సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర ఖజానా నిండుకుంది. ఉద్యోగులు తమ జీతంలో నుంచి ప్రతినెలా దాచుకునే ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)తో పాటు ఎవరైనా చనిపోతే దహన సంస్కారాల కోసం ఇచ్చే డబ్బులకూ చిక్కులు వచ్చిపడ్డాయి. ఈ నెల 6వ తేదీ నుంచి బిల్లుల మంజూరుకు ఆర్థిక శాఖ బ్రేకులు వేసింది. ఒక్కపైసా కూడా చెల్లించవద్దంటూ రాష్ట్రంలోని అన్ని ట్రెజరీలకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఫలితంగా నిధులు విడుదల కావడం లేదు. రాష్ట్ర ఖజానా ఖాళీ కావడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఉద్యోగుల పీఎఫ్‌తో పాటు వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ట్రెజరీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ట్రెజరీ నుంచి కూడా బిల్లులను బ్యాంకులకు పంపుతున్నారు.
బిల్లు మంజూరు కోసం ఖజానా నుంచి విత్‌డ్రా చేసేందుకు క్లిక్ చేస్తే.... ఓవర్ డ్రాఫ్టు (ఓడీ) అని చూపిస్తోంది. అంటే ఖజానాలో పైసా కూడా నిధులు లేవన్నమాట. ఒకవేళ బిల్లులు మంజూరు చేయాలంటే ఆర్థిక పరిమితికి మించి అప్పు తీసుకోవాల్సి రానుంది. ఇందుకు రిజర్వ్‌బ్యాంకు (ఆర్‌బీఐ) అనుమతించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఖజానాకు వివిధ మార్గాల్లో అంటే ఎక్సైజ్, పన్నులు, రవాణా రంగాల నుంచి ఆదాయం జమ అయితేనే బిల్లుల చెల్లింపు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక ఆంక్షల వల్ల కేవలం కర్నూలు జిల్లాలోనే రూ.100 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ మొత్తం రూ.2,500 కోట్ల మేరకు ఉంటుందని ట్రెజరీ వర్గాలు పేర్కొంటున్నాయి.
దహన సంస్కారాలకూ డబ్బుల్లేవ్
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బినిగెర ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా పనిచేసే కవిత ఈ ఏడాది అక్టోబరు 21వతేదీన మరణించారు. కుటుంబ సభ్యులు ఆమె దహన సంస్కార ఖర్చుల కోసం మరణ ధ్రువీకరణ పత్రాన్ని జత చేసి డిసెంబరు 5వ తేదీన అందచేసినా ఇప్పటివరకు మంజూరు కాలేదు. అదేమంటే ఆంక్షలు విధించారంటూ ట్రెజరీ అధికారులు పేర్కొంటున్నారు. ఇదే కాదు.. వివాహాలు, ఇతర అత్యవసరాల కోసం దరఖాస్తు చేసుకున్న పలువురు ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) డబ్బులు మంజూరు కాకపోవడంతో అవస్థలు ఎదుర్కొంటున్నారు.
నీరు–చెట్టుకు నేరుగా నిధులు
వాస్తవానికి అన్ని బిల్లులు ఆన్‌లైన్‌లోనే మంజూరు చేసేందుకు అనుగుణంగా సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానం (కాంప్రహెన్షివ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టం–సీఎఫ్‌ఎంఎస్)ను ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. బిల్లులను క్రమపద్ధతిలో ఎటువంటి విచక్షణ లేకుండా ఆన్‌లైన్‌లో మంజూరు చేసేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇందుకు విరుద్ధంగా నీరు–చెట్టు బిల్లులను సీఎఫ్‌ఎంఎస్ విధానంలో కాకుండా ప్రభుత్వం నేరుగా విడుదల చేసింది. ఇప్పుడు కూడా బడా కాంట్రాక్టర్లకు అలాగే బిల్లులు నేరుగా చెల్లిస్తున్నారని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment