈ వ్యవస్థ సంపూర్ణంగా అమలు కానుంది. కాగిత రహిత సేవలు అందుబాటులోకి.. జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో కాగిత రహిత సేవలు అందుబాటులోకి వచ్చాయి. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (నిక్నెట్) ఎలక్ట్రానిక్ కార్యాలయాల సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసింది. రెవెన్యూ శాఖలో రికార్డు మొత్తంగా తప్పులతడకగా ఉండడంతో ఈ శాఖలో తొలుత మొదలు పెట్టారు. క్రమంగా అన్ని శాఖలకు కాగితరహిత పాలన అందుబాటులోకి తెచ్చారు. ఏటా స్టేషనరీ బడ్జెట్ కోసం వెచ్చించే రూ.లక్షలు ప్రభుత్వానికి మిగిలాయి. స్టేషనరీ బడ్జెట్ ఇప్పుడు కాగిత రహిత పాలన వల్ల ఖర్చు బాగా తగ్గింది. 2.20 లక్షల లావాదేవీలు: జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఎలక్ట్రానిక్ దస్త్రాల లావాదేవీలు పెరిగాయి. ఒక్క మార్క్‌ఫెడ్‌లో మాత్రం సున్నా లావాదేవీ నమోదైంది. భవిష్యత్తులో న్యాయశాఖ, కోర్టులకు సంభందించి లావాదేవీలు పూర్తి స్థాయిలో కాగిత రహిత పాలన కిందకు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నారు. అన్ని శాఖలకు సంబంధించి 1,47,579 దస్త్రాలు తయారు కాగా వీటి నుంచి 2,20,327 లావాదేవీలు జరిగాయి. ఇందులో రెవెన్యూ శాఖ నుంచి 64,696 దస్త్రాల లావాదేవీలు జరిగాయి. తర్వాత స్థానం జిల్లా పరిషత్తుది. జెడ్పీలో 33,468 దస్త్రాలు ఎలక్ట్రానిక్ కార్యాలయం ద్వారా లావాదేవీలు జరిగాయి. బాగా వెనుకబడిన శాఖల్లో ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ 74 లావాదేవీలు, అద్దంకి మున్సిపాలిటీ 996, అగ్నిమాపక సేవల సంస్థ 108, సర్వే భూమి కొలతల శాఖ 732, మార్కాపురం మున్సిపాలిటీ 456, సహకారశాఖ 958, సాంఘిక సంక్షేమ శాఖ 815, రవాణా 592, చీమకుర్తి మున్సిపాలిటీ 207, కనిగిరి నగర పంచాయతీ 992, స్టేట్‌ట్యాక్స్ 219, ఏసీబీ 34, జైళ్లశాఖ 70, అనియత విద్య 95, న్యాయశాఖ 29, గనుల శాఖ 374, గిద్దలూరు లాగింగ్ 12, చేనేతజౌళి 48, ఆత్మ 77, ఫుడ్ సేఫ్టీ 97, జలవనరుల శాఖ సీఈ కార్యాలయం 83, యూత్ సర్వీసెస్ 59, ఎపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ 34, లైబ్రరీ 33, బేవరేజ్ కార్పొరేషన్ 26, జిల్లా సబ్‌జైల్స్ 18, డీఎస్జిడీసీడబ్ల్యూ 1, ఎన్హెచ్వైపీ 5, కాలుష్యనియంత్రణ 3, మెడికల్ కళాశాల 3, ఏపీకేవీఐబీ 3 ఇలా కొన్ని శాఖలు ఒకే అంకెలోనే లావాదేవీలు నిర్వహించాయి. 112 ప్రభుత్వ విభాగాల్లో అన్ని శాఖలు దాదాపుగా ఎలక్ట్రానిక్ దస్త్రాల లావాదేవీల పరిధిలోకి వచ్చాయి. ఉద్యోగులకు ఈ–మెయిల్ ఐడీలు ఎలక్ట్రానిక్ కార్యాలయం పరిధిలోకి వచ్చిన ఉద్యోగులందరికీ ఈ మెయిల్ ఐడీలను ఇచ్చారు. జిల్లాలో 7,800 ఉద్యోగులకు ఈ ఐడీలు ఇచ్చారు. నిత్యం దస్త్రాలను లావాదేవీలను నిర్వహించే వారికి ఈ ఐడీలు ఇచ్చారు. ఎలక్ట్రానిక్ కార్యాలయాలు వచ్చిన తర్వాత ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా పని పెండింగ్‌లో లేకుండా చేసుకొనే వెసులుబాటు వచ్చింది. రాత్రి వేళల్లోనూ లావాదేవీలు పూర్తి చేసుకునే వీలున్నందున రద్దీగా ఉంటే కార్యాలయాలు, నిత్యం ప్రజలతో సంబంధాలు ఉండే కార్యాలయాల్లో తీరిక వేళల్లో ఈ దస్త్రాలను పరిష్కరిస్తున్నారు. వెనుకబడిన శాఖల్లో లావాదేవీలు పెంచాలని కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశాలు జారీ చేశారు. నిత్యం ఎలక్ట్రానిక్ లావాదేవీలు పరిశీలిస్తున్నారు. ఒక దస్త్రం ఏ సీటుకు ఏ సమయంలో వెళ్లింది. ఎంత సమయంలో పరిష్కరించి పై అధికారులకు పంపారో వివరాలన్నీ నమోదవుతున్నందున జవాబుదారితనం పెరిగింది. -
పేపర్లేకుండా.. పని..!
సాక్షిప్రతినిధి, ఖమ్మం : పేపర్‌తో పని లేకుండా జీతాల బిల్లులన్నీ ఆన్లైన్లో సమర్పిస్తే.. నెలనెలా ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు వారి ఖాతాలో పడతాయి. ఇటువంటి కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది ఖమ్మం ఖజానా(ట్రెజరీ) శాఖ. ఇక ప్రతి చిన్న పనికి శాఖ ఉద్యోగులు ఉన్నతాధికారి వద్దకు ఫైల్ పట్టుకుని వెళ్లడం.. దీనిపై అనుమానాలుంటే సదరు అధికారికి వివరించాల్సిన అవసరం ఉండదు. వివిధ శాఖల ఉద్యోగులకు ఏ పని కావాలన్నా ఆన్లైన్లో ట్రెజరీ శాఖ ప్రత్యేక పోర్టల్‌ను సంప్రదించవచ్చు. అలాగే నేరుగా కాగితపు రహిత బిల్లులతో వేతనాల చెల్లింపును కూడా అన్ని ప్రభుత్వ శాఖలకు వర్తింపజేసేలా ఖజానా శాఖ కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ విధానం ద్వారా మే నెలకు సంబంధించి ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలను అందజేస్తారు. 2020 జనవరి నుంచి జిల్లాలో పూర్తిస్థాయిలో దీనిని అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ప్రతి ఉద్యోగి నెలవారీ వేతనం పొందాలంటే ఆ శాఖకు చెందిన పాలనా సిబ్బంది నెలవారీ హాజరును ముందుగానే ట్రెజరీ శాఖకు పంపాలి. సంతకాలు చేసిన ఫైళ్లను అందజేయాలి. ఈ మొత్తం వివరాలన్నీ సక్రమంగా పంపితేనే ఉద్యోగికి వేతనాలు సక్రమంగా వస్తాయి. వివరాలు పంపడంలో ఏమాత్రం ఆలస్యమైనా.. వేతనాలు కూడా లేటుగానే వస్తాయి. ఉద్యోగులకు నెలవారీగా వేతనం అందాలంటే ఉద్యోగులకు, ట్రెజరీకి మధ్య అకౌంటింగ్ వ్యవస్థ అమలులో ఉంటుంది. అయితే ప్రస్తుతం రూపొందించిన పోర్టల్ ద్వారా ఇక ఈ వ్యవస్థ అవసరం ఉండదు. ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(ఐఎఫ్ఎంఐఎస్) ద్వారా ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా వేతనాలు నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల వివరాలను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. దీని ద్వారా జిల్లాలోని 13,320 మంది రెగ్యులర్ ఉద్యోగులకు, 12,453 మంది పెన్షనర్లకు ఉపయోగం కానున్నది. ప్రస్తుత విధానం ఇలా.. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడానికి ఇంపాక్ట్ సాఫ్ట్వేర్ సేవలు వినియోగిస్తున్నారు. దీని ద్వారా ఉద్యోగి వేతనాలు, ఇతర బిల్లులు ఆన్లైన్లో నమోదు చేసి.. వాటికి సంబంధించిన హార్డ్ కాపీలను డీడీఓ(డిపార్ట్మెంటల్ డ్రాయింగ్ ఆఫీసర్) ధ్రువీకరణతో ట్రెజరీలో ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల పనిభారంతోపాటు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అయితే కొత్త విధానం అమలు జరిగితే ఇలాంటి ఇబ్బందులు ఉండవు. హార్డ్ కాపీలను సమర్పించే అవకాశం ఉండదు. ఐఎఫ్ఎంఐఎస్ చేసే ప్రక్రియ.. ఐఎఫ్‌ఎంఐఎస్‌లో ప్రతి శాఖకు ఒక యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉంటుంది. దీని ద్వారా లాగిన్ అయిన తర్వాత పూర్తి పేరు, బ్యాంక్ అకౌంట్, పాన్‌కార్డు, ఆధార్ కార్డు వివరాలతోపాటు మొదటి పోస్టింగ్ ఎక్కడ.. గతంలో ఎక్కడ పని చేశారు.. పదోన్నతులు పొందితే ఆ వివరాలు, ప్రస్తుతం ఎక్కడ పని చేస్తున్నారనే వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. పూర్తి చేసిన వివరాలను ఆన్లైన్ ద్వారా అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్‌కు పంపాల్సి ఉంటుంది. డీటీఓకు వచ్చిన సమాచారాన్ని పరిశీలించి.. వేతనాలు చెల్లించే ఈ–కుబేర్‌కు పంపిస్తారు. ట్రెజరీలో కాగితం రహిత పాలన.. జిల్లా ట్రెజరీ కార్యాలయంలో కాగితం రహిత విధానం అమలు చేయనున్నారు. మరికొద్ది నెలల్లో పూర్తిగా కాగితం రహిత పాలన అమలు కానున్నది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అన్ని శాఖల డ్రాయింగ్ అధికారులకు ఐఎఫ్ఎంఐఎస్ కేటాయించారు. ఆయా శాఖల పరిధిలోని అధికారులు, ఉద్యోగుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత ఉద్యోగుల వ్యక్తిగత వేతనాలు వారి ఖాతాలో జమ అయ్యేలా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ఆన్లైన్లో వివరాల నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత మే నెల వేతనాలు ఈ విధానం ద్వారా చెల్లించనున్నారు. అయితే ఈ విధానాన్ని ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్లో ఉద్యోగుల వివరాలు అందజేసినా ట్రెజరీకి మళ్లీ హార్డ్ కాపీని కూడా సమర్పించాల్సి ఉంటుంది. జనవరి 2020 నుంచి హార్డ్ కాపీలతో పనిలేకుండా నేరుగా వేతనాలు, ఇతర బిల్లులు అందజేయనున్నారు. వివరాలు సమర్పించాల్సి ఉంది.. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా శాఖలో ఐఎఫ్ఎంఐఎస్ అనే నూతన విధానాన్ని తెచ్చింది. దీని ద్వారా జిల్లాలోని ఉద్యోగులందరి వేతనాలు సకాలంలో అందనున్నాయి. కొత్త విధానం ద్వారా పేపర్ రహిత పాలన అమలు కానున్నది. శాఖలవారీగా వేతనాల కోసం ఆన్లైన్లో వివరాలు సమర్పించిన తర్వాత కూడా డిసెంబర్ వరకు హార్డ్ కాపీలను ట్రెజరీలో అందజేయాలి. 2020 జనవరి నుంచి హార్డ్ కాపీలు లేకుండా నేరుగా ఆన్లైన్లో వివరాలు సమర్పిస్తే ట్రెజరీ ద్వారా వేతనాలు అందనున్నాయి. – ముత్తినేని వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, ఖమ్మం -
వరంగల్: పేపర్‌లెస్ టికెట్ల కోసం ప్రత్యేక యాప్
-
ఖజానాలో కాగిత రహిత పాలన
ఒంగోలు టూటౌన్:ఖజానా శాఖలో కాగిత రహిత పాలనా విధానం అమలుకానుంది. పింఛన్లతో పాటు బిల్లులన్నీ ఇక ఆన్లైన్లోనే చెల్లించేందుకు ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే జిల్లాలోని డ్రాయింగ్ అధికారులు, ట్రెజరీ ఉద్యోగులకు కొత్త విధానం.. అంటే సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానం (సీఎఫ్ఎంఎస్)పై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఒంగోలు, మార్కాపురం, కందుకూరు డివిజన్ల వారీగా డ్రాయింగ్ అధికారులకు స్థానిక పేస్ ఇంజినీరింగ్ కళాశాలలో అవగాహన కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించింది. జిల్లా మొత్తం మీద 950 మంది డ్రాయింగ్ ఆఫీసర్లు ఉన్నారు. వీరందరికీ కొత్త విధానంపై అవగాహన కల్పించారు. ఈ నూతన విధానాన్ని గురువారం ప్రభుత్వం ఆవిష్కరించింది. ఏప్రిల్ నుంచి ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరు ఆధారంగా ఆన్లైన్లోనే బిల్లుల తయారీ ప్రక్రియ సాగనుంది. ఉద్యోగుల సెలవులు, ఇతరత్రా లావాదేవీలన్నింటినీ ఇక్ ఆన్లైన్లోనే నమోదు చేయాల్సి ఉంటుంది. జిల్లాలో అద్దంకి, చీరాల, కంభం, దర్శి, గిద్దలూరు, కనిగిరి, కందుకూరు, మార్కాపురం, మార్టూరు, ఒంగోలు, పొదిలి, యర్రగొండపాలెంలో ఉపఖజానా కార్యాలయాలు ఉద్యోగులు, పింఛన్‌దారులకు సేవలందిస్తున్నాయి. వీటి పరిధిలో 32 వేల మంది వరకు వివిధ క్యాడర్లకు చెందిన ఉద్యోగులు, 26 వేల మంది వరకు పెన్షన్‌దారులు ఉన్నారు. వీరుగాకుండా మరో 13 వేల మంది పొరుగుసేవలు అందించే కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరందరికీ నెలకు జీతభత్యాల రూపంలో రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు చెల్లింపులు జరుగుతుంటాయి. ఉద్యోగుల జీతభత్యాల బిల్లులు, ఇతర బిల్లులను ప్రతినెలా ఏజీ ఆడిట్‌కు పంపించాల్సి ఉంటుంది. పెన్షనర్లు, ఉద్యోగులు, ఇతరుల బిల్లులను చెల్లించేందుకు ఎంతో మంది ఉద్యోగులు పనిచేయాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితులలో తమ సమస్యలపై ఉద్యోగ సంఘాలు సమ్మె, నిరసన కార్యక్రమాల వంటి వాటి వలన బిల్లులకు సంబంధించిన రికార్డులు నిలిచిపోవడం జరుగుతుంది. దీని వలన ఖజానాపై పెద్ద భారమే పడుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత కాగిత రహిత పాలనవైపు సర్కార్ దృష్టిపెట్టింది. మానవ వనరుల వినియోగం తగ్గించి ఆధునిక టెక్నాలజీతో సత్వర సేవలందించేందుకు నిర్ణయించింది. అయితే, కొత్త విధానంలో బయోమెట్రిక్ కీలకం కానుంది. ఏప్రిల్ నుంచి ప్రతి కార్యాలయంలోని ఉద్యోగులు బయెమెట్రిక్ హాజరు వేయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్‌లో హాజరు నమోదైతేనే నెలవారీ జీతం సక్రమంగా బ్యాంకు ఖాతాలో జమవుతుంది. ఉద్యోగుల సెలవులు, ఇతరత్రా లావాదేవీల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడంతో సీఎఫ్ఎంఎస్కు అనుసంధానం చేసి కంప్యూటర్ ద్వారానే సమగ్ర బిల్లు విధానాన్ని అమలు చేస్తారు. ఏప్రిల్ ఒకటి నుంచి అమలయ్యే కొత్త విధానంలో బయోమెట్రిక్ హాజరే కీలకం కానుందని ట్రెజరీ వర్గాలు తెలిపాయి. -
ఈ–వాలెట్ ద్వారా అన్రిజర్వ్డ్ టికెట్ల బుకింగ్
న్యూఢిల్లీ: త్వరలో పేటీఎం, జియోమనీ, ఎయిర్‌టెల్‌మనీ లాంటి ఈ–వాలెట్ సర్వీసుల ద్వారా అన్ రిజర్వ్డ్ టికెట్ల బుకింగ్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా కాగిత రహిత మొబైల్ టికెటింగ్‌ను పెంచేందుకు ఈ–కామర్స్ రంగంపై రైల్వేశాఖ దృష్టిసారించింది. రిజర్వేషన్ లేని టికెట్ల ఫారమ్‌ల నిర్వహణ సమస్యగా తయారైందని పేపర్‌లెస్ వ్యవస్థ దిశగా అడుగులేసేందుకే ఈ–వాలెట్‌లోకి ప్రవేశిస్తున్నట్లు తెలిపింది. టికెట్లను విక్రయించిన ఈ–వాలెట్ సంస్థల నుంచి రైల్వేకి కమీషన్ల రూపంలో ఆదాయం సమకూరనుంది.