స్తంభించిన ప్రభుత్వ చెల్లింపులు | government payments are stopped due to seemandhra strike | Sakshi
Sakshi News home page

స్తంభించిన ప్రభుత్వ చెల్లింపులు

Published Sat, Aug 17 2013 2:45 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM

government payments are stopped due to seemandhra strike


 సాక్షి, తిరుపతి: సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలో ఖజానా శాఖ ఉద్యోగులు సమ్మె చేస్తుండడంతో ప్రభుత్వ చెల్లింపులు, రాబడి ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. సమ్మె కారణంగా మూడు రోజుల్లో ప్రభుత్వ చెల్లింపులు రూ.141 కోట్ల వరకు పెండింగ్ పడ్డా యి. ప్రభుత్వ ఉద్యోగుల రుణాలు, పీ ఎఫ్ లోన్లు, మెడికల్ బిల్స్ వంటి ఫై ల్స్ పూర్తిగా పక్కకుపోయాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టర్లు చేసిన పనులకు సంబంధించిన బిల్స్ కూడా పెండింగ్‌లో పడ్డాయి. చిత్తూరు ప్రధాన ఖజానా కార్యాలయంతో సహా తిరుపతి, మదనపల్లె డివిజన్‌లో ఉప కార్యాలయాలు పనిచేస్తున్నాయి. వీటి పరిధిలో ప్రజలు ప్రభుత్వానికి ఫీజులు, పన్నులు(రాబడి), వివిధ హెడ్‌లు, సబ్ హెడ్ అకౌంట్ల కింద చెల్లిస్తుం టారు. ఏపీఎన్‌జీవో సమ్మెలో భాగంగా ఖజానా ఉద్యోగులు నిరవధిక అందోళనకు దిగారు. ఆగస్టు చివరివరకు సమ్మె ఇదే రీతిలో జరిగితే జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ చెల్లింపులు, రాబడి రూ.వెయ్యి కోట్లకు పైగా కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.
 
 సెప్టెంబర్ జీతాలు లేనట్లే
 అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో ఉండడంతో వీరికి సెప్టెంబర్ జీతాలు వచ్చే పరిస్థితి లేదు. ఆయా ప్రభుత్వ శాఖల నుంచి బిల్స్ రాసి, ఖజానా శాఖ ఆమోదం పొంది, అక్క డి నుంచి బ్యాంక్‌లకు వెళితే గానీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అకౌం ట్లలో పడవు. సాధారణంగా 15వ తేదీ నుంచే బిల్స్ రాసే ప్రక్రియ మొదలవుతుంది. సమ్మె కారణంగా నో వర్క్, నో పే పరిస్థితి ఉండడంతో ఖజానా శాఖ కూడా జీతాలు చెల్లిం చేందుకు వీలు కాదు. రెవెన్యూ, ఖజానా, వాణిజ్య, రిజిస్ట్రేషన్స్, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్, ఆర్‌అండ్ బీ, ఉపాధి కల్పన, మున్సిపల్, పబ్లిక్ హెల్త్, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు, డీఆర్‌డీఏ, ఆర్‌టీవో, ఐకేపీ వంటి ప్రధాన శాఖల జీతాలు, బిల్లుల చెల్లింపుల ప్రక్రియ పూర్తిగా స్తంభిం చాయి. ఆయా శాఖల రోజువారీ అవసరాలకు కంటెన్‌జెన్సీ నిధులు కూడా లేక అధికారులు ఇబ్బంది పడుతున్నారు.
 
 ప్రోటోకాల్ ఖర్చులకూ ఇబ్బందులే
 తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చే ప్రభుత్వ పెద్దలు, అమాత్యులు, ప్రో టోకాల్ మర్యాదలు చేసేందుకు తిరుపతి ఆర్‌డీవో కార్యాలయం నిరంతరం కంటెన్‌జెన్సీ నిధులు ఖజానా ద్వారా తెప్పించుకోవాల్సి ఉంటుంది. సమ్మె కారణంగా ప్రోటోకాల్ విధులకు అం తరాయం ఏర్పడనుంది. ఈ వ్యవహారాలకు సంబంధించిన బిల్స్ రాసేవారు లేక, ప్రోటోకాల్ ఖర్చులకు నిధులు రాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
 
 బ్యాంకులోనూ ఇక్కట్లు
 రిజిస్ట్రేషన్లు, సర్వే ఫీజులు, వివిధ సర్టిఫికెట్లు పొందేందుకు ప్రజలు చలానాల రూపంలో ప్రభుత్వానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా లక్షల్లో చెల్లిస్తుంటారు. పంచాయతీ కొళాయి లు, ఇతర మౌలిక సదుపాయల కల్పన ఫీజులు కూడా ఖజానాకు బ్యాంక్ చలానా ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. చలానా చెల్లించిన తర్వాత దానికి సంబంధించిన కౌంటర్ ఫైల్‌పై ట్రెజరీ నంబరు, సంబంధిత సిబ్బంది సంతకం, సీల్ వేసేందుకు ఒక ప్రత్యేక కౌంటర్ ఉంటుంది. సమ్మె వల్ల సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ప్రజలు చెల్లింపులను వాయిదా వేసుకోవాల్సి వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement