చేతిరాతకు చెల్లు ! | Paperless System Implementing In Prakasam | Sakshi
Sakshi News home page

చేతిరాతకు చెల్లు !

Published Fri, Aug 23 2019 8:36 AM | Last Updated on Fri, Aug 23 2019 8:36 AM

Paperless System Implementing In Prakasam - Sakshi

సాక్షి, ఒంగోలు సిటీ: చేతిరాతకు ఇక చెల్లు. ఇలాంటి దస్త్రాలను అధికారులు వెనక్కి పంపుతున్నారు. అన్ని కార్యాలయాల్లో పూర్తిగా ఎలక్ట్రానిక్‌ లావాదేవీలు అమలులోకి వచ్చాయి. రెవెన్యూ శాఖతో మొదలై ఇప్పుడు అన్నింటా ఎలక్ట్రానిక్‌ కార్యాలయాలు నడుస్తున్నాయి. ఆరు నెలల సమయంలోనే 2.2 లక్షల దస్త్రాలు ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో నడిచాయి. మార్క్‌ఫెడ్‌ కార్యాలయం నుంచే ఒక్క కాగిత లావాదేవీ లేదు. పారదర్శక పాలన..జవాబుదారి తనం పెంచడానికి ఇవి కీలకపాత్ర వహిస్తున్నాయి. జిల్లాలోని పలు రెవెన్యూ కార్యాలయాల్లో రికార్డులు సక్రమంగా లేవు. జిల్లా కేంద్రం ఒంగోలులోనే ఇంప్లిమెంట్‌ ఆర్‌ఎస్‌ఆర్‌ తస్కరించారు. ఇక చీమకుర్తి తహశీల్దార్‌ కార్యాలయంలో అయితే రికార్డు కార్యాలయంలో కన్నా ప్రైవేటు వ్యక్తుల వద్దే ఉంది. ఇలా రెవెన్యూ కార్యాలయంలోనే కాదు పలు ప్రభుత్వ కార్యాలయాల్లో కీలక దస్త్రాలు మాయమయ్యాయి. దీని వల్లే రికార్డు సరిగ్గా లేదు. కోర్టు వివాదాలకు దారి తీశాయి.

లిటిగేషన్లతో కొత్త తరం అధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎలక్ట్రానిక్‌ కార్యాలయాలు పూర్వపు లావాదేవీలలో లోపాలను సరిచేయలేకపోయినా ఇప్పుడు కొత్తగా జరిగే లావాదేవీలను పారదర్శకంగా చేశారు. ఒక అంశంపై రికార్డు తయారైందంటే వాటికి సంబంధించి ప్రతి డాక్యుమెంట్‌ ఎలక్ట్రానిక్‌ లావాదేవీలో రికార్డవుతుంది. దీని వల్ల భవిష్యత్తులో చేర్పులు, మార్పులు చేయాలంటే ఏ ఒక్కరి వల్ల కాని పనిగా తయారైంది. ఇప్పుడు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలక్ట్రానిక్‌ పద్ధతిలోనే దస్త్రాలు నడుస్తున్నాయి. జిల్లా, మండల స్థాయిలో సంపూర్ణంగా ఎలక్ట్రానిక్‌ కార్యాలయాల ద్వారా లావాదేవీలు నడుస్తున్నాయి. ఇక త్వరలోనే గ్రామ స్థాయిలోనూ ఈ వ్యవస్థ సంపూర్ణంగా అమలు కానుంది.

కాగిత రహిత సేవలు అందుబాటులోకి..
జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో కాగిత రహిత సేవలు అందుబాటులోకి వచ్చాయి. నేషనల్‌ ఇన్ఫర్మేటిక్‌ సెంటర్‌ (నిక్‌నెట్‌) ఎలక్ట్రానిక్‌ కార్యాలయాల సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసింది. రెవెన్యూ శాఖలో రికార్డు మొత్తంగా తప్పులతడకగా ఉండడంతో ఈ శాఖలో తొలుత మొదలు పెట్టారు. క్రమంగా అన్ని శాఖలకు కాగితరహిత పాలన అందుబాటులోకి తెచ్చారు. ఏటా స్టేషనరీ బడ్జెట్‌ కోసం వెచ్చించే రూ.లక్షలు ప్రభుత్వానికి మిగిలాయి. స్టేషనరీ బడ్జెట్‌ ఇప్పుడు కాగిత రహిత పాలన వల్ల ఖర్చు బాగా తగ్గింది.

2.20 లక్షల లావాదేవీలు: 
జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఎలక్ట్రానిక్‌ దస్త్రాల లావాదేవీలు పెరిగాయి. ఒక్క మార్క్‌ఫెడ్‌లో మాత్రం సున్నా లావాదేవీ నమోదైంది. భవిష్యత్తులో న్యాయశాఖ, కోర్టులకు సంభందించి లావాదేవీలు పూర్తి స్థాయిలో కాగిత రహిత పాలన కిందకు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నారు. అన్ని శాఖలకు సంబంధించి 1,47,579 దస్త్రాలు తయారు కాగా వీటి నుంచి 2,20,327 లావాదేవీలు జరిగాయి. ఇందులో రెవెన్యూ శాఖ నుంచి 64,696 దస్త్రాల లావాదేవీలు జరిగాయి. తర్వాత స్థానం జిల్లా పరిషత్తుది. జెడ్పీలో 33,468 దస్త్రాలు ఎలక్ట్రానిక్‌ కార్యాలయం ద్వారా లావాదేవీలు జరిగాయి.

బాగా వెనుకబడిన శాఖల్లో ఎంప్లాయిమెంట్‌ ట్రైనింగ్‌ 74 లావాదేవీలు, అద్దంకి మున్సిపాలిటీ 996, అగ్నిమాపక సేవల సంస్థ 108, సర్వే భూమి కొలతల శాఖ 732, మార్కాపురం మున్సిపాలిటీ 456, సహకారశాఖ 958, సాంఘిక సంక్షేమ శాఖ 815, రవాణా 592, చీమకుర్తి మున్సిపాలిటీ 207, కనిగిరి నగర పంచాయతీ 992, స్టేట్‌ట్యాక్స్‌ 219, ఏసీబీ 34, జైళ్లశాఖ 70, అనియత విద్య 95, న్యాయశాఖ 29, గనుల శాఖ 374, గిద్దలూరు లాగింగ్‌ 12, చేనేతజౌళి 48, ఆత్మ 77, ఫుడ్‌ సేఫ్టీ 97, జలవనరుల శాఖ సీఈ కార్యాలయం 83, యూత్‌ సర్వీసెస్‌ 59, ఎపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ 34, లైబ్రరీ 33, బేవరేజ్‌ కార్పొరేషన్‌ 26, జిల్లా సబ్‌జైల్స్‌ 18, డీఎస్‌జిడీసీడబ్ల్యూ 1, ఎన్‌హెచ్‌వైపీ 5, కాలుష్యనియంత్రణ 3, మెడికల్‌ కళాశాల 3, ఏపీకేవీఐబీ 3 ఇలా కొన్ని శాఖలు ఒకే అంకెలోనే లావాదేవీలు నిర్వహించాయి. 112 ప్రభుత్వ విభాగాల్లో అన్ని శాఖలు దాదాపుగా ఎలక్ట్రానిక్‌ దస్త్రాల లావాదేవీల పరిధిలోకి వచ్చాయి.

ఉద్యోగులకు ఈ–మెయిల్‌ ఐడీలు
ఎలక్ట్రానిక్‌ కార్యాలయం పరిధిలోకి వచ్చిన ఉద్యోగులందరికీ ఈ మెయిల్‌ ఐడీలను ఇచ్చారు. జిల్లాలో 7,800 ఉద్యోగులకు ఈ ఐడీలు ఇచ్చారు. నిత్యం దస్త్రాలను లావాదేవీలను నిర్వహించే వారికి ఈ ఐడీలు ఇచ్చారు. ఎలక్ట్రానిక్‌ కార్యాలయాలు వచ్చిన తర్వాత ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా పని పెండింగ్‌లో లేకుండా చేసుకొనే వెసులుబాటు వచ్చింది.  రాత్రి వేళల్లోనూ లావాదేవీలు పూర్తి చేసుకునే వీలున్నందున రద్దీగా ఉంటే కార్యాలయాలు, నిత్యం ప్రజలతో సంబంధాలు ఉండే కార్యాలయాల్లో తీరిక వేళల్లో ఈ దస్త్రాలను పరిష్కరిస్తున్నారు.  వెనుకబడిన శాఖల్లో లావాదేవీలు పెంచాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆదేశాలు జారీ చేశారు. నిత్యం ఎలక్ట్రానిక్‌ లావాదేవీలు పరిశీలిస్తున్నారు. ఒక దస్త్రం ఏ సీటుకు ఏ సమయంలో వెళ్లింది. ఎంత సమయంలో పరిష్కరించి పై అధికారులకు పంపారో వివరాలన్నీ  నమోదవుతున్నందున జవాబుదారితనం పెరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement