
రాహుల్‌తో కేసీఆర్ భేటీ?
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సోమవారం రాత్రి రహస్యంగా భేటీ అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేసీఆర్ ఒంటరిగానే వెళ్లి రాహుల్‌గాంధీని కలిసినట్టుగా సమాచారం. లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందటానికి ఒక రోజు ముందుగా వెళ్లి రాహుల్‌గాంధీని కలిస్తే బిల్లులోని అంశాలు, టీఆర్‌ఎస్ విలీనం వంటి అంశాలు తప్ప చర్చించటానికి మరేం ఉంటాయని టీఆర్‌ఎస్ ముఖ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. రాహుల్‌తో కేసీఆర్ భేటీని ఆయన సన్నిహితులు ధ్రువీకరించటం లేదు. కానీ ఆయన కలిసే అవకాశాలు లేకపోలేదని వారు అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో ‘కారు’ గుర్తు ఉంటుంది!: కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం ఉండదని, బిల్లు ఆమోదం పొందేదాకా ఎవరేం అనుకున్నా మౌనంగానే ఉండదలుచుకున్నామని కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే నాయకుడొకరు వెల్లడించారు. ‘కాంగ్రెస్‌లో ఎందుకు విలీనం అవుతం. తెలంగాణ ఇవ్వాలనుకుంటే 2009లో ప్రకటన చేసినప్పుడే ఇచ్చి ఉండాల్సింది. ఇంతకాలం కొట్లాడిన తర్వాత తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ గొప్పతనం ఏంది? ఆ పార్టీలో విలీనం ఎందుకు కావాలి? ఇప్పటిదాకా కొట్లాడిన తెలంగాణ ఈ కాంగ్రెస్ చేతుల్లో పెట్టడానికా? తెలంగాణ బిల్లు ఆమోదం పొందేదాకా ఏమీ మాట్లాడం. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత చూడు ఏం అవుతుందో. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తు కచ్చితంగా ఉంటది. మీరే చూస్తారుగా’ అని సదరు నాయకుడు వ్యాఖ్యానించారు.
విలీనం అవసరమే లేదు!: కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ను విలీనం చేసుకోవాల్సిన అవసరం లేదని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పార్టీ తెలంగాణ సీనియర్లు నివేదించారు. మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన పలువురు నేతలు సోమ, మంగళవారాల్లో రాహుల్‌ను కలిశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పార్టీకి సంపూర్ణ అధికారం వస్తుందని పేర్కొన్నారు. అయితే టీఆర్‌ఎస్ విలీనం, ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు తెలంగాణ రాష్ట్రంపై సంపూర్ణ అధికారాలు ఇచ్చే అవకాశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత రాజకీయ పరిస్థితులు, జేఏసీ వంటి రాజకీయేతర ఉద్యమ సంస్థల వైఖరి, టీఆర్‌ఎస్ బలాబలాలు వంటి వాటిపై ఒక నివేదికను అందించారు.