రాలుతున్న గులాబీ రేకులు | TRS leaders come out from party one by one | Sakshi
Sakshi News home page

రాలుతున్న గులాబీ రేకులు

Published Tue, Aug 6 2013 2:07 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

TRS leaders come out from party one by one

సాక్షి, హైదరాబాద్/ ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర సమితి మెడమీద కత్తిలా మారింది. పార్టీ నుంచి నాయకులు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతుండటం, అలాంటి నేతలతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ నేరుగా సంప్రదింపులు జరుపుతుండటం వంటి పరిణామాలు టీఆర్‌ఎస్ నాయకత్వానికి అంతుచిక్కడం లేదు. విభజించు-పాలించు అన్న రాజకీయ వ్యూహంతో కాంగ్రెస్ పనిచేస్తోందని టీఆర్‌ఎస్ నేతలు అంచనాకొచ్చారు. మొన్న మెదక్ ఎంపీ విజయశాంతి, నేడు మాజీ మంత్రులు డాక్టర్ జి.విజయ రామారావు, డాక్టర్ ఎ.చంద్రశేఖర్ టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడానికి రంగం సిద్ధమైంది.
 
 తెలంగాణ విభజన ప్రక్రియ లేదా టీఆర్‌ఎస్ విలీనం గురించి టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతో ఇప్పటివరకు కాంగ్రెస్ అధిష్టానం వైపునుంచి అధికారికంగా ఎవరూ చర్చలు జరపడం లేదు. దీంతో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో అయోమయం మొదలైంది. టీఆర్‌ఎస్ విలీనం ఉంటుందా? ప్రత్యేక రాష్ట్రంలోనూ టీఆర్‌ఎస్ రాజకీయ పార్టీగా మనుగడ సాగిస్తుందా? విలీనం చేయకుంటే ఎన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుస్తుంది? ఇప్పటిదాకా తెలంగాణవాదంతోనే పలు విజయాలు సాధించిన టీఆర్‌ఎస్ ఫక్తు రాజకీయ పార్టీగా ఎలాంటి ఫలితాలు సాధిస్తుంది? విలీనం కాకుండా జరిగే పరిణామాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? వంటి అనేక అంశాలపై టీఆర్‌ఎస్ శ్రేణుల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
 
  టీఆర్‌ఎస్‌ను రాజకీయంగా బలహీనం చేసే ఎత్తుగడలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. టీఆర్‌ఎస్‌ను విలీనం చేసుకుంటామని చెప్తూనే మరోవైపు ఆ పార్టీ ముఖ్యనేతలతోనూ, ఎమ్మెల్యేలతోనూ అధిష్టాన ముఖ్యులే నేరుగా చర్చలు జరుపుతుండటం టీఆర్‌ఎస్ నేతలకు మింగుడుపడటం లేదు. కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి ముందు టీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు స్వంతంగా బేరం చేసుకునే శక్తిని తగ్గించడానికి కాంగ్రెస్ ఈ రకమైన వ్యూహంతో వెళుతోందని టీఆర్‌ఎస్ నేతలు భావిస్తున్నారు. మరింత మంది ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు కూడా కాంగ్రెస్‌లోని వివిధ స్థాయి నాయకులతో మంతనాలు జరుపుతున్నట్టుగా వస్తున్న వార్తలు కేసీఆర్‌ను కూడా కలవరపరుస్తున్నట్టుగా సమాచారం.
 
 దిగ్విజయ్‌తో టీఆర్‌ఎస్ నేతల భేటీ
 కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో సోమవారం రాత్రి పలువురు టీఆర్‌ఎస్ నేతలు భేటీ అయ్యారు. గతంలో అసెంబ్లీలో టీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్‌గా పనిచేసిన జి.విజయరామారావుతో పాటు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఎ.చంద్రశేఖర్, సోయం బాబూరావులు దిగ్విజయ్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు నేతలు సైతం దిగ్విజయ్‌ను కలిశారని తెలుస్తున్నా వారెవరనేది తె లియరాలేదు. సుమారు అరగంట పాటు భేటీ అయిన నేతలు కాంగ్రెస్‌లో చేరే విషయమై ఆయనతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను పూర్తిచేస్తే మరికొందరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని టీఆర్‌ఎస్ నేతలు దిగ్విజయ్‌కు స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. అయితే ఈ భేటీ అనంతరం నేతలెవరూ మీడియాకు అందుబాటులోకి రాలేదు. టీఆర్‌ఎల్‌డీ నేత కపిలవాయి దిలీప్‌కుమార్ నేతృత్వంలో ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది.
 
 కేటీఆర్, హరీష్‌రావు కూడా మిగలరు: ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్
 తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ను ఎందుకు విలీనం చేయడం లేదని ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్ ప్రశ్నించారు. ఢిల్లీలో ఉన్న దిలీప్‌కుమార్ ‘సాక్షి ప్రతినిధి’తో ఫోనులో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ను విలీనం చేయడానికి ఇంకా ఆలస్యం చేస్తే పార్టీ ఉనికికే ప్రమాదమని హెచ్చరించారు. ‘‘టీఆర్‌ఎస్‌ను విలీనం చేయకుండా ఉంటే కేసీఆర్‌తో ఎవరూ ఉండరు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్‌రావు కూడా టీఆర్‌ఎస్‌లో ఉండరు. ఢిల్లీ స్థాయిలో నాకున్న సంబంధాలు తెలిసిన టీఆర్‌ఎస్ నేతలు చాలామంది నాతో మాట్లాడుతున్నరు. ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు నాతో మాట్లాడారు. కాంగ్రెస్ ముఖ్యులను కలిసి, పార్టీలో చేరుతామని అంటున్నరు. టీఆర్‌ఎస్‌పై ఉన్న గౌరవంతోనే ఆగుతున్నా. ఇంకా ఆలస్యం చేస్తే కేసీఆర్ తప్ప ఎవరూ టీఆర్‌ఎస్‌లో ఉండరు. టీడీపీ ఎమ్మెల్యేలు ముగ్గురు కాంగ్రెస్‌లో త్వరలోనే చేరుతున్నరు. కాంగ్రెస్ నేతలతో వారిని మాట్లాడిస్తున్న. టీఆర్‌ఎస్‌ను విలీనం చేయకుంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్‌తో మాట్లాడిస్తా’’ అని దిలీప్‌కుమార్ హెచ్చరించారు.  
 
 అత్యంత బలమైన శక్తిగా కాంగ్రెస్: విజయశాంతి
 ఒంటరిగా పోటీచేస్తే టీఆర్‌ఎస్‌కు 2014లో జరిగే ఎన్నికల్లో 10 - 12 సీట్లు దాటవని ఆ పార్టీ సస్పెన్షన్‌కు గురైన ఎంపీ ఎం.విజయశాంతి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని విజయశాంతి నివాసంలో సోమవారం కలిసిన మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడుతూ తెలంగాణలో రాజకీయంగా అత్యంత బలమైన రాజకీయ శక్తిగా కాంగ్రెస్ అవతరిస్తుందని చెప్పారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్‌వైపే ప్రజలుంటారని, కాంగ్రెస్‌కు 80 స్థానాలు దాటుతాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని కాంగ్రెస్సే ఏర్పాటుచేస్తుందని ప్రకటించారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనంపై స్పందించేందుకు నిరాకరించారు. టీఆర్‌ఎస్ నుండి ఇంకా షోకాజ్ నోటీసు అందలేదన్నారు. నోటీసు అందిన తర్వాత అందులో ప్రస్తావించిన అంశాలపై మాట్లాడతానని చెప్పారు. రాజకీయ భవిష్యత్తుపైనా అప్పుడే మాట్లాడుతానని తెలిపారు. కేసీఆర్ ఒక్కడితోనే తెలంగాణ రాలేదని, ఆయనొక్కడే క్రెడిట్ తీసుకుంటానంటే ఎవరూ అంగీకరించరని చెప్పారు. తెలంగాణకోసం ఎంతోమంది పోరాడితే వారిలో కేసీఆర్ కూడా ఒక్కరని విజయశాంతి వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి పోటీచేయాలా, పార్లమెంటుకు పోటీ చేయాలా అనేది తర్వాత నిర్ణయించుకుంటానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement