TRS merge
-
'దగా, మోసం, వంచనకు మారు పేరు టీఆర్ఎస్'
-
మాట తప్పిన కెసిఆర్: పొన్నాల
-
'విలీనం లేదు...పొత్తూ లేదు'
-
'ఏ రాష్ట్ర విభజన అయినా బాధాకరమే'
-
ఏ రాష్ట్ర విభజన అయినా బాధాకరమే: దిగ్విజయ్
హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత రెండు ప్రాంతాలకు లబ్ది చేకూర్చేందుకు తమ పార్టీ కృషి చేసిందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. విభజన నిర్ణయం సులువైంది కాదన్నారు. ఏ రాష్ట్ర విభజన అయినా బాధాకరమన్నారు. అయితే ఎవరికీ బాధ కలగకుండా ఆంధ్రప్రదేశ్ విభజన చేశామని చెప్పారు. మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. అన్ని పార్టీలు చెప్పాకే తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీలిచ్చామని తెలిపారు. సీమాంధ్రకు ఐదేళ్ల పాటు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించామన్నారు. దీంతో సీమాంధ్ర పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ పునర్మిర్మాణం, సీమాంధ్ర అభివృద్ధి జరగాలన్నారు. విభజనపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడతానని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి మాట తప్పారని విమర్శించారు. కాంగ్రెస్ ను వదిలి కిరణ్ కొత్త పార్టీ పెట్టడం బాధ కలిగించిందని చెప్పారు. తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని కేసీఆర్ చెప్పారని దిగ్విజయ్ వెల్లడించారు. టీఆర్ఎస్ నుంచి స్పష్టమైన ప్రతిపాదనలు వస్తే పొత్తులపై ఆలోచిస్తామన్నారు. -
'తెలంగాణ ఇస్తే సోనియా ఇంట్లో పనిచేస్తానన్నారు'
కరీంనగర్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ఎజెండా తెలంగాణ అని, రాష్ట్రం వచ్చాక పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. సోనియాగాంధీ నాయకత్వంలో కేసీఆర్ పనిచేస్తే.. కేసీఆర్ నాయకత్వంలో తామంతా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తెలంగాణ ఇస్తే సోనియాగాంధీ ఇంట్లో పనిచేస్తానని, కాళ్లకడిగి నీళ్లు నెత్తిన పోసుకుంటానన్న కేసీఆర్ ఆ మాటలు మర్చిపోవద్దన్నారు. టీఆర్ఎస్తో ఎన్నికల పొత్తు విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానవర్గం చూసుకుంటుందన్నారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తదితర ఎంపీలు కాంగ్రెస్ దయతోనే ప్రజాప్రతినిధులు అయిన విషయాన్ని మరిచిపోయి సోనియాగాంధీపై విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రజాస్వామ్యంలో పార్టీలు పెట్టే స్వేచ్ఛ ఉందని, కిరణ్, పవన్‌కల్యాణ్ పార్టీలు పెట్టుకునే విషయం వారి సొంతమని అన్నారు. ఆయారాం... గయారాంలు వస్తుంటారు.. పోతుంటారని, అలాంటి వారితో కాంగ్రెస్‌కు ఒరిగేదేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి రేసులో తాను లేనని, అవకాశం వస్తే వదులుకునేది లేదని స్పష్టం చేశారు. దళితులకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అండగా ఉందని, దళిత ముఖ్యమంత్రి విషయం కాంగ్రెస్ ఎజెండాలో లేదని, సోనియా ఆలోచిస్తే ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చని పేర్కొన్నారు. -
కేసీఆర్ కంటే ముందే మాట్లాడా: పాల్వాయి
న్యూఢిల్లీ: టీఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పారని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు మాట్లాడటంలేదని అన్నారు. కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి హామీ ఇవ్వనందునే విలీనంపై మౌనం వహించారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాల్సిందేనని అన్నారు. కేసీఆర్ కంటే ముందే తాను పోలవరంపై మాట్లాడానని గుర్తు చేశారు. దిగ్విజయ్ సింగ్‌తో పాల్వాయి భేటీ అయ్యారు. టీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు అంశం గురించి చర్చించారు. -
కాంగ్రెస్‌పై తెలంగాణ ప్రజలకు నమ్మకం లేదు: టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌పై తెలంగాణ ప్రజలకు నమ్మకం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహమూద్ అలీ అన్నారు. హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను విలీనం చేస్తామని 2009లో అన్నామని, ఆ తరువాత 1200 మంది యువకులు ఆత్మత్యాగాలకు పాల్పడ్డారని చెప్పారు. ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు తెలంగాణను ఇచ్చి టీఆర్ఎస్ను విలీనం చేయాలంటే ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు. పునర్నిర్మాణంలో టీఆర్ఎస్ లేకుంటే మరోసారి అదే అన్యాయం జరుగుతుందని మహమూద్ అలీ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల అభీష్టం మేరకే కేసీఆర్ వ్యవహరిస్తారని చెప్పారు. ఆటో రిక్షా డ్రైవరు నుంచి ఐఏఎస్ అధికారి దాకా అందరూ టీఆర్ఎస్ విలీనం చేయవద్దని కోరుతున్నారని చెప్పారు. తెలంగాణకు, ముస్లిం మైనారిటీలకు అన్యా యం చేసిన కాంగ్రెస్ నేత షబ్బీర్అలీకి టీఆర్ఎస్ను విమర్శించే నైతికఅర్హత లేదన్నారు. తెలంగాణ గురించి, వక్ఫ్ ఆస్తుల గురించి షబ్బీర్ ఏనాడూ నోరు మెదపకుండా తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌పై విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
పొత్తుపై టీఆర్ఎస్తో చర్చిస్తాం: దిగ్విజయ్
అందుకు టీకాంగ్రెస్ నేతలతో త్వరలో కమిటీ: దిగ్విజయ్ విలీనం చేయాలని మేం కోరలేదు.. ఒంటరిపోరుకైనా మేం సిద్ధం యూపీఏలో ఉంటామని కేసీఆర్ చెప్పడాన్ని స్వాగతిస్తున్నాం సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ను విలీనం చేయాలని తమ పార్టీ కోరలేదని.. తెలంగాణలో ఒంటరిపోరుకు తాము సిద్ధమేనని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ స్పష్టం చేశారు. అయితే పొత్తులపై టీఆర్ఎస్ కమిటీతో చర్చలు జరుపుతామని వెల్లడించారు. ఇందుకోసం కాంగ్రెస్ తెలంగాణ సీనియర్ నేతలతో ఒక కమిటీని ఏర్పాటుచేయనున్నామని తెలిపారు. అయితే, టీఆర్ఎస్ను విలీనం చేయకున్నా.. ఎన్నికల అనంతరం యూపీఏతో ఉంటామని కేసీఆర్ పేర్కొనడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, సోనియాగాంధీని ఎలిజిబెత్రాణితో పోల్చుతూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆ మాటేదో ఆయన సోనియాగాంధీని కలిసినప్పుడే చెప్పాల్సిందని వ్యాఖ్యానించారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో దిగ్విజయ్‌సింగ్ విలేకరులతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే... హా తెలంగాణ ప్రజల స్వప్నం నెరవేరబోతున్నందుకు నాకు ఆనందంగా ఉంది. యూపీఏ సర్కారుకు, సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్, రాహుల్‌గాంధీలకు.. తెలంగాణ ఏర్పాటుకు కృషి చేసిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు. హా తెలంగాణపై మేం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. సీమాంధ్రకు కూడా మేం ఇచ్చిన హామీలు, ప్రధాని చేసిన హా మీలు నెరవేరుస్తాం. వాటి కార్యాచరణ కూడా పూర్తి చేయాలి. హా ఎన్నికల షెడ్యూల్‌ను మేం స్వాగతిస్తున్నాం. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం. ఈ ఎన్నికలతో దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నా. హా తెలంగాణ ఏర్పాటయ్యాక కాంగ్రెస్‌లో విలీనమవుతామని టీఆర్ఎస్ ప్రకటించింది. కానీ కేసీఆర్ చేసిన ప్రకటన మేం చూశాం. విలీనం కాకుండా ఎన్నిక లకు ఒంటరిగా వెళ్లినా... యూపీఏ కూటమిలోనే ఉంటామని ఆయన చెప్పారు. దాన్ని మేం స్వాగతిస్తున్నాం. హా పొత్తుల కోసం కాంగ్రెస్ తెలంగాణ సీనియర్ నేతలతో ఒక కమిటీ వేయబోతున్నాం. ఆ కమిటీ టీఆర్ఎస్ కమిటీతో చర్చలు జరుపుతుంది. హా విలీనం ప్రకటన కేసీఆర్ నుంచే వచ్చింది. విలీనం ఉండదని చెప్పిందీ ఆయనే. అందువల్ల ఈ వ్యవహారం వారిదే. మేం విలీనాన్ని స్వాగతించేవాళ్లం. సోనియాగాంధీని కలిసినప్పుడు కూడా విలీనం చేస్తానని కేసీఆర్ వాగ్దానం చేశారు. అందువల్ల విలీనం చేస్తారని నమ్మాం. హా కానీ వాళ్లదొక రాజకీయ పార్టీ. వాళ్లు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. దానిపై కామెంట్ చేయను. కానీ పొత్తులకు సిద్ధంగా ఉన్నాం. హా కాగా.. విభజనకు వ్యతిరేకంగా కిరణ్ సుప్రీంకు వెళ్లడంపై ప్రశ్నించగా... ‘‘ఆయన తన వైఖరి చూపిస్తున్నారు.. (వెల్ హి ఈజ్ షోయింగ్ హిజ్ కన్సిస్టెన్సీ)’’ అని పేర్కొన్నారు. హా అయితే అనంతరం దిగ్విజయ్ కొన్ని టీవీ చానెళ్లతో మాట్లాడుతూ కాంగ్రెస్‌కు తెలంగాణలో భయమేమీ లేదని, ఒంటరి పోరుకైనా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. హా కేసీఆర్ సోనియాగాంధీని ఎలిజిబెత్ రాణిగా పోల్చడాన్ని ప్రస్తావించగా... ‘అలాంటప్పుడు సోనియాగాంధీని కలిసినప్పుడే ఆ మాట చెప్పాల్సింది’ అని పేర్కొన్నారు. -
టీఆర్ఎస్తో పొత్తు లేకపోవడమే మంచిది: రేణుకాచౌదరి
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ విలీనం, పొత్తు ఉండవని తేలిపోయిందని.. ఇక ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో దిగ్విజయ్‌తో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘అంతా మన మంచికే. టీఆర్ఎస్ వాళ్లు మాతో వచ్చినా రాకపోయినా ఇబ్బందేమీ లేదు. మేం ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారని అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా గెలుస్తుంది’’ అని అన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించడంతో పాటు కేసీఆర్‌కి దీటైన సమాధానం చెప్పే నాయకుడినే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని రేణుక అభిప్రాయపడ్డారు. ఈ సారి తాను ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగుతానని పేర్కొన్నారు. -
వీలైతే పొత్తు.. లేకుంటే ఒంటరి పోరు
కాంగ్రెస్ అధిష్టానం యోచన కేసీఆర్ డిమాండ్లకు లొంగకూడదనే అభిప్రాయం.. సోనియాతో దిగ్విజయ్ భేటీ సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం ఉండదని కేసీఆర్ ప్రకటించినప్పటికీ కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి మాత్రం ఎలాంటి స్పందనా వ్యక్తం కాలేదు. పొత్తులపై ఆశ ఉన్నప్పటికీ కేసీఆర్ డిమాండ్లకు మాత్రం తలొగ్గేది లేదన్న రీతిలో వ్యవహరిస్తోంది. చివరకు ఒంటరిపోరుకైనా సిద్ధపడే వ్యూహంలో ఉంది. మున్సిపల్ ఎన్నికల లోపే పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలతో హైదరాబాద్, వరంగల్‌లలో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని భావిస్తోంది. టీఆర్ఎస్ విషయమై చర్చించేందుకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ మంగళవారం సాయంత్రం సోనియాతో భేటీ అయ్యారు. టీఆర్ఎస్ దూకుడును ఎలా చూడాలి? పొత్తుకు చేయి చాచాలా? తెలంగాణ సానుభూతి ఓటు చీలకుండా ఎలా వ్యూహరచన చే యూలి? తదితర అంశాలపై చర్చించారు. చివరకు.. విలీన ం చేయబోమని, కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా వారితో కలిసి ప్రభుత్వంలో భాగస్వాములమవుతామని కేసీఆర్ స్పష్టంగా ప్రకటించినప్పటికీ రెచ్చగొట్టే రీతిలో ప్రవర్తించరాదని, జాతీయ పార్టీగా హుందాతనంతో వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. వీలైతే పొత్తులు కుదుర్చుకోవాలని, కాని పక్షంలో తెలంగాణ ఓటు చీలకుండా సీట్లపై అవగాహనకు రావాలని అనుకున్నారు. అదీ కుదరని పక్షంలో ఒంటరిపోరుకైనా సిద్ధంగా ఉండాలని నిర్ణరుుంచారు. సోనియాతో భేటీ అనంతరం బయటకు వచ్చిన దిగ్విజయ్.. బుధవారం మధ్యాహ్నం 12 గంటల తరువాత టీఆర్ఎస్తో పొత్తు అంశంపై మాట్లాడతానని చెప్పారు. ‘కేసీఆర్‌కు ఇది మొదటినుంచీ అలవాటే. కాస్త బెదిరించినట్టు మాట్లాడితే ఎదుటిపక్షం లొంగుతుందనేది ఆయన భావన. కానీ కాంగ్రెస్ ఆయన ప్రకటనను అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు..’ అని ఏఐసీసీ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ‘విలీన ప్రక్రియ ఉండకపోవచ్చు గానీ.. పొత్తులు ఉండవని ఇప్పుడే నిర్ధారణకు రాలేం. పొత్తు లేనిపక్షంలో తెలంగాణ సానుభూతి ఓటు చీలిపోతుంది. అది రెండు పార్టీలకు నష్టం కలిగించే అంశమే’ అని అన్నారు. రెండు పీసీసీల ప్రకటన..: ఒక పీసీసీ, రెండు ప్రాంతీయ కమిటీలు ఉంటాయని ప్రచారం సాగిన నేపథ్యంలో మంగళవారం ఈ విషయంలో స్పష్టత వచ్చింది. ఇరు ప్రాంతాలకు రెండు పీసీసీలు నియమిస్తేనే మెరుగైన రీతిలో పోరాడవచ్చని ఇరు ప్రాంతాల నేతలు ప్రకటించడం, విభజన తేదీ కూడా రావడంతో ఇక రెండురోజుల్లోపే రెండు పీసీసీల నియామకం పూర్తవుతుందని ఏఐసీసీకి చెందిన ఒక నేత ‘సాక్షి’కి తెలిపారు. -
సోనియా దయ్యమో దేవతో ప్రజలే నిర్ణయిస్తారు: మందా
సాక్షి, న్యూఢిల్లీ: సోనియాగాంధీ దయ్యమో, దేవతో వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారని టీఆర్ఎస్ నేత, ఎంపీ మందా జగన్నాథం వ్యాఖ్యానించారు. మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో టీఆర్ఎస్ సోనియాను దేవత అని స్తుతించిందని, మరిప్పుడు దేవతా? దయ్యమా? అని విలేకరి ప్రశ్నించగా... మందా పైవిధంగా బదులిచ్చారు. అనేక పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం కాదని కేసీఆర్ ప్రకటించారని, అసలు విషయాలు తెలియకుండా కాంగ్రెస్ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘‘స్నేహపూర్వక హస్తం అంటూనే రెచ్చగొట్టేలా మాట్లాడారు. సోనియా ఎప్పుడూ విలీనం, పొత్తులపై మాట్లాడలేదు. కానీ, దిగ్విజయ్‌సింగ్ మాత్రం విలీనం ఖరారైందని, కేవలం విధివిధానాలే మాట్లాడుకోవాల్సి ఉందని ఎలా అంటారు. ఇద్దరు సభ్యులతో బిల్లు ఎలా పాస్ చేయిస్తారంటూ టీఆర్ఎస్పై ఎలా వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తారు? దిగ్విజయ్ వ్యాఖ్యలు మొత్తం తెలంగాణ ప్రజలను అవమానించే రీతిలో ఉన్నాయి.’’ అని ఆరోపించారు. -
దయ్యమా, దేవతా.. ప్రజలే నిర్ణయిస్తారు: మందా
న్యూఢిల్లీ: ‘‘సోనియా గాంధీ దేవతా.. దయ్యమా? అన్నది కాదు. అది వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారు. ఆమె దయ్యమా? దేవతా? అన్న అభిప్రాయం మా పార్టీకి ఎందుకుంటుంది?..’’ అని టీఆర్ఎస్ నేత, ఎంపీ మందా జగన్నాథం వ్యాఖ్యానించారు. మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో టీఆర్ఎస్ సోనియాను దేవత అని స్తుతించిందని, మరిప్పుడు దేవతా? దయ్యమా? అని విలేకరి ప్రశ్నించగా... మందా జగన్నాథం పైవిధంగా బదులిచ్చారు. అనేక పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం కాదని కేసీఆర్ ప్రకటించారని, అసలు విషయాలు తెలియకుండా కాంగ్రెస్ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘‘స్నేహహస్తం చాపాల్సింది పోయి కాంగ్రెస్ నేతలు ఎంత త్వరగా పొత్తుల బంధం చెడిపోతే బాగుండని చూస్తున్నారు. కేసీఆర్ గతంలో సెప్టెంబరు 30లోపు తెలంగాణ ఇస్తే విలీనం చేస్తామన్న మాట నిజమే. కానీ కాంగ్రెస్ మాటపై నిలబడలేదు. స్నేహపూర్వక హస్తం అంటూనే రెచ్చగొట్టేలా మాట్లాడారు. సోనియా ఎప్పుడూ విలీనం, పొత్తులపై మాట్లాడలేదు. కానీ, దిగ్విజయ్‌సింగ్ మాత్రం విలీనం ఖరారైందని, కేవలం విధివిధానాలే మాట్లాడుకోవాల్సి ఉందని ఎలా అంటారు. ఇద్దరు సభ్యులతో బిల్లు ఎలా పాస్ చేయిస్తారంటూ టీఆర్ఎస్పై ఎలా వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తారు. దిగ్విజయ్ వ్యాఖ్యలు మొత్తం తెలంగాణ ప్రజలను అవమానించే రీతిలో ఉన్నాయి. దొరల పాలన అంటూ జైరాం రమేశ్ ఎలా మాట్లాడతారు. కాంగ్రెస్, టీడీపీల పాలనలో ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఎప్పుడైనా సరే ప్రభుత్వ ఏర్పాటు అనేది అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం జరిగేలా ఉంటుంది. మేం తెలంగాణకు న్యాయం చేయాలని, ప్యాకేజీలు ఇవ్వాలని అడిగితే కాంగ్రెస్ వాళ్లు కేవలం సోనియాను స్తుతించేందుకే ప్రయత్నించారు. కాంగ్రెస్ స్నేహహస్తం అంటూనే వెనుక నుంచి కత్తితో పొడిచే ప్రయత్నం చేసింది..’’ అని ఆరోపించారు. కాంగ్రెస్‌కు, టీఆర్ఎస్కు పొత్తు ఉంటుందా అని ప్రశ్నించగా.. పొత్తులపై ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నారు. -
110 సీట్లు గెలిస్తే విలీనం ఎందుకు?
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒంటిరిగా పోటీ చేసినా 110 అసెంబ్లీ, 15 ఎంపీ సీట్లు గెలుచుకుంటామంటున్న నమ్మకం ఆ పార్టీ నేతలకు ఉంటే టీఆర్ఎస్ పార్టీని విలీనం చేయమని ఎందుకు అడుగుతున్నారని ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. పార్టీని విలీనం చేయలేదంటూ టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్‌ను విమర్శించే అర్హత తెలంగాణ కాంగ్రెస్ నేతలకెక్కడదని దుయ్యబట్టారు. పార్టీ నేతలతో కలిసి మంగళవారం తెలంగాణభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీని విలీనం చేయనందుకు తెలంగాణ మంత్రులుగా పనిచేసిన నేతలు అవహేళన చేసి మాట్లాడుతున్నారని, వారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కేసీఆర్ వల్లే తెలంగాణ రాలేదంటున్నారు, కాకపోతే మీ వల్ల తెలంగాణ వచ్చిందా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నన్ని రోజులు మంత్రులుగా ఉంటూ ఏనాడు ఉద్యమానికి సహకరించిన నేతలు ఇప్పుడు విలీనం గురించి మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. జూలై 30వ తేదీన సీడబ్ల్యూసీ నిర్ణయం తరువాత కెడ్రిట్ కాంగ్రెస్ రావాలని ఈ నేతలందరికీ మాటలోచ్చాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ని పిట్టల దొర అని షబ్బీర్ అలీ అంటున్నాడని.. కేసీఆర్ దెబ్బకే ఢిల్లీ బెదిరింది.. పదేళ్లగా చంద్రబాబు కోలుకోవడం లేదన్నారు. ప్రభుత్వం వారం రోజులలో పోయే ముందు శ్రీధర్‌బాబు మంత్రి పదవికి రాజీనామా గొప్పులు చెప్పుకుంటున్నాడని విమర్శించారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల అభిప్రాయాల మేరకు రాష్ట్ర పునర్ నిర్మాణం కోసం పార్టీ తీసుకున్న నిర్ణయం తప్పెలా అవుతుందని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ప్రశ్నించారు. -
టీడీపీని ఖాళీ చేసేందుకే..!
టీఆర్ఎస్లో విలీనం కావద్దన్న టీఆర్ఎస్ వ్యూహం లక్ష్యమిదే విలీనం కాకపోతే టీడీపీ నుంచి భారీ వలసలు ఉంటాయనే అంచనా సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన వెంటనే విలీనం చేస్తామంటూ ఇప్పటిదాకా చెప్తూ వచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు తన వైఖరి మార్చుకోవటం వెనుక భారీ వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. మూడు, నాలుగు రోజుల్లో లోక్‌సభ, శాసనసభ ఎన్నికల షెడ్యూలు విడుదలవుతున్న తరుణంలో రాజకీయ వ్యూహంతోనే కేసీఆర్ విలీనం చేయబోమన్న ప్రకటన చేసినట్లు కనిపిస్తోంది. తెలంగాణలో టీడీపీని నామరూపాల్లేకుండా చేయాలన్న లక్ష్యం కూడా కేసీఆర్ తాజా వ్యూహంలో భాగంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ను విలీనం చేయబోమన్న నిర్ణయానికి.. కేసీఆర్ బయటకు చెప్తున్న కారణాల్లో చాలావరకు అసమంజసంగానే ఉన్నాయని.. బయటకు చెప్పకుండా దాచిన కారణాలెన్నో అంతర్గతంగా ఉన్నయన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. రాజకీయ పరిశీలకులు ఏం చెప్తున్నారంటే... - కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనమైతే బీజేపీ బలం పెరిగే అవకాశం ఉంది. టీడీపీ తాజాగా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని యత్నిస్తోంది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. - తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్, తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్ మాత్రమే పోటీలో ఉంటాయి.. మరో రాజకీయ పార్టీకి క్షేత్రస్థాయిలో అవకాశం లేకుండా చేయటం కూడా విలీనం ఉండదన్న ప్రకటనలో వ్యూహం కావచ్చు. - కాంగ్రెస్‌లో విలీనం కాబోయే టీఆర్ఎస్లో చేరడానికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు వెనుకంజ వేస్తున్నారు. విలీనం కాదని స్పష్టమైన ప్రకటన వస్తే టీఆర్ఎస్లోకి వలసలు ఉంటాయనే వ్యూహంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. - విలీనం వల్ల.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేని కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు ప్రత్యామ్నాయ పార్టీల వైపు వెళ్తారు. స్థానికంగా బలమున్న నేతలకు ఇతర వనరులు కలిసి వస్తే కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. - సోనియాకు కృతజ్ఞతలు ఎందుకు చెప్పారు?: ఎన్నో షరతులతో తెలంగాణ వచ్చిందని కేసీఆర్ చేస్తున్న వాదనలో పస లేదని తెలంగాణ వాదులు అభిప్రాయపడుతున్నారు. ‘షరతులు ఉన్న తెలంగాణ సాధించినందుకు కేసీఆర్ విజయోత్సవాలు ఎందుకు చేసుకున్నారు? ఇలాంటి తెలంగాణ ఇచ్చినందుకు సోనియాగాంధీకి కృతజ్ఞతలు ఎందుకు చెప్పారు? ఒక్క సోనియాగాంధీతోనే కాకుండా రాహుల్‌గాంధీతోనూ రహస్య సమావేశాలను కేసీఆర్ ఎందుకు జరిపారు? ఈ తెలంగాణ ఏర్పాటులో అభ్యంతరాలు ఉన్న విషయం బిల్లు ఆమోదం పొందిన 10 రోజులకు కేసీఆర్ వివరించటంలోని ఆంతర్యమేమిటి ? కాంగ్రెస్‌లో విలీనం, రాజకీయ ప్రయోజనాలు వంటి అంశం తెరపైకి వచ్చేదాకా తెలంగాణ బిల్లులోని అభ్యంతరాలపై ఎందుకు నోరు విప్పలేదు? ఇలాంటి వాటిని చూస్తే కేసీఆర్ చేస్తున్న వాదనలోని అసలు వ్యూహం వేరే ఉందని అర్థమవుతోంది’ అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక కాంగ్రెస్‌తో పొత్తా? అవగాహనా? పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయని పక్షంలో కేసీఆర్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్‌తో పొత్తులు ఉంటాయా? లేక కాంగ్రెస్‌తో అవగాహన మేరకు స్నేహపూర్వక పోటీలు ఉంటాయా? అనే అంశాలపై చర్చ మొదలైంది. మరోవైపు ఎంఐఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమాక్రసీ లాంటి పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లడం ద్వారా పలు చోట్ల బలం పెంచుకోవచ్చని కూడా కేసీఆర్ అంచనా వేసినట్లు చెప్తున్నారు. అలాగే.. ఎన్నికల అనంతరం జాతీయ స్థాయిలో రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కూడా విలీనం చేయొద్దన్న ఆలోచనకు వచ్చారన్న వాదనా వినిపిస్తోంది. విలీనం వల్ల అస్తిత్వం కోల్పోవలసిన పరిస్థితులను అంచనా వేసుకున్నాకే ఈ నిర్ణయానికి వచ్చారని విశ్లేషిస్తున్నారు. -
విలీనం చెయ్యం
* కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఝలక్ * మా పార్టీ మొత్తం వందకు వంద శాతం విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారు * సీడబ్ల్యూసీ టీ-నిర్ణయం తీసుకున్నప్పుడు మమ్మల్ని సంప్రదించలేదు * బిల్లులో లొసుగుల సవరణలకు ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదు * తెలంగాణకు ఒక్క జాతీయ సాగునీటి ప్రాజెక్టును కూడా ఇవ్వలేదు * రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరపాలని సోనియాను కోరినా వినలేదు * మేం బహిష్కరించిన ఎమ్మెల్యేలు, ఎంపీలను కాంగ్రెస్ కలుపుకోవచ్చా? * టీ-జేఏసీని పిలిచి కాంగ్రెస్‌లో చేరండి.. టికెట్లు ఇస్తామని అంటారా? * కాంగ్రెస్ తీరుతో బాధపడ్డాం.. అందుకే విలీనం వద్దని నిర్ణయించాం * ఎన్నికల తర్వాతే రాష్ట్ర విభజన అమలు, పంపిణీలు ఉంటాయి.. అప్పుడు తెలంగాణ గళాన్ని వినిపించటానికి టీఆర్ఎస్ ఉండాలి * పొత్తులపై కమిటీని వేశాం.. పార్టీలు ఆ కమిటీని సంప్రదించవచ్చు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోమని ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు తేల్చిచెప్పారు. ‘‘అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించినం. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తరువాత టీఆర్ఎస్ను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో విలీనం చేయకూడదని నిర్ణయించినం’’ అని ఆయన ప్రకటించారు. టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో, శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గం సంయుక్త సమావేశం సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగింది. కేసీఆర్ అధ్యక్షతన దాదాపు ఏడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో 85 మంది నేతలు మాట్లాడగా.. కొందరు నేతలు రాతపూర్వకంగా అభిప్రాయాలను తెలియజేశారు. అనంతరం పార్టీ నేతలు కె.కేశవరావు, ఈటెల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, మందా జగన్నాథం, మధుసూదనాచారి, వేణుగోపాలాచారి, దాసోజు శ్రవణ్‌లతో కలసి కేసీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేయవద్దని వంద శాతం నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. పూర్తి వివరాలు కేసీఆర్ మాటల్లోనే... చాలా కారణాలున్నయి... ‘‘టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేయకూడదని నిర్ణయం తీసుకోవడానికి మాకు చాలా కారణాలున్నయి. తెలంగాణ అస్థిత్వాన్ని కోల్పోతే బయటకు రావడానికి 60 ఏళ్లు పట్టింది. పోరాటాలు, బలిదానాలు జరపాల్సి వచ్చింది. ఈ రోజు టీఆర్ఎస్ ఒక వాయిస్ అయింది. (కాంగ్రెస్‌లో టీఆర్ఎస్) విలీనం అంశం చర్చించడానికి సమావేశం ఉందని తెలిసి విలీనం చేయవద్దంటూ ప్రజల నుంచి నాకు వేల ఎస్ఎంఎస్ మెసేజ్‌లు వచ్చాయి. వేలాది పోస్టుకార్డులు, టెలిగ్రామ్‌లు (చాలాకాలం కిందటే టెలిగ్రామ్‌ల వ్యవస్థను తపాలాశాఖ నిలిపేయటం గమనార్హం!), ఉత్తరాలు అందినయి. అది కాకుండా పార్టీ మొత్తం వందకు వంద శాతం విలీనాన్ని వ్యతిరేకిస్తున్నరు. మమ్మల్ని విశ్వాసంలోకి తీసుకోలేదు... కాంగ్రెస్ తెలంగాణ నిర్ణయం తీసుకునే విషయంలో మా పార్టీని కనీసం కూడా సంప్రదించలేదు. సీడబ్ల్యూసీ తీర్మానానికి ముందు, బిల్లు రూపొందించేటప్పుడు మమ్మల్ని సంప్రదించలేదు. విశ్వాసంలోకి తీసుకోలేదు. తెలంగాణ బిల్లులో ఉన్న లొసుగులకు సంబంధించి సోనియాగాంధీతోసహా పలువురు నేతలను కలిసి సవరణలు చేయాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఏ ఒక్క అంశాన్నీ పరిగణనలోకి తీసుకోలేదు. తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. తెలంగాణకు గర్వకారణంగా ఉన్న హైదరాబాద్ హౌజును లేకుండా చేశారు. తెలంగాణ ఆస్తిగా భావించే (ఢిల్లీలోని) ఆంధ్రా భవన్‌ను రెండుగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. తెలంగాణకు ఒక్క జాతీయ సాగునీటి ప్రాజెక్టు ఇవ్వలేదు. హైదరాబాద్ శాంతిభద్రతలపై గవర్నరుకు అధికారాలు ఇచ్చి సూపర్‌పవర్ కేబినెట్‌ను సృష్టించవద్దని చెప్పినం. ప్రధానిని కలిసి వెంటనే అపాయింటెడ్ డే ప్రకటించాలని కోరిన. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు కావాలని సోనియాను కూడా అడిగాను. అది కూడా పట్టించుకోలేదు. విలీనం వద్దనడానికి ఇది కూడా కారణం. కాంగ్రెస్‌కు అప్పుడే రాం రాం చెప్పినం... కరెంటు అడిగితే కూడ ఇవ్వలేదు. జైపాల్‌రెడ్డి ఇంటికి వెళ్లి ముంపు గ్రామాలకు సంబంధించి ఆర్డినెన్స్ తెస్తానంటున్నారు.. అడ్డుకోండని చెప్పాను. డి.శ్రీనివాస్, జానారెడ్డి సహా అందరికీ చెప్పాను. అయినా పట్టించుకోలేదు. ఆంధ్రావాళ్లు చెవిలో ఇళ్లు కట్టుకుని అనుకున్నది సాధించారు. జైరాం సహకరించారు. టీ-కాంగ్రెస్ నేతలు ఎటుపోయిండ్రు? నేనేమైనా గట్టిగ మాట్లాడితే నాకు తెలంగాణ ఇష్టం లేదని ఒంటికాలిపై లేచిండ్రు. షరతుల్లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సెప్టెంబరు 30 (2012) లోగా ఇస్తే పార్టీని విలీనం చేస్తామని వయలార్ రవితో చెప్పిన. ఇవ్వలేదు. కాంగ్రెస్‌కు రాం రాం అని అప్పుడే చెప్పి, కరీంనగర్లో సమావేశం పెట్టి ఒంటరి పోరు అని ప్రకటించినం. ..నొసటితో వెక్కిరించడం కాదా? కాంగ్రెస్ నేతల తీరు బాధించింది. అయినా ఓపిక పట్టాం. ఎందుకంటే తెలంగాణ రావాలనే ఉద్దేశంతోనే. కొన్ని సందర్భాల్లో మేం గట్టిగా మాట్లాడితే కాంగ్రెసోళ్లు మామీద విరుచుకుపడ్డారు. ఎక్కడి ఉద్యోగులు అక్కడే పనిచేయాలని అంటే నాకు తెలంగాణ రావడం ఇష్టం లేదని, రాజకీయాలు చేస్తున్నడని విమర్శలు చేశారు. బిల్లుకు ఆటంకం కాకూడదని ఆగినం. పార్టీని విలీనం అడిగినోళ్లు ఎంత మర్యాదగా ఉండాలి? స్నేహం అంటూనే టీఆర్ఎస్ బహిష్కరించిన ఎంపీలను, ఎమ్మెల్యేలను కలుపుకోవచ్చా? నోటితోని పొగిడి నొసటితో వెక్కిరించడం కాదా? టీఆర్ఎస్ ఆమ్ ఆద్మీ పార్టీ అవుతుందని, దొరల పాలన వస్తదని జైరాం అంటారా? పైగా జేఏసీని పిలిచి కాంగ్రెస్‌లో చేరండి.. టిక్కెట్లు ఇస్తామంటరా? రాయల తెలంగాణను నేనే తీసేయించా... రాష్ట్రపతి సంతకం సిరా కూడా ఆరలేదు. కొన్ని గంటల్లోనే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతున్నామని ఆర్డినెన్స్ తెస్తామన్నారు. ఇది రాజ్యాంగానికే వ్యతిరేకం. ఆ అధికారం కేంద్రానికే లేదు. పార్లమెంట్‌కు మాత్రమే ఉంది. దీనిపై సుప్రీంకోర్టుకు కూడా వెళ్తం. అందుకే విలీనం ప్రసక్తేలేదు. తెలంగాణ వాళ్లంతా ఢిల్లీలో ఒక బ్యాచ్‌గా ఉండండి. సీమాంధ్ర వాళ్లను అడ్డుకోండి అని చెప్పిన. ఇంకొక విషయం కూడా చెబుతా... రాయల తెలంగాణ అని కేంద్రం నిర్ణయం తీసుకుంది. చివరకు నేను వెళ్లి గట్టిగా ఒత్తిడి తెచ్చి బిల్లులో దానిని తీసేయించాను. వాళ్లు చేయరు.. మేం ఫైట్ చేస్తే మాపై నిందలేయడం.. రేపు కూడా వీళ్ల వ్యవహారం ఇట్లనే ఉంటదని గ్రహించే విలీనం వద్దని నిర్ణయించాం. నిజమైన పంపకాలు, ఇతరత్రా వ్యవహారాలన్నీ ఎన్నికల తరువాతే జరుగుతాయి. అప్పుడు తెలంగాణ వాయిస్‌ను గట్టిగా విన్పించాలనే ఉద్దేశంతోనే విలీనం వద్దనే నిర్ణయం తీసుకున్నాం. విలీనంపై సోనియా నన్ను అడగలేదు... సవరణలు చేయాల్సిన వాటిపై సోనియాగాంధీకి జాబితా కూడా ఇచ్చినం. ఎన్నికల నోటిఫికేషన్ ముందే చర్యలు తీసుకోవాలని కోరాను. వారు అంగీకరించలేదు. మా ఎంపీలందరం భారీగా గెలుస్తం. రేపు కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే మేం మద్దతిస్తాం. మధ్యలో ఉండే నేతలు సోనియాగాంధీని తప్పుదోవ పట్టించారు. రాజకీయ పార్టీ అన్నాక అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తాం కదా! విలీనం చేయాలని సోనియాగాంధీ అయితే నన్ను అడగలేదు. టీఆర్ఎస్ మొత్తం విలీనం వద్దంది. జైరాంరమేశ్ ఎవరండీ.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడటానికి? నాకు పదవులపై ఆశలేదు... పదవుల కోసం ఎవరు పాకులాడుతున్నారో, ఉద్యమం వచ్చినప్పుడు పడుకున్నదెవరో తెలుసు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకుపైసా ఇవ్వనంటే నోరు మూసుకుని పడి ఉన్నదెవరు? కేసీఆర్ పదవుల కోసం పాకులాడుతారా? పదవులను కాలి గోటితో సమానంగా తీసేసి ఎన్నికల్లోకి వెళ్లిన వ్యక్తి. నిన్నటి వరకు మాది ఉద్యమ పార్టీయే.. ఇప్పుడు పక్కా రాజకీయ పార్టీ. అట్లాగే మా వ్యవహారం ఉంటది. అందులో అనుమానమే లేదు. రాజకీయంగా మేం బలపడొద్దా? పునర్నిర్మాణం చేయొద్దా? తెలంగాణకు మేం ప్రత్యేక హోదా తెచ్చుకోవాలి. జాతీయ ప్రాజెక్టు హోదా తెచ్చుకోవాలి. మాకు 15 ఎంపీలు వస్తే.. వాళ్లే మా దగ్గరకు వస్తరు. అడిగింది ఇస్తరు. తెలంగాణకు కావాల్సింది స్వీయ రాజకీయ అస్తిత్వమే. కేంద్రంలో వచ్చే సంకీర్ణ ప్రభుత్వమే కాబట్టి శక్తి పెంచుకోవాలి. అందుకే తెలంగాణ సమాజమంతా టీఆర్ఎస్ను విలీనం చేయొద్దని చెప్పారు. సోషల్ మీడియాలోనూ ఇదే చెప్పారు. రేపు సీమాంధ్రలో రెండు ప్రాంతీయ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తుంటే తెలంగాణలో ఎందుకు టీఆర్ఎస్ ఉండకూడదు? రైల్వే లైన్లు, డబ్బులు, తెచ్చుకోవాలంటే టీఆర్ఎస్ ఉండాల్సిందే. ఇంక తెలంగాణలో టీడీపీ ఎక్కడుంది? చంద్రబాబు పక్క రాష్ట్రమాయన. ఆయన గురించే మాట్లాడే అవసరం లేదు. ఇక్కడున్న ఆ పార్టీ వాళ్లంతా మా పార్టీలో చేరుతున్నరు. చివరి నిమిషం వరకు విభజనను అడ్డుకునేందుకు చంద్రబాబు ఢిల్లీలో కూర్చుని బీజేపీపై ఒత్తిడి తెచ్చిండు. టీడీపీ నేతల్లో కొందరు కాంగ్రెస్‌లోకి వెళుతున్నట్లు తెలిసింది. ఈ రోజు దయాకర్‌రావు రాజీనామా చేసిండట. టీడీపీ తెలంగాణలోనే లేదు. వేల మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నరు. బహిరంగ సభపై ఇప్పటి వరకు అనుకోలేదు. ఇప్పుడు ఆలోచిస్తున్నం. ఎన్నికల్లోకి టీఆర్ఎస్ వెళ్లాలని స్పష్టతతో ఉన్నం. దళిత సీఎం గురించి ఏక్దమ్న అడుగుతరా? దళిత సీఎం గురించి ఇప్పుడు చర్చ లేదు. ఇంకా ఎన్నికలే కాలేదు. ఏక్దమ్ (ఒక్కసారిగా)న ఇప్పుడా ప్రశ్న ఎందుకొచ్చింది? తెలంగాణ వచ్చింది. దాని గురించి అడగండి. నేనే తెలంగాణ ఉద్యమ నేతను. కచ్చితంగా ప్రముఖమైన పాత్రే తెలంగాణలో ఉంటది. ఉద్యమంలో ఉన్నట్టుగానే తెలంగాణ రాష్ట్రంలోనూ ఉంట. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు గాంధీ, నెహ్రూకు జనం దండలేసినరు. స్వాతంత్య్రం ఇచ్చింది కదా అని ఎలిజిబెత్ రాణికి సన్మానం చేసిండ్రా? లేదు కదా! తెలంగాణ కోసం పోరాడిన నాకు కాకుండా ఎవరికి వేస్తరు? టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి రావాలి. ఆ స్థాయి సీట్లు మాకుండాలి. ఈ మధ్య జరిగిన సర్వేలన్నీ 14 ఎంపీ సీట్లు వస్తాని చెప్పాయి. అంటే దానర్థం.. టీఆర్ఎస్ తేలికగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని.. ఇప్పటికే 10 వేల సర్వేలు చెప్పాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు, వీటికి సంబంధమే ఉండదు.’’ మాతో పొత్తు కావాలంటే.. కేకే కమిటీని కలవొచ్చు ఇతర పార్టీలతో టీఆర్ఎస్ ఎన్నికల పొత్తుల అంశాన్ని ఖరారు చేసేందుకు ఐదుగురు పార్టీ సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు కేసీఆర్ తెలిపారు. కె.కేశవరావు, నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, కడియం శ్రీహరి, వినోద్‌కుమార్‌లు కమిటీ సభ్యులు ఉంటారన్నారు. కాంగ్రెస్ పార్టీ సహా ఇతర పార్టీలు ఏవైనా తమతో పొత్తులు పెట్టుకోవాలని భావిస్తే కమిటీని సంప్రదించవచ్చని సూచించారు. కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ‘‘ఈ రోజు విలీనం చేయాలా? వద్దా? అనే అంశంపైనే సీరియస్‌గా, సుధీర్ఘంగా చర్చించినం. విలీనం వద్దని తీర్మానించినం. ఆ తరువాత వాళ్లేమైనా పొత్తులు అడుగుతారేమోననే ఉద్దేశంతోనే కమిటీ వేసినం. నాకు ఎన్నికలు, ప్రచారం ఇతరత్రా చాలా పనులు ఉంటాయి కాబట్టి కేకే డీల్ చేసేలా కమిటీ వేశాం’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. -
కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ కలవదు: కేసీఆర్
-
కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ కలవదు: కేసీఆర్
హైదరాబాద్: తమ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌లో విలీనం చేయబోమని టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ఈమేరకు టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో ఏకగ్రీవ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో కలపొద్దని తెలంగాణ వ్యాప్తంగా తనకు వేల సందేశాలు వచ్చాయని తెలిపారు. విభజన విషయంలో ఏ ఒక్క సందర్భంలోనూ కాంగ్రెస్ తమను సంప్రదించలేదన్నారు. బిల్లు రూపకల్పనలో తమను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. తాము అడిగింది ఏమీ కాంగ్రెస్ చేయలేదని విమర్శించారు. ఎన్టీపీసీ నుంచి అదనపు విద్యుత్ ఇవ్వలేదని, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరినా ఇవ్వలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది కాబట్టి ఇక నుంచి టీఆర్ఎస్ పక్కా రాజకీయ పార్టీగా ఉంటుందని స్పష్టం చేశారు. పొత్తుల విషయం కేశవరావు నేతృత్వంలో ఏర్పడే కమిటీ చూసుకుంటుందన్నారు. సోనియాను కొందరు నాయకులు తప్పుదారి పట్టించారని అభిప్రాయపడ్డారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే తప్పకుండా మద్దతు ఇస్తామని కేసీఆర్ తెలిపారు. -
ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు!
* గెజిట్‌లో అపాయింటెడ్ డే ప్రకటించని కేంద్రం * ఎన్నికల అనంతరమే రాష్ట్ర విభజన, వేర్వేరు ప్రభుత్వాల ఏర్పాటు! సాక్షి, హైదరాబాద్: వచ్చే సార్వత్రిక ఎన్నికలు రెండు వేర్వేరు రాష్ట్రాల్లో జరుగుతాయా? లేక ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతాయా? అనే ఉత్కంఠ దాదాపుగా తొలగిపోయినట్లే. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణను ఏర్పాటు చేసినట్టు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శనివారం రాజపత్రాన్ని (గెజిట్) జారీ చేసినప్పటికీ అందులో అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ‘అపాయింటెడ్ డే’ను ప్రస్తావించలేదు. విభజన చట్టంలోని చిక్కుముడులు, విభజన ప్రక్రియ పూర్తి చేయటం వంటి అంశాలను తేల్చిన తర్వాతే అపాయింటెడ్ డే ఖరారు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలను ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది. రెండు మూడు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఈలోగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అపాయింటెడ్ డే ను ప్రకటించే అవకాశాలు ఏ మాత్రం లేవు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పటికీ ఫలితాల అనంతరం ప్రత్యేక తెలంగాణ, విభజన తర్వాత మిగిలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరుగా ప్రభుత్వాలు కొలువుదీరనున్నాయి. తెలంగాణ విభజనకు రాజపత్రం విడుదలైన నేపథ్యంలో తెలంగాణ మొత్తం ఒక విడత, ఆంధ్రప్రదేశ్‌లో మరో విడత పోలింగ్ జరిగే విధంగా షెడ్యూలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాలు చెప్తున్నాయి. 2009 ఆంధ్రప్రదేశ్ మొత్తంగా రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కీలకం కానున్న టీఆర్ఎస్ విలీనం ఇదిలావుంటే.. సార్వత్రిక ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలోనా? లేక వేర్వేరుగానా? అనేది టీఆర్ఎస్ విలీనంపై ఆధారపడి ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర విభజనకు సంబంధించి వెంటనే అపాయింటెడ్ డేను ప్రకటించడంతోపాటు తెలంగాణ, సీమాంధ్రలో వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుకోగలుగుతామని టీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తే వేర్వేరుగా ఎన్నికలు జరపాలని భావిస్తోంది. విలీనంపై కేసీఆర్ తీసుకునే నిర్ణయాన్ని బట్టే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్‌లో విలీనం చేయాలా? వద్దా? అనే అంశంపై సోమవారం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంద న్న అంశంపై కాంగ్రెస్ నేతలు ఎదురుచూస్తున్నారు. -
కెసిఆర్ మాట తప్పితే బుద్దిచెప్పే యత్నం!
-
జైరాం రమేశ్ వ్యాఖ్యలను ఖండించిన పొన్నాల
హైదరాబాద్: టీఆర్ఎస్పై కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఖండించారు. రాజకీయాల్లో మాటలు విలువలకు తగ్గట్టుగా ఉండాలని సూచించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. అదే విధంగా కేసీఆర్ కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేయాలని అన్నారు. టీఆర్ఎస్ను రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే సంకుచిత పార్టీగా జైరాం రమేశ్ నిన్న వర్ణించారు. అలాంటి పార్టీకి అండగా ఎలా ఉంటారని తెలంగాణ జేఏసీ నేతలను ప్రశ్నించారు. -
కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిస్తా: జగ్గారెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఇస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు మాటమారుస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి) విమర్శించారు. దొంగ మాటలతో కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ పునర్ నిర్మాణం కేసీఆర్‌కే కాదు, తమకూ తెలుసునని చెప్పారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం కాకుంటే ఆ పార్టీకే నష్టమన్నారు. సొంతంగా పోటీ చేస్తే టీఆర్ఎస్ ఓడిపోతుందని, 10 సీట్లు కూడా రావని అన్నారు. టీఆర్ఎస్ విలీనం చేయకుంటే ఆ పార్టీలో కేసీఆర్ కుటుంబ సభ్యులే మిగులుతారని చెప్పారు. టీఆర్ఎస్ విలీనం చేయకపోవడం ప్రజలు, కాంగ్రెస్‌ను మోసం చేయడమే అన్నారు. పార్టీ ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిస్తానని జగ్గారెడ్డి దీమా వ్యక్తం చేశారు. తన సంగారెడ్డి సీటుకు ఎసరు పెట్టే సత్తా టీఆర్ఎస్కే కాదు, కాంగ్రెస్ నాయకులకు లేదని పేర్కొన్నారు. -
'విలీన చర్చలే జరగలేదు, మీడియా దుష్ప్రచారం'
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనంపై ఇంతవరకు చర్చలే జరగలేదని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. "కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనంపై ఆంధ్రా మీడియా సాగిస్తున్న ప్రసారాలు కేవలం దుష్ర్సచారమే. కాంగ్రెస్ నాయకులను కలిసిన ప్రతి సందర్భంలోనూ నేను రాజకీయాలు మాట్లాడలేదు. నేను చెప్పని మాటలను మీడియా సంస్థలే ప్రసారం చేశాయి. ఇంత దుర్మార్గంగా ఎందుకు ఈ దుష్ర్పచారం చేస్తున్నాయి? కార్యకర్తలెవరూ దీనిని నమ్మొద్దు'' అని అందులో పేర్కొన్నారు. కాగా తెలంగాణ రాష్ట్రంతోనే తిరిగి హైదరాబాద్‌లో కాలు పెడతానని ప్రకటించి జనవరి 31న ఢిల్లీకి వచ్చిన కేసీఆర్.. 25 రోజుల అనంతరం తిరిగి హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు కేసీఆర్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి హెలిక్టాపర్ ద్వారా బేగంపేట విమానాశ్రయంలో దిగుతారు. ఇక తెలంగాణ రాష్ట్ర సాధనతో తిరిగి వస్తున్న కేసీఆర్‌కు కనీవినీ ఎరుగనిస్థాయిలో ఘనస్వాగతం పలకాలని పార్టీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. కేసీఆర్ రాక సందర్భంగా బేగంపేట విమానాశ్రయం నుంచి అసెంబ్లీ ఎదురుగా గన్‌పార్కులో గల అమరవీరుల స్తూపం వరకు వేలాది మంది భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. కేసీఆర్‌తో సాగే ఈ ర్యాలీ దారిపొడవునా, అమరవీరుల స్తూపం వద్ద కేసీఆర్ నివాళులు అర్పించే సమయంలో ఆ ప్రాంతంలోనూ పూలవర్షం కురిపించటానికి ప్రత్యేక హెలికాప్టర్‌ను సైతం సిద్ధం చేశారు. ర్యాలీ కోసం పార్టీ నేతలు ఇప్పటికే పోలీసు విభాగం అనుమతి కూడా తీసుకున్నారు. -
'రాజకీయ లబ్ధికోసం వెళ్లే వారిని పిలవలేదు'
న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై రేపట్లోగా స్పష్టత వచ్చే అవకాశం ఉందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం అంశం హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు. ఇందులో తమ పాత్ర ఏమీ లేదన్నారు. ముఖ్యమంత్రి నియామకం విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పునరుద్ఘాటించారు. వార్‌రూంలో జరిగే సమావేశంలో సీమాంధ్రలో పార్టీ బలోపేతంపై చర్చిస్తామని చెప్పారు. రెండు పీసీసీలా, రెండు రీజినల్ కమిటీయా అన్న దానిపై చర్చిస్తామని తెలిపారు. రాజకీయ లబ్ధికోసం కాంగ్రెస్‌ను వదిలి వెళ్లాలనుకునే వారిని ఈ సమావేశానికి అధిష్టానం పిలవలేదని బొత్స అన్నారు. -
'కేసీఆర్‌ను చూసి ఓట్లేయలేదు...'
న్యూఢిల్లీ : కాంగ్రెస్-టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య విలీనంపై మాటల యుద్ధం కొనసాగుతోంది.ఈ అంశంపై మంత్రి డీకె అరుణ మాట్లాడుతూ పార్టీ విలీనానికి కేసీఆర్ షరతులు పెట్టడం సరికాదని అన్నారు. మంగళవారం ఆమె ఢిల్లీలో విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను విలీనం చేస్తానని కేసీఆరే చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. క్లిష్టమైన పరిస్థితుల మధ్యే సోనియా గాంధీ తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపచేశారన్నారు. తెలంగాణ వాదానికే ప్రజలు ఓటు వేశారు కానీ, కేసీఆర్‌ను చూసి ఓట్లేయలేదని డీకె అరుణ వ్యాఖ్యానించారు. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ చెప్పారని ఆమె తెలిపారు. అధిష్టానం ఎవరిని సీఎంను చేసినా తాము మద్దతు ఇస్తామని డీకె అరుణ తెలిపారు. కాగా తెలంగాణ ప్రాంత మంత్రులు ఈరోజు ఉదయం దిగ్విజయ్‌తో భేటీ అయ్యారు. -
ఢిల్లీ మీకు.. తెలంగాణ మాకు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనంపై ఆ రెండు పార్టీల మధ్య జరుగుతున్న చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. తెలంగాణ ఉభయసభల్లో ఆమోదం పొందగానే కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉంటానని, తెలంగాణ రాష్ట్రంపై తమకే సంపూర్ణ అధికారమివ్వాలని కేసీఆర్ ప్రతిపాదిస్తున్నారు. తెలంగాణలో ఏర్పాటయ్యే ప్రభుత్వంపై, తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీపై తమకే అధికారాలు ఉండాలని చెబుతున్నారు. ఎంపీ సీట్లు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని, అన్ని విషయూల్లోనూ మీరనుకున్నట్టుగానే ముందుకు వెళ్లవచ్చని సూచిస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం బేషరతుగానే విలీనం చేయాలని కోరుతోంది. దశాబ్దాల తరబడి పార్టీలో పనిచేస్తున్న సీనియర్లు, పార్టీ శ్రేణులను కాదని పూర్తి అధికారాలు సాధ్యం కాదని కాంగ్రెస్ అధిష్టానం తెగేసి చెబుతోంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత బేషరతుగా విలీనం చేస్తామని చెప్పిన మాటను అమలు చేయాలని కోరుతోంది. కాంగ్రెస్ పార్టీలో విలీనం తర్వాత రాజకీయ అవకాశాలు తప్పకుండా వస్తాయని, విలీనానికి ముందుగానే షరతులను విధించడం సరైంది కాదని ఆ పార్టీ అధిష్టాన పెద్దలు చెబుతున్నారు. దీంతో విలీనంపై దాగుడు మూతలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు విలీనానంతరం తెలంగాణపై, రాష్ట్ర పార్టీపై పూర్తి అధికారాలు ఇవ్వడం వీలుకాకుంటే ఎన్నికల పొత్తుకు పరిమితం అవుదామని కూడా కేసీఆర్ ప్రతిపాదిస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య పొత్తులు మాత్రమే ఉంటే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆయన అన్నట్టు సమాచారం. పార్టీలుగా కొనసాగుతూనే పొత్తులు పెట్టుకోవడం వల్ల భవిష్యత్తులో టీడీపీ, బీజేపీ వంటి పార్టీలు బలోపేతం కాకుండా ఉంటాయని చెబుతున్నారు. కేసీఆర్ ప్రతిపాదనలను విన్న కాంగ్రెస్ పెద్దలు మూడు నాలుగురోజుల్లో చెబుతామన్నట్టు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించారుు. దిగ్విజయ్‌తో భేటీలో కేకే లేరు: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌తో కేసీఆర్, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు ఆదివారం సాయంత్రం భేటీ అయినట్టు పార్టీవర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. అయితే ఆ భేటీలో కేసీఆర్ ఒక్కరే ఉన్నారని, కేకే హాజరుకాలేదని అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. సోనియాగాంధీని కేవలం కేసీఆర్ కుటుంబసభ్యులే కలిసిన నేపథ్యంలో పార్టీలో మరెవరూ లేరా? అనే విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో దిగ్విజయ్‌తో భేటీలో కేకే ఉన్నట్టు పార్టీ కార్యాలయం నుండి ప్రకటన (ఎస్ఎంఎస్) విడుదల చేశారు. దీనిపైనా సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 28న లేదా మార్చి 1న పొలిట్‌బ్యూరో భేటీ నిర్వహించాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు సమాచారం. -
11.30 సోనియాతో భేటీ కానున్న కేసీఆర్
-
11.30 సోనియాతో భేటీ కానున్న కేసీఆర్
న్యూఢిల్లీ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఈరోజు ఉదయం 11.30 గంటలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ కానున్నారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని గతంలో కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్‌లో విలీనంపై కేసీఆర్ ఎటుతేల్చుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీతో కేసీఆర్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక విలీనమా ? పొత్తా ? అనే దానిపై పార్టీ కార్యవర్గ సమావేశంలో చర్చించి ఓ నిర్ణయానికి రావచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. విలీనం అయితే కొందరు ముఖ్యులకు తప్ప..మిగితా వారికి తగిన ప్రాదాన్యం ఉండక పోవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. విలీనమా ? పొత్తా ? అనే అంశంపై టీఆర్ఎస్ శ్రేణులు తర్జన భర్జన పడుతున్నాయి. ఈ అంశంపై స్పష్టత కోసం పార్టీ శ్రేణులతో చర్చిస్తున్నారు. సోనియాతో భేటీ అనంతరం కేసీఆర్ దీనిపై ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. -
రాహుల్‌తో కేసీఆర్ భేటీ?
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సోమవారం రాత్రి రహస్యంగా భేటీ అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేసీఆర్ ఒంటరిగానే వెళ్లి రాహుల్‌గాంధీని కలిసినట్టుగా సమాచారం. లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందటానికి ఒక రోజు ముందుగా వెళ్లి రాహుల్‌గాంధీని కలిస్తే బిల్లులోని అంశాలు, టీఆర్ఎస్ విలీనం వంటి అంశాలు తప్ప చర్చించటానికి మరేం ఉంటాయని టీఆర్ఎస్ ముఖ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. రాహుల్‌తో కేసీఆర్ భేటీని ఆయన సన్నిహితులు ధ్రువీకరించటం లేదు. కానీ ఆయన కలిసే అవకాశాలు లేకపోలేదని వారు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ‘కారు’ గుర్తు ఉంటుంది!: కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం ఉండదని, బిల్లు ఆమోదం పొందేదాకా ఎవరేం అనుకున్నా మౌనంగానే ఉండదలుచుకున్నామని కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే నాయకుడొకరు వెల్లడించారు. ‘కాంగ్రెస్‌లో ఎందుకు విలీనం అవుతం. తెలంగాణ ఇవ్వాలనుకుంటే 2009లో ప్రకటన చేసినప్పుడే ఇచ్చి ఉండాల్సింది. ఇంతకాలం కొట్లాడిన తర్వాత తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ గొప్పతనం ఏంది? ఆ పార్టీలో విలీనం ఎందుకు కావాలి? ఇప్పటిదాకా కొట్లాడిన తెలంగాణ ఈ కాంగ్రెస్ చేతుల్లో పెట్టడానికా? తెలంగాణ బిల్లు ఆమోదం పొందేదాకా ఏమీ మాట్లాడం. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత చూడు ఏం అవుతుందో. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తు కచ్చితంగా ఉంటది. మీరే చూస్తారుగా’ అని సదరు నాయకుడు వ్యాఖ్యానించారు. విలీనం అవసరమే లేదు!: కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ను విలీనం చేసుకోవాల్సిన అవసరం లేదని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పార్టీ తెలంగాణ సీనియర్లు నివేదించారు. మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన పలువురు నేతలు సోమ, మంగళవారాల్లో రాహుల్‌ను కలిశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పార్టీకి సంపూర్ణ అధికారం వస్తుందని పేర్కొన్నారు. అయితే టీఆర్ఎస్ విలీనం, ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు తెలంగాణ రాష్ట్రంపై సంపూర్ణ అధికారాలు ఇచ్చే అవకాశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత రాజకీయ పరిస్థితులు, జేఏసీ వంటి రాజకీయేతర ఉద్యమ సంస్థల వైఖరి, టీఆర్ఎస్ బలాబలాలు వంటి వాటిపై ఒక నివేదికను అందించారు. -
టీఆర్ఎస్ విలీనమెలా ?
పార్టీ ముఖ్యులు, ఎమ్మెల్యేలతో కేసీఆర్ చర్చలుస హైదరాబాద్‌లో భారీ సభలో ప్రకటించడమా? బిల్లు ఆమోదం పొందగానే ఢిల్లీలోనే ముగించడమా? విలీనంపై నేతల్లో భిన్నాభిప్రాయాలు నేడో, రేపో పొలిట్‌బ్యూరో భేటీలో నిర్ణయం న్యూఢిల్లీ నుండి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందుతుందన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనంపై ఆ పార్టీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ ఇచ్చాక విలీనం తప్పదని టీఆర్ఎస్ శ్రేణులకు అధినేత కేసీఆర్ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలిచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలోనే మోహరించిన టీఆర్ఎస్ ముఖ్య నేతలు, పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఈ దిశగా ఆయన చర్చలు జరుపుతున్నారు. విలీనం చేయవద్దని కేసీఆర్‌కు నిత్యం సన్నిహితంగా ఉండే కొందరు నేతలు సూచిస్తున్నారు. తెలంగాణ ఇస్తున్నది కాంగ్రెసే అయినా అందుకోసం 13 ఏళ్లుగా పోరాడిన పార్టీగా టీఆర్ఎస్కు, ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ నేతగా కేసీఆర్కుఎనలేని ఆదరణ ఉంటుందని వారంటున్నారు. ‘అలాగాక కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనమైతే బీజేపీ మరో శక్తిగా ఎదిగే ఆస్కారముంటుంది. కాబట్టి అంతగా అయితే కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకుందాం’ అని సూచిస్తున్నారు. ఇతర నేతలు ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. అంతర్గత బలహీనతలను, తెలంగాణ ప్రజల మనోగతాన్ని గుర్తెరగకుండా పార్టీ శక్తిని ఎక్కువగా అంచనా వేసుకోవద్దని సీనియర్ నేతలు హెచ్చరిస్తున్నారు. వీటన్నింటిపై 10 రోజులుగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అనివార్యమంటున్న కేసీఆర్ టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నేతల ఆలోచన, డిమాండ్లు ఎలా ఉన్నా కాంగ్రెస్ మాత్రం విలీనాన్నే కోరుతోందని కేసీఆర్ వెల్లడించారు. అది అనివార్యమయ్యే పరిస్థితులే ఉన్నాయంటున్నారు. ఈ దృష్ట్యా విలీనం ఎప్పుడు, ఎలా అనేదానిపై యోచిస్తే మేలని ఆయనంటున్నారు. లోక్‌సభలో 18న, రాజ్యసభలో 19 తెలంగాణ బిల్లు ఆమోదం ఖాయమని పార్టీ నేతలతో చెబుతున్నారు. బిల్లును ఉభయ సభలు ఆమోదించిన మర్నాడే విలీన ప్రకటన చేసే అవకాశాలూ లేకపోలేదని టీఆర్ఎస్ ముఖ్యులు చెబుతున్నారు. అయితే సాదాసీదాగా ఢిల్లీలో కాకుండా హైదరాబాద్,లేదా కరీంనగర్లో భారీ బహిరంగ సభ పెట్టి విలీన ప్రకటన చేయాలన్నది కేసీఆర్ యోచనగా తెలుస్తోంది. దానికి సోనియాగాంధీనీ ఆహౠ్వనించే యోచన కూడా ఉన్నట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ మార్చి 3న రావచ్చని, దానికి, నోటిఫికేషన్‌కు మధ్య సభ పెట్టే ప్రతిపాదన ఉందని తెలిపాయి. తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణాధికారాలు మనకే అప్పగిస్తేనే విలీనం చేద్దామని సీనియర్ ఎమ్మెల్యేలంటున్నారు. అన్నింటా సముచిత భాగస్వామ్యం, ప్రాధాన్యత ఉంటుంది గానీ పూర్తి పగ్గాలివ్వరేమోనని కేసీఆర్ అభిప్రాయపడ్డట్టు తెలిసింది. విలీనంపై చర్చకు మంగళవారం సాయంత్రం, లేదా బుధవారం టీఆర్ఎస్ విస్తృతస్థాయి పొలిట్‌బ్యూరో సమావేశ జరిగే అవకాశముంది. ఈ సందర్భంగా లాంఛనంగా విలీన నిర్ణయం తీసుకోవచ్చని కేసీఆర్ సన్నిహితులు వెల్లడించారు. మరోవైపు కేంద్ర మంత్రి జైరాం రమేశ్ సోమవారం సాయంత్రం కేసీఆర్‌తో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రాయల తెలంగాణ, పోలవరం ముంపు గ్రామాలు తదితరాలపై జైరాం కొన్ని ప్రతిపాదనలు చేయగా కేసీఆర్ అంగీకరించలేదు. హైదరాబాద్‌పై ఎలాంటి షరతులూ లేకుండా 10 జిల్లాల తెలంగాణ కావాల్సిందేనన్నారు. పలువురి జన్మదిన శుభాకాంక్షలు కేసీఆర్ 60వ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ, వివిధ పార్టీల నేతలు సోమవారం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు నేతలు పార్లమెంటులో ఆయనను అభినందించారు. టీఆర్ఎస్ నేతలు, జేఏసీ నేతలు, వివిధ జిల్లాల నుండి వచ్చిన నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ ఇంటికి సమైక్యాంధ్ర విద్యార్థి నేతలు కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు సమైక్యాంధ్ర విద్యార్థి జేఏపీ నేతలు సోమవారం ఉదయం ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లారు. పోలీసులు లోనికి అనుమతించకపోవడంతో తోపులాట జరిగింది. కేసీఆర్ స్వప్నం సాకారమవుతోంది: కవిత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలన్న 60 ఏళ్ల కల నెరవేరుతున్న సందర్భం ఒకవైపు ఉన్నా తమ హృదయం మాత్రం అమరవీరుల చుట్టు తిరుగుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. కేసీఆర్ జన్మదిన సందర్భంగా పార్టీ యువజన, విద్యార్థి, మహిళా కార్యకర్తలు తెలంగాణభవన్‌లో వేడుకలు నిర్వహించారు. ప్రత్యేక శిబిరం నిర్వహించి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవిత విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ కల, అమరవీరుల ఆకాంక్ష నెరవేరబోతుందన్నారు. -
అవన్నీ ఊహాగానాలే: ఈటెల
హైదరాబాద్: కాంగ్రెస్‌లో తమ పార్టీ విలీనం అవుతుందని మీడియాతో వస్తున్న కథనాలన్ని ఊహాగానాలేనని టీఆర్ఎస్ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. పార్లమెంట్ ఉభయసభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పోందేవరకు రాజకీయంగా ఎలాంటి చర్చలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ ఢిల్లీ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి తిరిగి వస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రేపు తమ పార్టీ ఎమ్మెల్యేలమంతా ఢిల్లీ వెళ్తున్నట్టు ఈటెల రాజేందర్ తెలిపారు. కాగా, బిల్లుపై ముందుకువెళ్లటానికి ముందుగానే టీఆర్ఎస్ ‘రాజకీయ నిర్ణయాల’పై కాంగ్రెస్ నుంచి పెరుగుతున్న ఒత్తిడి కేసీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని ఆయన సన్నిహితులు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం గురించి కేసీఆర్‌నే అడగాలని దిగ్విజయ్ సింగ్ అన్నారు. -
విలీనం చేయకపోతే వెళ్లిపోతా: అరవింద్‌రెడ్డి
హైదరాబాద్: ఇచ్చిన మాట ప్రకారం పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత టీఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని మంచిర్యాల టీఆర్ఎస్ శాసన సభ్యుడు గడ్డం అరవింద్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ విలీనం కాకపోతే తాను కాంగ్రెస్ పార్టీలో చేరతానని మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ చెప్పారు. కాంగ్రెస్‌లో విలీనం చేయకపోతే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతుందని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు మంచి అభ్యర్థులు లేరని అరవింద్‌రెడ్డి అన్నారు. ఐదు రోజుల నుంచి పార్టీ నేతలకు అందుబాటులో లేకుండా పోయిన అరవింద్‌రెడ్డిపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరా తీస్తున్నట్టు సమాచారం. -
ఒంటరి పోరుకే సీపీఐ మొగ్గు?
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే దానిపై సీపీఐలో సందిగ్ధత నెలకొంది. ఎన్నికలకు సమాయత్తం కావాలన్న పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా యాప్రాల్‌లో రెండు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర సమితి సమావేశం బుధవారం పొత్తులు, సర్దుబాట్లు, రాష్ట్ర రాజకీయ పరిస్థితిపై చర్చలు జరిపింది. ఎన్నికల నాటికి రాష్ట్ర విభజన పూర్తయినా కాకపోయినా ప్రస్తుత రాజకీయ సమీకరణల నేపథ్యంలో పార్టీకి బలం ఉన్న స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేయడంపై దృష్టి సారించాలన్న అభిప్రాయానికి వచ్చింది. ఈమేరకు సుమారు 50 నియోజకవర్గాలను గుర్తించినట్టు తెలిసింది. రాష్ట్ర అనిశ్చితి నేపథ్యంలో ప్రధాన పార్టీలు ద్వంద్వ ప్రమాణాలు పాటించి ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్నాయని సమావేశం అభిప్రాయపడింది. చంద్రబాబు నాయుడు తనతో పాటు పార్టీనీ గందరగోళంలోకి నెట్టాడని, అందువల్ల ఆ పార్టీకి విశ్వసనీయత ఉండకపోవచ్చని సమావేశంలో పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. బీజేపీవైపు అడుగులు వేస్తున్నందున ఆ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఉండడమే మేలని వారు వాదించారు. విభజన తర్వాత తెలంగాణలోనూ రాజకీయ పరిస్థితులు వేగంగా మారే సూచనలు కన్పిస్తున్నాయని ఆ ప్రాంత నేతలు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం అంశం తేలితే పొత్తుల వ్యవహారాన్నీ కొలిక్కి తేవచ్చన్నారు. వైఎస్సార్సీపీతో సీపీఎం పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీతో పొత్తుపెట్టుకోవాలా? లేదా? అనే దానిపైనా తర్జనభర్జన పడ్డారు. పార్టీ జాతీయ సమితి నిర్ణయం మేరకు వామపక్షాల ఐక్యతకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, లేకుంటే ఒంటరి పోరుకే మొగ్గు చూపాలని మెజారిటీ సభ్యులు తేల్చిచెప్పారు. కేంద్ర కార్మిక సంఘాలు వచ్చేనెల 12న తలపెట్టిన చలో పార్లమెంటుకు మద్దతు పలుకుతూ, విశాఖ, కాకినాడల మధ్య తీర ప్రాంతంలో రసాయన పరిశ్రమల ఏర్పాటును వ్యతిరేకిస్తూ తీర్మానాలను ఆమోదించారు. -
విలీనంపై ఇప్పుడే చర్చలొద్దు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు నెగ్గి, రాష్ట్రపతి ఆమోదం పొందేదాకా కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం ప్రసక్తి, ఆ అంశంపై చర్చలు వద్దని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. పూర్తి స్పష్టత లేకుండా ఇప్పుడే ఎందుకు మాట్లాడుకోవడం అని అన్నారు. 10 జిల్లాలతో తెలంగాణ ఏర్పాటై అన్నింటిలో సంతృప్తి చెందిన తర్వాతే ఆ సంగతి చూద్దామని తెలిపారు. బుధవారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రపల్లి-వెంకటాపూర్ శివార్లలోని తన ఫాంహౌస్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో కేసీఆర్ సుమారు 8 గంటలపాటు సమావేశమయ్యారు. ఈ భేటీకి ఇటీవల కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరిన ఎంపీలు మందా జగన్నాధం, జి.వివేక్, టీడీపీ నుండి వచ్చిన కె.హరీశ్వర్‌రెడ్డి హాజరుకాలేదు. మందా, వివేక్‌లు హాజరుకాక పోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటీవల గెలిచిన సర్పంచులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నందున హాజరుకాలేకపోతున్నానంటూ హరీశ్వర్‌రెడ్డి సమాచారం పంపినట్టు తెలిసింది. పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, ఎమ్మెల్సీలు కె.స్వామిగౌడ్, పి.సుధాకర్‌రెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, టి.హరీష్‌రావు, కె.తారక రామారావు, ఏనుగు రవీందర్‌రెడ్డి, కావేటి సమ్మయ్య, నల్లాల ఓదేలు, జి.అరవింద్‌రెడ్డి, మాజీ ఎంపీలు ఎ.పి.జితేందర్ రెడ్డి, జి.వినోద్, మాజీ ఎమ్మెల్యేలు నాయిని నర్సింహారెడ్డి, ఎస్.మధుసూదనాచారి తదితరులు హాజరయ్యారు. పార్టీ ముఖ్యులు అందించిన విశ్వసనీయ సమాచారం మేరకు తెలంగాణ ప్రకటన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, వివిధ పార్టీల ఎత్తుగడలు, సీమాంధ్రలోని ఉద్యమాలు, టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌కు వలసలు, కాంగ్రెస్ అధిష్టానం తరఫున ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ దౌత్యం వంటివాటిపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ పెద్దలతో జరుగుతున్న చర్చలను కేసీఆర్ పొడిపొడిగా వెల్లడించారు. కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నా: ‘కాంగ్రెస్ అధిష్టానంలోని కొందరు ముఖ్యులు మనతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నరు. అయినా తెలంగాణ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతనే కాంగ్రెస్‌తో ఏమైనా చర్చలుంటయి. అలాగని ఆ పార్టీని పూర్తిగా నమ్మలేం. హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో తెలంగాణ ఏర్పాటు కావాలి. నదీజలాల్లో వాటా, హైదరాబాద్ ఆదాయం, అధికారాలపై స్పష్టత, ఉద్యోగుల విభజన వంటివన్నీ తేలాలి. హైదరాబాద్‌పై కిరికిరి పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. ఎక్కడ అన్యాయం జరిగినా మళ్లీ మనది కొట్లాటే. ఇచ్చిన మాట ప్రకారం విలీనానికైనా సిద్ధంగా ఉందాం’ అని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్‌లోకి చాలామంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తున్నారని, నేరుగా కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యులే వారితో చర్చలు జరుపుతాన్నరంటూ వస్తున్న వార్తలపై భేటీలో తీవ్రంగా జర్చ జరిగింది. టీఆర్ఎస్ నుండి 8 మంది టచ్‌లో ఉన్నారని, వారు త్వరలోనే కాంగ్రెస్‌తో కలుస్తున్నారని దిలీప్‌కుమార్ ఎలా చెప్తాడని అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. టీఆర్ఎస్ నుండి ఎమ్మెల్సీగా గెలిచిన ఆయన కాంగ్రెస్ తరఫున బ్రోకర్‌గా ఎలా పనిచేస్తాడని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మాటమార్చి చంద్రబాబు మోసం: ఈటెల తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడే వరకు చెప్పిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి మాటమార్చి మోసం చేస్తున్నాడని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నాయకులు ఈటెల రాజేందర్ విమర్శించారు. ఫాంహౌస్‌లో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తన కపటత్వాన్ని, మోసపూరిత నైజాన్ని బయట పెట్టుకున్నాడని విమర్శించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి కేవలం సీమాంధ్రకే సీఎంలా మాట్లాడుతున్నాడన్నారు. సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమాలను సృష్టిస్తున్నారని, ముఖ్యమంత్రి కిరణ్, ప్రతిపక్షనేత చంద్రబాబు, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అంతా ఒక్కటేనని ఈటెల వ్యాఖ్యానించారు. మతకల్లోలాలను సృష్టించి హైదరాబాద్‌ను వివాదాస్పదం చేయాలనే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. టీఆర్ఎస్ నుండి గెలిచిన ఒక ఎమ్మెల్సీ కాంగ్రెస్‌కు బ్రోకర్‌గా పనిచేస్తున్నాడంటూ ‘ఖబడ్దార్’ అని హెచ్చరించారు. విజయమ్మ దీక్షతో వైఎస్సార్ కాంగ్రెస్ వైఖరి స్పష్టంగా తేలిపోయిందన్నారు. -
రాలుతున్న గులాబీ రేకులు
సాక్షి, హైదరాబాద్/ ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర సమితి మెడమీద కత్తిలా మారింది. పార్టీ నుంచి నాయకులు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతుండటం, అలాంటి నేతలతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ నేరుగా సంప్రదింపులు జరుపుతుండటం వంటి పరిణామాలు టీఆర్ఎస్ నాయకత్వానికి అంతుచిక్కడం లేదు. విభజించు-పాలించు అన్న రాజకీయ వ్యూహంతో కాంగ్రెస్ పనిచేస్తోందని టీఆర్ఎస్ నేతలు అంచనాకొచ్చారు. మొన్న మెదక్ ఎంపీ విజయశాంతి, నేడు మాజీ మంత్రులు డాక్టర్ జి.విజయ రామారావు, డాక్టర్ ఎ.చంద్రశేఖర్ టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరడానికి రంగం సిద్ధమైంది. తెలంగాణ విభజన ప్రక్రియ లేదా టీఆర్ఎస్ విలీనం గురించి టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతో ఇప్పటివరకు కాంగ్రెస్ అధిష్టానం వైపునుంచి అధికారికంగా ఎవరూ చర్చలు జరపడం లేదు. దీంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో అయోమయం మొదలైంది. టీఆర్ఎస్ విలీనం ఉంటుందా? ప్రత్యేక రాష్ట్రంలోనూ టీఆర్ఎస్ రాజకీయ పార్టీగా మనుగడ సాగిస్తుందా? విలీనం చేయకుంటే ఎన్ని స్థానాల్లో టీఆర్ఎస్ గెలుస్తుంది? ఇప్పటిదాకా తెలంగాణవాదంతోనే పలు విజయాలు సాధించిన టీఆర్ఎస్ ఫక్తు రాజకీయ పార్టీగా ఎలాంటి ఫలితాలు సాధిస్తుంది? విలీనం కాకుండా జరిగే పరిణామాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? వంటి అనేక అంశాలపై టీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ను రాజకీయంగా బలహీనం చేసే ఎత్తుగడలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. టీఆర్ఎస్ను విలీనం చేసుకుంటామని చెప్తూనే మరోవైపు ఆ పార్టీ ముఖ్యనేతలతోనూ, ఎమ్మెల్యేలతోనూ అధిష్టాన ముఖ్యులే నేరుగా చర్చలు జరుపుతుండటం టీఆర్ఎస్ నేతలకు మింగుడుపడటం లేదు. కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి ముందు టీఆర్ఎస్కు, కేసీఆర్‌కు స్వంతంగా బేరం చేసుకునే శక్తిని తగ్గించడానికి కాంగ్రెస్ ఈ రకమైన వ్యూహంతో వెళుతోందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. మరింత మంది ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు కూడా కాంగ్రెస్‌లోని వివిధ స్థాయి నాయకులతో మంతనాలు జరుపుతున్నట్టుగా వస్తున్న వార్తలు కేసీఆర్‌ను కూడా కలవరపరుస్తున్నట్టుగా సమాచారం. దిగ్విజయ్‌తో టీఆర్ఎస్ నేతల భేటీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో సోమవారం రాత్రి పలువురు టీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. గతంలో అసెంబ్లీలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా పనిచేసిన జి.విజయరామారావుతో పాటు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఎ.చంద్రశేఖర్, సోయం బాబూరావులు దిగ్విజయ్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు నేతలు సైతం దిగ్విజయ్‌ను కలిశారని తెలుస్తున్నా వారెవరనేది తె లియరాలేదు. సుమారు అరగంట పాటు భేటీ అయిన నేతలు కాంగ్రెస్‌లో చేరే విషయమై ఆయనతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను పూర్తిచేస్తే మరికొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని టీఆర్ఎస్ నేతలు దిగ్విజయ్‌కు స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. అయితే ఈ భేటీ అనంతరం నేతలెవరూ మీడియాకు అందుబాటులోకి రాలేదు. టీఆర్ఎల్డీ నేత కపిలవాయి దిలీప్‌కుమార్ నేతృత్వంలో ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. కేటీఆర్, హరీష్‌రావు కూడా మిగలరు: ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ను ఎందుకు విలీనం చేయడం లేదని ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్ ప్రశ్నించారు. ఢిల్లీలో ఉన్న దిలీప్‌కుమార్ ‘సాక్షి ప్రతినిధి’తో ఫోనులో మాట్లాడుతూ టీఆర్ఎస్ను విలీనం చేయడానికి ఇంకా ఆలస్యం చేస్తే పార్టీ ఉనికికే ప్రమాదమని హెచ్చరించారు. ‘‘టీఆర్ఎస్ను విలీనం చేయకుండా ఉంటే కేసీఆర్‌తో ఎవరూ ఉండరు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్‌రావు కూడా టీఆర్ఎస్లో ఉండరు. ఢిల్లీ స్థాయిలో నాకున్న సంబంధాలు తెలిసిన టీఆర్ఎస్ నేతలు చాలామంది నాతో మాట్లాడుతున్నరు. ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు నాతో మాట్లాడారు. కాంగ్రెస్ ముఖ్యులను కలిసి, పార్టీలో చేరుతామని అంటున్నరు. టీఆర్ఎస్పై ఉన్న గౌరవంతోనే ఆగుతున్నా. ఇంకా ఆలస్యం చేస్తే కేసీఆర్ తప్ప ఎవరూ టీఆర్ఎస్లో ఉండరు. టీడీపీ ఎమ్మెల్యేలు ముగ్గురు కాంగ్రెస్‌లో త్వరలోనే చేరుతున్నరు. కాంగ్రెస్ నేతలతో వారిని మాట్లాడిస్తున్న. టీఆర్ఎస్ను విలీనం చేయకుంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్‌తో మాట్లాడిస్తా’’ అని దిలీప్‌కుమార్ హెచ్చరించారు. అత్యంత బలమైన శక్తిగా కాంగ్రెస్: విజయశాంతి ఒంటరిగా పోటీచేస్తే టీఆర్ఎస్కు 2014లో జరిగే ఎన్నికల్లో 10 - 12 సీట్లు దాటవని ఆ పార్టీ సస్పెన్షన్‌కు గురైన ఎంపీ ఎం.విజయశాంతి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని విజయశాంతి నివాసంలో సోమవారం కలిసిన మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడుతూ తెలంగాణలో రాజకీయంగా అత్యంత బలమైన రాజకీయ శక్తిగా కాంగ్రెస్ అవతరిస్తుందని చెప్పారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్‌వైపే ప్రజలుంటారని, కాంగ్రెస్‌కు 80 స్థానాలు దాటుతాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని కాంగ్రెస్సే ఏర్పాటుచేస్తుందని ప్రకటించారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనంపై స్పందించేందుకు నిరాకరించారు. టీఆర్ఎస్ నుండి ఇంకా షోకాజ్ నోటీసు అందలేదన్నారు. నోటీసు అందిన తర్వాత అందులో ప్రస్తావించిన అంశాలపై మాట్లాడతానని చెప్పారు. రాజకీయ భవిష్యత్తుపైనా అప్పుడే మాట్లాడుతానని తెలిపారు. కేసీఆర్ ఒక్కడితోనే తెలంగాణ రాలేదని, ఆయనొక్కడే క్రెడిట్ తీసుకుంటానంటే ఎవరూ అంగీకరించరని చెప్పారు. తెలంగాణకోసం ఎంతోమంది పోరాడితే వారిలో కేసీఆర్ కూడా ఒక్కరని విజయశాంతి వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి పోటీచేయాలా, పార్లమెంటుకు పోటీ చేయాలా అనేది తర్వాత నిర్ణయించుకుంటానని చెప్పారు.