రాష్ట్రంలోని ప్రతి పల్లెలోనూ ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలంగాణ శాఖ ముందుకు వచ్చింది. తన సామాజిక బాధ్యతగా ప్రతి మారుమూల పల్లెకూ ఆరోగ్యభద్రత విషయంలో సంపూర్ణ సహకారం అందించాలన్న లక్ష్యంతో ‘ఆవో గావ్ చలే’ పేరిట వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఈ మేరకు హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాలనూ దత్తత తీసుకుంటారు.
ముఖ్యంగా జిల్లా కేంద్రాలకు దూరంగా పల్లెల్లో వరుసగా ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించి మందులు అందజేస్తారు. తీవ్రమైన, దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా బయటపడితే.. వాటిని నగరంలోని ఉస్మానియా, గాందీ, నిమ్స్ లేదా స్తోమతను బట్టి ఇతర ఆసుపత్రులకు సిఫారసు చేయడంతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచితంగా ఆపరేషన్లు చేసే వీలు కూడా ఐఎంఏ కల్పిస్తామంటోంది. ఇందుకోసం అయ్యే ఖర్చును భరిస్తామని చెబుతోంది.
– సాక్షి ప్రతినిధి, కరీంనగర్
ప్రతి ఊరికీ నలుగురు వైద్యుల బృందం
ఐఎంఏ ఇటీవల ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెంలోని చర్లలో ఇప్పటికే వైద్య సేవలు ప్రారంభించింది. ఐఎంఏలో మొత్తం 20వేలమందికి పైగా వైద్యులు అందుబాటులో ఉన్నారని, వీరంతా ప్రతిరెండు నెలలకోసారి పల్లెల్లో నిర్వహించే ఉచిత వైద్యశిబిరాలలో సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నారని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బీఎన్ రావు వెల్లడించారు.
ప్రతి పల్లెకూ నలుగురు వైద్యుల బృందం వెళ్తుంది. అందులో ఫిజీషియన్, గైనిక్, ఆర్థో, ఆప్తమాలజీ వైద్య నిపుణులు ఉంటారు. వీరు తమకు కేటాయించిన ఊరిలో సమగ్ర హెల్త్ సర్వే రూపొందిస్తారు. గ్రామస్తులకు హెల్త్ చెకప్, వైద్యపరీక్షలు, మందుల పంపిణీ నిర్వహిస్తారు. అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు రాకుండా అవగాహన కల్పిస్తారు.
ఐఎంఏ లక్ష్యాలివే..
మెడికల్ షాపుల్లో వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా ఇష్టానుసారంగా మందులు విక్రయిస్తున్నారని ఇలాంటి కౌంటర్ సేల్స్‌ను నిరోధించాలని ఐఎంఏ చాలాకాలంగా పోరాడుతోంది. దీనివల్ల ప్రజలు అనేక దీర్ఘకాలిక వ్యాధులు కొని తెచ్చుకుంటున్నారని వాపోతోంది.
ప్రైవేటు ఆసుపత్రుల్లో దళారీ వ్యవస్థ (యాంటీ క్వాకరీ) పెరిగిపోతోంది. కొందరు దళారులు అవసరం ఉన్నా.. లేకుండా తమ కమీషన్ల కోసం పేషెంట్లను కొన్ని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి ఆపరేషన్లు చేయిస్తున్నారు. దీనివల్ల వారి శరీరాలపై అనేక దు్రష్పభావాలు కలుగుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేస్తామంటోంది.
సరైన వైద్య అర్హతలు లేకుండా కొందరు వైద్యం ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాంటి వారి వల్ల ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతోంది. ఇలాంటి అక్రమ ప్రాక్టీసులను అరికట్టాలని డిమాండ్ చేస్తోంది.
రాష్ట్రంలో వైద్యకాలేజీల పెంపును ఆహ్వనించిన ఐఎంఏ చాలామంది పేద వైద్య విద్యార్థులకు ఆర్థిక సాయం చేసేందుకు స్కాలర్‌షిప్పులు ప్రకటిస్తోంది ఐఎంఏకు దరఖాస్తు చేసుకున్న పేద వైద్య విద్యార్థులకు ఏటా రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది.
పల్లెల కోసం ‘ఆవో గావ్ చలే’ కార్యక్రమం చేపడుతున్న మాదిరిగానే.. పట్టణాల్లోని మురికివాడల్లోనూ ఇదే విధమైన సేవలు అందించాలని నిర్ణయించింది.
పేదలపై భారం తప్పించేందుకే
ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యఖర్చులు పెరిగిపోతున్నాయి. ప్రైవేటు డాక్టరుకు చూపించుకునే స్తోమతలేని వేలాదిమంది పల్లె వాసులు రోగాలను మౌనంగా భరిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఉన్న అలాంటి వారికి పూర్తి ఉచితంగా వైద్యసేవలు, పరీక్షలు, శస్త్రచికిత్సలు అందించడమే మా లక్ష్యం.
– డాక్టర్ బీఎన్.రావు, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment