ప్రభుత్వాలు ఎన్ని పథకాలు తీసుకొస్తున్నా పేద, మధ్య తరగతి వర్గాలకు వైద్య ఖర్చులు మోయలేని భారంగానే మారుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య చికిత్సలకు అయ్యే ఖర్చులో గణనీయమైన వ్యత్యాసాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. వివిధ ప్రాంతాల జీవన ప్రమాణాలకు అనుగుణంగా వైద్య చికిత్సలకు ప్రామాణిక రేటును నిర్థారించే క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ నిబంధనలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.
వెటరన్స్ ఫోరమ్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణ జరిపింది. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ రూల్స్, 2012లోని రూల్ 9 ప్రకారం రోగులకు ఆసుపత్రుల్లో ప్రతివైద్యానికి ప్రామాణిక ఫీజు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. ఈ వివరాలను అన్ని ఆసుపత్రుల్లో స్థానిక భాషలో ప్రచురించి రోగులకు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి ప్రతి వైద్యానికి అయ్యే ఖర్చు వివరాలను ఆసుపత్రుల్లో ఉంచాలని తెలిపింది.
అయితే, ఈ విషయంపై తమ సహకారం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాలతో అనేకసార్లు చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అందరికీ అందుబాటు ధరలో వైద్యం అందించడం అనేది పౌరుల ప్రాథమిక హక్కు అని కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించరాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
ఇదీ చదవండి: 900 మంది ఉద్యోగులను తొలగించిన ప్రముఖ సంస్థ
నెలలోపు స్టాండర్డ్ రేట్లను నోటిఫై చేసేలా అన్ని రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శిని కోరింది. లేదంటే పిటిషనర్ కోరికమేరకు సెంట్రల్ గవర్న్‌మెంట్ హెల్త్ స్కీమ్ సూచించిన ప్రామాణిక రేట్లను అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment