న్యూఢిల్లీ: రిటైర్డు ఉద్యోగులను వేధించవద్దనీ, వారి వైద్య బిల్లులను వెంటనే చెల్లించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్‌ఎస్) కింద మెడికల్ చెల్లింపులను నెలలోగా పూర్తి చేసేలా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖను ఆదేశించింది. సీజీహెచ్‌ఎస్ జాబితాలో ఉన్న ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోలేదన్న కారణంతో అధికారులు తన వైద్య బిల్లులను ఆపేశారని ఓ రిటైర్డు ఉద్యోగి కోర్టును ఆశ్రయించడంతో ఈ ఆదేశాలిచ్చింది. కార్యదర్శి స్థాయి అధికారి నేతృత్వంలో వారంలోగా ప్రత్యేక కమిటీని నియమించాలని, ప్రతినెలా ఈ కమిటీ సమావేశమై బిల్లుల చెల్లింపు ప్రక్రియను సమీక్షించాలని తెలిపింది. అర్జీదారు విషయంలో సీజీహెచ్‌ఎస్ అధికారులు అమానవీయంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఏ ఆస్పత్రిలో చికిత్స పొందారన్నది కాకుండా ఎలాంటి పరిస్థితుల్లో ఆ చికిత్స పొందారనే అంశాన్నే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందంది.
Comments
Please login to add a commentAdd a comment