ఆ నిధులకు లెక్కేదీ..? | need all treasury calculations | Sakshi
Sakshi News home page

ఆ నిధులకు లెక్కేదీ..?

Published Mon, Aug 5 2013 1:13 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM

need all  treasury calculations

ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: వివిధ ప్రభుత్వ శాఖలకు విడుదలైన నిధుల వినియోగానికి సంబంధించి లెక్కలు తేలడం లేదా? ఆయా శాఖలకు విడుదలైన నిధులకు, వ్యయం చేసిన మొత్తాలకు పొంతన కుదరడం లేదా? మూడేళ్లలో ప్రభుత్వ శాఖలకు విడుదలైన సుమారు లక్ష కోట్ల రూపాయల వినియోగానికి సంబంధించి పూర్తిస్థాయిలో వినియోగ ధ్రువీకరణ పత్రాలు లేవా... అనే అనుమానాలకు అవుననే సమాధానం వస్తోంది. ఈ నేపథ్యంలో గత మూడేళ్లలో ప్రభుత్వ శాఖలకు విడుదలైన నిధులు, వాటి వినియోగంపై తాజాగా సమగ్ర ఆడిట్‌కు సర్కారు ఆదేశించింది. ఆయా శాఖలకు ప్రభుత్వం నుంచి విడుదలవుతున్న నిధులు, ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులను పరిశీలిస్తే భారీ మొత్తంలో తేడా కనిపిస్తోంది. ప్రభుత్వ నిధులను ఖజానాలో భద్రపరిచే పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్(పీడీ అకౌంట్స్)పై కూడా గందరగోళం నెలకొంది. ఈ విషయం కాగ్ 2011-12 నివేదికలో వెలుగుచూసింది. పీడీ అకౌంట్స్ నిర్వహణ, నిధుల వినియోగం విషయంలో నెలకొన్న డొల్లతనాన్ని కాగ్ ఆ నివేదికలో కడిగిపారేసింది. కాగ్ నివేదికను పరిశీలించిన ప్రజాపద్దుల సంఘం (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ- పీఏసీ) మండిపడింది. కాగ్ నివేదికలోని అంశాలపై నిగ్గుతేల్చమని సంబంధిత ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించింది. దీంతో మూడు సంవత్సరాలు అంటే 2010-11, 2011-12, 2012-13 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ప్రభుత్వ శాఖలకు మంజూరైన బడ్జెట్ (నిధులు), వాటి వినియోగంపై సమగ్ర ఆడిట్ నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. దీనిపై ఆర్థిక శాఖ కార్యదర్శి వి.భాస్కర్, రాష్ట్ర ఖజానా శాఖ డెరైక్టర్ కె.కనకవల్లి వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక సంస్థలకు విడుదలైన నిధులను స్టేట్ ఆడిట్ విభాగం ఇతర ప్రభుత్వ శాఖలకు విడుదలైన నిధులు, వినియోగం విషయాలను ఖజానా శాఖ, ఆర్థికశాఖ, అంతర్గత ఆడిట్ విభాగాలు సమగ్రంగా ఆడిట్ చేయనున్నాయి.
 
 అంత్య, ఆరంభ నిల్వల్లో తేడాలు
 వివిధ ప్రభుత్వ శాఖల అంత్య, ఆరంభ నిల్వల్లో భారీ తేడాలున్నాయి. 2010-11 ఆర్థిక సంవత్సరానికి ఉన్న అంత్య నిల్వ (క్లోజింగ్ బ్యాలెన్స్) 2011-12కు ప్రారంభ నిల్వ అవుతుంది. అయితే వివిధ ప్రభుత్వ విభాగాల్లో 2010-11 అంత్య నిల్వకు 2011-12 ప్రారంభ నిల్వకు తేడాలున్నట్లు కాగ్ పరిశీలనలో వెల్లడయింది. దీంతో అవాక్కయిన కాగ్ అధికారులు అదే విషయాన్ని తమ నివేదికలో పేర్కొన్నారు. అలాగే వివిధ ప్రభుత్వ విభాగాలు నిర్వహిస్తున్న పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్‌లో కూడా భారీ తేడాలున్నాయి. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న మొత్తాలకు, ఖజానా కార్యాలయాలు ఆన్‌లైన్ ద్వారా చేసిన చెల్లింపులకు సంబంధించిన మొత్తాల్లో కూడా భారీ తేడాలున్నాయి. ఈ వివరాలన్నింటిపై కాగ్ అధికారులు తమ అభిప్రాయాలను 2011-12 నివేదికలో కుండబద్దలు కొట్టారు. ఈ అభిప్రాయాలతో ఏకీభవించిన పీఏసీ... కాగ్ అభిప్రాయాలన్నింటినీ కూలంకషంగా పరిశీలించి నివేదికను సమర్పించనుంది. 2010 ఏప్రిల్ 1 నుంచి 2013 మార్చి 31 వరకు పీడీ అకౌంట్స్‌లో జరిగిన లావాదేవీలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించనున్నారు.
 
 ఆడిట్‌కు మార్గదర్శకాలివీ...
 ప్రభుత్వ నిధుల వినియోగానికి సంబంధించి ఆర్థిక శాఖ అంతర్గత ఆడిట్ విభాగం, స్థానిక సంస్థల నిధుల విడుదల, వినియోగాన్ని పరిశీలించే స్టేట్ ఆడిట్ విభాగం, ప్రభుత్వ శాఖలకు నిధుల విడుదల వినియోగాన్ని పరిశీలించే ఖజానా శాఖ అధికారులను ఆడిట్‌కు నియమించారు. ఆడిట్ నిర్వహణకు ప్రభుత్వమే మార్గదర్శకాలు నిర్దేశించింది. మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఆడిట్‌లో తేలిన విషయాలను ఒకే నివేదికగా సమర్పించనున్నారు. ప్రభుత్వ శాఖల అధికారులు పీడీ అకౌంట్, ఎస్‌బీ అకౌంట్, పాస్ పుస్తకాలు, క్యాష్ పుస్తకాలు, చెక్కుల పుస్తకం కౌంటర్ ఫాయిల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఈ ఖాతాల్లోని నిధులను ప్రభుత్వం నిర్దేశించిన పనులకే వినియోగించారా, ఇతర పనులకు వినియోగించారా అన్న విషయాన్ని పరిశీలించనున్నారు.
 
 నాలుగు కమిటీల ఏర్పాటు
 ప్రకాశం జిల్లాలో గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో వివిధ ప్రభుత్వ శాఖలకు నిధుల మంజూరు, వినియోగం గురించి సమగ్ర సమాచారం సేకరించేందుకు జిల్లా ఖాజానా ఉప సంచాలకుడు ఎన్.నాగేశ్వరరావు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సివిల్, క్రిమినల్ కోర్టుల్లో డిపాజిట్లు, నిధుల మంజూరు, వినియోగాలకు సంబంధించిన వివరాలను ఒంగోలు ఎస్టీవో పి.శ్రీనివాసులు, సీనియర్ అకౌంటెంట్లు ఎం.సీతయ్య, ఈవి అనిల్‌కుమార్‌ల బృందం పరిశీలిస్తుంది.
 
 ముఖ్య ప్రణాళికాధికారి (సీపీవో), సంబంధిత పీడీ అకౌంట్స్‌నుఎస్టీవో ఎ.రాజేశ్వరి, సీనియర్ అకౌంటెంట్లు ఏ.పద్మావతి, పి.వరకుమార్‌ల బృందం పరిశీలిస్తుంది.
  జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఇతర పీడీ అకౌంట్లను సబ్ ట్రెజరీ అధికారులు ఏవీఎస్‌ఎస్ ప్రసాద్, పి.వెంకట్రావు, బి.అక్కేశ్వరరావుల బృందం పరిశీలిస్తుంది.
  విద్యా సంస్థల్లోని డిపాజిట్లు, ఇతర నిధుల వివ రాలను కందుకూరు ఎస్టీఓ షేక్ అహ్మద్, సీనియర్ అకౌంటెంట్లు ఏవీ ప్రసాదరావు, ఎ.ఆంజనేయులు బృందం పరిశీలిస్తుంది.
  కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (ిసీపీఎస్)కు సంబంధించిన పీడీ అకౌంట్ల వివరాలను సహాయ ఖాజానా అధికారి వి.రమణయ్య పరిశీలించి నివేదించాలి.
 ఈ ప్రత్యేక బృందాలన్నీ తమకు కేటాయించిన ప్రభుత్వ శాఖల గత మూడేళ్ల లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించి ఆగస్టు 20 వ తేదీకి నివేదిక సమర్పించాలని కోరినట్లు ఖజానాశాఖ ఉప సంచాలకుడు ఎన్.నాగేశ్వరరావు తెలిపారు. జిల్లాలో న్యాయశాఖకు సంబంధించిన పీడీ అకౌంట్ల పరిశీలన విషయంలో ఆడిట్ బృందానికి సహకరించాలని కోరుతూ జిల్లా జడ్జిని వ్యక్తిగతంగా కలిసి విజ్ఞప్తి చేసినట్లు ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement