కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్ గురించి గత వారం రోజుల నుంచి ‘ఈసారి కూడా పేపర్‌లెస్ బడ్జెటే’ అనే విశేషంతో పాటు ఫైనాన్స్ బిల్లులు, కేటాయింపులు, స్మార్ట్ ఫోన్ పరికరాలపై దిగుమతి సుంకాలు, వాయుకాలుష్యం తగ్గించడానికి ఎలక్ట్రానిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ఏంచేయబోతున్నారు... ఇలా రకరకాల విషయాలపై ఉహాగానాలు, చర్చలు జరిగాయి.
వ్యాపార రంగంలో మహిళ వ్యాపారవేత్తలు సత్తా చాటుతున్న కాలం ఇది. వారి అడుగులను మరింత వేగవంతం చేయడానికి ఈ బడ్జెట్‌లో ఏం చేయబోతున్నారు?
మహిళల్లో నైపుణ్యాభివృద్ధికి ఎలాంటి కార్యాచరణ ఉండబోతోంది? ఔత్సాహిక మహిళ పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ప్రోత్సాహకాలు, రాయితీలు అందనున్నాయి... ఇలాంటి ప్రశ్నలెన్నో బడ్జెట్ నేపథ్యంలో మదిలో మెదులుతాయి. ‘మహిళలకు సంబంధించి బడ్జెట్ 2024 ఎలా ఉండాలి?’ అనే దానిపై కొందరు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌ల అభిప్రాయాలు...
ప్రత్యేక నిధి
గత అయిదేళ్లలో మన దేశంలో మహిళల యాజమాన్యంలోని వ్యాపారాలు 20 శాతానికి పైగా పెరిగాయి. రాబోయే అయిదేళ్లలో 90 శాతం వరకు పెరుగుతాయని అంచనా. ఎన్నో నగరాల్లో మహిళా వ్యాపారుల ప్రతిభాసామర్థ్యాలను ప్రత్యక్షంగా చూశాను. ఇలాంటి వారికి 2024 బడ్జెట్ ఫండింగ్, మౌలిక సదుపాయాల విషయంలో వెన్నుదన్నుగా నిలవాలి. మహిళా పారిశ్రామికవేత్తల కోసం నిధుల కేటాయింపులో గణనీయమైన పెరుగుదల ఉండాలి.
–స్వాతి భార్గవ, కో–ఫౌండర్, క్యాష్ కరో
మహిళా శ్రేయస్సు
మహిళల హెల్త్‌కేర్ బ్రాండ్ వ్యవస్థాపకురాలిగా మహిళల శ్రేయస్సుకు 2024 బడ్జెట్ దోహదకారి కావాలని కోరుకుంటున్నాను. స్కిల్ డెవలప్‌మెంట్, హెల్త్‌కేర్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లలో మహిళలు రాణించేందుకు, వారికి సాధికారత కల్పించేందుకు బడ్జెట్ ఉపయోగపడాలని ఆశిస్తున్నాను.
– రచనా గుప్తా, కో–ఫౌండర్, జినోవేద
గేమ్ చేంజర్‌గా...
మహిళలు నిర్వహించే వ్యాపారాలను ముందుకు నడిపించే గేమ్‌చేంజర్‌గా ఈ బడ్జెట్ ఉండాలని ఆశిస్తున్నాను. రుణ ప్రక్రియను సరళతరం చేయాలి. మహిళల నేతృత్వంలోని వ్యాపారాల్లో వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులను ప్రోత్సహించాలి. నిధుల అంతరాన్ని పూడ్చాలి. గ్రాంట్లు, సబ్సిడీలు, పన్ను మినహాయింపుల రూపంలో ఆర్థిక ప్రోత్సాహకాల కోసం ఎదురు చూస్తున్నాం. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల వ్యాపార చతురత, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించే శిక్షణా కార్యక్రమాల కోసం బడ్జెట్‌లో కేటాయింపులు అవసరం. మహిళలకు సంక్షేమ పథకాలు అందే విషయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చేయాలి. మాటలు కాదు కార్యాచరణ కనిపించాలి. ‘ఇది కొత్త బడ్జెట్’ అనిపించాలి.
– సోమ్‌దత్తా సింగ్, ఇ–కామర్స్ ఎంటర్ ప్రెన్యూర్, ఏంజెల్ ఇన్వెస్టర్, రైటర్
మరిన్ని పొదుపు పథకాలు
గ్రామీణ సమాజంలోని మహిళల కోసం మరిన్ని పొదుపు పథకాలను రూపొందిస్తారని ఆశిస్తున్నాను. వడ్డీ లేని రుణాలను ప్రవేశ పెట్టాలి. మహిళల నేతృత్వంలోని సంస్థల అభివృద్ధికి తోడ్పడేలా బడ్జెట్ ఉండాలి. మహిళలకు సంబంధించి ఎంటర్ ప్రెన్యూర్‌షిప్‌కు ప్రోత్సాహం అందేలా, స్కిల్ బిల్డింగ్‌కు ప్రయోజనం చేకూర్చే పథకాలను ప్రవేశపెట్టాలని ఆశిస్తున్నాను. స్కిల్ గ్యాప్స్ లేకుండా ఉండడానికి మహిళల కోసం ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు రూపొందించాలి. కృత్రిమ మేధ ఆధారిత రంగాలలో మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సాంకేతిక శిక్షణా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
– ఉపాసన టకు, కో ఫౌండర్–మొబిక్విక్
ప్రపంచ ఆర్థికశక్తిగా ఎదిగేలా...
పన్నెండవ తరగతి తరువాత యువతులకు నైపుణ్యశిక్షణా కార్యక్రమాలు చేపట్టాలి. ‘మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తాం’ అని ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. వ్యవసాయరంగంలో ఉన్న మహిళలపై దృష్టి సారించాలి. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న మన దేశ లక్ష్యం నెరవేరేలా వివిధ రంగాల మహిళలకు బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలి.
– జ్యోతీ బండారీ, లోవక్ క్యాపిటల్ ఫౌండర్, సీయివో
బాలికల విద్యకు ప్రాధాన్యత
రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అలవెన్స్ పెంచాలి. ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలి. బాలికల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. బాలికలకు సంబంధించి ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్‌ను పెంచాలి.
– రాధిక దాల్మియ, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్
(కోల్కతా చాప్టర్)– చైర్‌పర్సన్
మహిళా రైతుల కోసం...
బడ్జెట్‌లో మహిళా రైతులు, కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యవసాయ రంగంలో మహిళల భాగస్వామ్యానికి గుర్తింపు ఇచ్చే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. రాయితీల ద్వారా మహిళా రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా ప్రోత్సాహకాలు అందించాలి.
– ధనశ్రీ మంధానీ, సలాం కిసాన్–ఫౌండర్
ఫ్యూచర్ రెడీ స్కిల్స్
‘ఫ్యూచర్ రెడీ’ స్కిల్స్ కోసం మహిళలను సన్నద్ధం చేసే కార్యాచరణను రూపొందించాలి. మహిళల నైపుణ్య శిక్షణకు సంబంధించి పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు ఇవ్వాలి. స్కిల్ డెవలప్‌మెంట్ వల్ల కెరీర్ బ్రేక్ తీసుకున్న మహిళలు తిరిగి ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉంటుంది.
– నేహా బగారియా, ఫౌండర్– జాబ్స్ ఫర్ హర్
Comments
Please login to add a commentAdd a comment