8 ట్రంకు పెట్టెల్లో బంగారం, వెండి, నగదు | Treasury employee Corruption In trunk boxes | Sakshi
Sakshi News home page

ట్రంకు పెట్టెల్లో అవినీతి ‘ఖజానా’

Published Wed, Aug 19 2020 4:01 AM | Last Updated on Wed, Aug 19 2020 10:08 AM

Treasury employee Corruption In trunk boxes - Sakshi

అనంతపురం క్రైం/అనంతపురం అర్బన్‌: అనంతపురం జిల్లాలో ఊహకందని విధంగా ట్రెజరీ ఉద్యోగి కారు డ్రైవర్‌ బంధువు ఇంట్లో భారీ ఎత్తున అవినీతి ‘ఖజానా’ బయటపడింది. అచ్చం సినిమాను తలపించే విధంగా మారుమూల ప్రాంతంలోని ఓ చిన్న ఇంట్లో 8 ట్రంకు పెట్టెల్లో దాచిపెట్టిన కిలోలకొద్దీ బంగారం, వెండి, పెద్దఎత్తున నగదును పోలీసులు స్వాధీనం చేసుకోవడం సంచలనమైంది. ఇదంతా అనంతపురం జిల్లా ఖజానా కార్యాలయంలో పనిచేసే ఓ సీనియర్‌ అకౌంటెంట్‌కు చెందిన అవినీతి సంపాదన అని తెలిసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇందులోనే ఓ ఎయిర్‌ పిస్టోల్‌ కూడా లభ్యమైంది. పోలీసుల నుంచి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

► అనంతపురం జిల్లా ఖజానా కార్యాలయంలో మనోజ్‌కుమార్‌ అనే వ్యక్తి సీనియర్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. అతడు బుక్కరాయసముద్రం ఎస్సీ కాలనీకి చెందిన నాగలింగను కారు డ్రైవర్‌గా పెట్టుకున్నాడు.
► ఇటీవల సీసీఎస్‌ పోలీసులకు మనోజ్‌కుమార్, నాగలింగపై ఫిర్యాదు వెళ్లడంతో కొన్ని రోజులుగా వారిద్దరి కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
► ఈ క్రమంలో మంగళవారం సీసీఎస్‌ డీఎస్పీ ఇ.శ్రీనివాసులు, అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు నేతృత్వంలోని బృందాలు డ్రైవర్‌ నాగలింగను అరెస్ట్‌ చేశారు.
► నాగలింగ ఇచ్చిన సమాచారం ఆధారంగా సాయంత్రం అతడి మామ బాలప్ప ఇంటిని పోలీసులు తనిఖీ చేయగా.. 8 ట్రంకు పెట్టెలు లభ్యమయ్యాయి. 
► వాటిని తెరచి చూడగా కిలోల కొద్దీ బంగారం, వెండి, భారీ మొత్తంలో నగదు వెలుగు చూశాయి. తహశీల్దార్‌ మహబూబ్‌ బాషా సమక్షంలో పంచనామా నిర్వహించారు.
► రెండు పెట్టెల్లోని సొత్తును లెక్కించేసరికి అర్ధరాత్రి దాటిపోయింది. మొత్తం సొత్తును లెక్కించే ప్రక్రియ కొనసాగుతోంది. 
► మరోవైపు ఖజానా కార్యాలయం సీనియర్‌ అకౌంటెంట్‌ మనోజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం. ఈ కేసుపై మరో రెండు రోజుల్లో పూర్తి స్పష్టత రానుంది.

‘కారుణ్య’ నియామకం పొంది..
► జిల్లా ట్రెజరీ సీనియర్‌ అకౌంటెంట్‌ మనోజ్‌కుమార్‌ అవినీతి అనకొండగా ముద్ర వేసుకున్నాడు. అడ్డూఅదుపు లేకుండా అక్రమార్జనకు పాల్పడి రూ.కోట్లకు పడగలెత్తాడు. 
► తండ్రి పోలీసు హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ మరణించగా, కారుణ్య నియామకం కింద మనోజ్‌ కుమార్‌కు 2006 నవంబర్‌ 17న ట్రెజరీ శాఖలో జూనియర్‌ అకౌంటెంట్‌గా ఉద్యోగం వచ్చింది. 
► రెండు మూడేళ్లకే అతడు కార్యాలయంలోనే అత్యంత అవినీతిపరునిగా పేరొందాడు.

బదిలీ చేసినా తిరిగి ఇక్కడికే..
► ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు 14 ఏళ్లుగా ఇతను జిల్లా ట్రెజరీ కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తున్నాడు. 
► గతంలో ఒకసారి ఇక్కడి నుంచి బదిలీ కాగా.. రాత్రికి రాత్రి రద్దు చేయించుకుని తిరిగి అదే స్థానానికి వచ్చాడు. 
► గత ఏడాది జూలైలో ధర్మవరం సబ్‌ ట్రెజరీకి బదిలీ రాగా.. 6 నెలలు పాటు సెలవులో వెళ్లి, తిరిగి జిల్లా ట్రెజరీ కార్యాలయానికి బదిలీ చేయించుకోవడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement