* గెజిట్‌లో అపాయింటెడ్ డే ప్రకటించని కేంద్రం
* ఎన్నికల అనంతరమే రాష్ట్ర విభజన, వేర్వేరు ప్రభుత్వాల ఏర్పాటు!
సాక్షి, హైదరాబాద్: వచ్చే సార్వత్రిక ఎన్నికలు రెండు వేర్వేరు రాష్ట్రాల్లో జరుగుతాయా? లేక ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతాయా? అనే ఉత్కంఠ దాదాపుగా తొలగిపోయినట్లే. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణను ఏర్పాటు చేసినట్టు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శనివారం రాజపత్రాన్ని (గెజిట్) జారీ చేసినప్పటికీ అందులో అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ‘అపాయింటెడ్ డే’ను ప్రస్తావించలేదు. విభజన చట్టంలోని చిక్కుముడులు, విభజన ప్రక్రియ పూర్తి చేయటం వంటి అంశాలను తేల్చిన తర్వాతే అపాయింటెడ్ డే ఖరారు చేయాలని కేంద్రం భావిస్తోంది.
ఈ పరిస్థితుల్లో లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలను ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది. రెండు మూడు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఈలోగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అపాయింటెడ్ డే ను ప్రకటించే అవకాశాలు ఏ మాత్రం లేవు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పటికీ ఫలితాల అనంతరం ప్రత్యేక తెలంగాణ, విభజన తర్వాత మిగిలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరుగా ప్రభుత్వాలు కొలువుదీరనున్నాయి. తెలంగాణ విభజనకు రాజపత్రం విడుదలైన నేపథ్యంలో తెలంగాణ మొత్తం ఒక విడత, ఆంధ్రప్రదేశ్‌లో మరో విడత పోలింగ్ జరిగే విధంగా షెడ్యూలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాలు చెప్తున్నాయి. 2009 ఆంధ్రప్రదేశ్ మొత్తంగా రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
కీలకం కానున్న టీఆర్‌ఎస్ విలీనం
ఇదిలావుంటే.. సార్వత్రిక ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలోనా? లేక వేర్వేరుగానా? అనేది టీఆర్‌ఎస్ విలీనంపై ఆధారపడి ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర విభజనకు సంబంధించి వెంటనే అపాయింటెడ్ డేను ప్రకటించడంతోపాటు తెలంగాణ, సీమాంధ్రలో వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాలని టీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది. వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుకోగలుగుతామని టీఆర్‌ఎస్ భావిస్తోంది.
కాంగ్రెస్ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తే వేర్వేరుగా ఎన్నికలు జరపాలని భావిస్తోంది. విలీనంపై కేసీఆర్ తీసుకునే నిర్ణయాన్ని బట్టే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్‌లో విలీనం చేయాలా? వద్దా? అనే అంశంపై సోమవారం టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంద న్న అంశంపై కాంగ్రెస్ నేతలు ఎదురుచూస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు!
Published Mon, Mar 3 2014 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 AM
Advertisement
Advertisement