విలీనం చెయ్యం | No merger with Congress, says KCR | Sakshi
Sakshi News home page

విలీనం చెయ్యం

Published Tue, Mar 4 2014 2:18 AM | Last Updated on Sat, Aug 18 2018 4:35 PM

No merger with Congress, says KCR

*  కాంగ్రెస్ పార్టీకి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఝలక్
* మా పార్టీ మొత్తం వందకు వంద శాతం విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారు
సీడబ్ల్యూసీ టీ-నిర్ణయం తీసుకున్నప్పుడు మమ్మల్ని సంప్రదించలేదు
బిల్లులో లొసుగుల సవరణలకు ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదు
తెలంగాణకు ఒక్క జాతీయ సాగునీటి ప్రాజెక్టును కూడా ఇవ్వలేదు
రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరపాలని సోనియాను కోరినా వినలేదు
మేం బహిష్కరించిన ఎమ్మెల్యేలు, ఎంపీలను కాంగ్రెస్ కలుపుకోవచ్చా?
టీ-జేఏసీని పిలిచి కాంగ్రెస్‌లో చేరండి.. టికెట్లు ఇస్తామని అంటారా?
కాంగ్రెస్ తీరుతో బాధపడ్డాం.. అందుకే విలీనం వద్దని నిర్ణయించాం
ఎన్నికల తర్వాతే రాష్ట్ర విభజన అమలు, పంపిణీలు ఉంటాయి.. అప్పుడు తెలంగాణ గళాన్ని వినిపించటానికి టీఆర్‌ఎస్ ఉండాలి
పొత్తులపై కమిటీని వేశాం.. పార్టీలు ఆ కమిటీని సంప్రదించవచ్చు
 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోమని ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు తేల్చిచెప్పారు. ‘‘అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించినం. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తరువాత టీఆర్‌ఎస్‌ను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో విలీనం చేయకూడదని నిర్ణయించినం’’ అని ఆయన ప్రకటించారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో, శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గం సంయుక్త సమావేశం సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగింది.

కేసీఆర్ అధ్యక్షతన దాదాపు ఏడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో 85 మంది నేతలు మాట్లాడగా.. కొందరు నేతలు రాతపూర్వకంగా అభిప్రాయాలను తెలియజేశారు. అనంతరం పార్టీ నేతలు కె.కేశవరావు, ఈటెల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, మందా జగన్నాథం, మధుసూదనాచారి, వేణుగోపాలాచారి, దాసోజు శ్రవణ్‌లతో కలసి కేసీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయవద్దని వంద శాతం నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. పూర్తి వివరాలు కేసీఆర్ మాటల్లోనే...
 
చాలా కారణాలున్నయి...
‘‘టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయకూడదని నిర్ణయం తీసుకోవడానికి మాకు చాలా కారణాలున్నయి. తెలంగాణ అస్థిత్వాన్ని కోల్పోతే బయటకు రావడానికి 60 ఏళ్లు పట్టింది. పోరాటాలు, బలిదానాలు జరపాల్సి వచ్చింది. ఈ రోజు టీఆర్‌ఎస్ ఒక వాయిస్ అయింది. (కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్) విలీనం అంశం చర్చించడానికి  సమావేశం ఉందని తెలిసి విలీనం చేయవద్దంటూ ప్రజల నుంచి నాకు వేల ఎస్‌ఎంఎస్ మెసేజ్‌లు వచ్చాయి. వేలాది పోస్టుకార్డులు, టెలిగ్రామ్‌లు (చాలాకాలం కిందటే టెలిగ్రామ్‌ల వ్యవస్థను తపాలాశాఖ నిలిపేయటం గమనార్హం!), ఉత్తరాలు అందినయి. అది కాకుండా పార్టీ మొత్తం వందకు వంద శాతం విలీనాన్ని వ్యతిరేకిస్తున్నరు.
 
మమ్మల్ని విశ్వాసంలోకి తీసుకోలేదు...
కాంగ్రెస్ తెలంగాణ నిర్ణయం తీసుకునే విషయంలో మా పార్టీని కనీసం కూడా సంప్రదించలేదు. సీడబ్ల్యూసీ తీర్మానానికి ముందు, బిల్లు రూపొందించేటప్పుడు మమ్మల్ని సంప్రదించలేదు. విశ్వాసంలోకి తీసుకోలేదు. తెలంగాణ బిల్లులో ఉన్న లొసుగులకు సంబంధించి సోనియాగాంధీతోసహా పలువురు నేతలను కలిసి సవరణలు చేయాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఏ ఒక్క అంశాన్నీ పరిగణనలోకి తీసుకోలేదు. తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. తెలంగాణకు గర్వకారణంగా ఉన్న హైదరాబాద్ హౌజును లేకుండా చేశారు.

తెలంగాణ ఆస్తిగా భావించే (ఢిల్లీలోని) ఆంధ్రా భవన్‌ను రెండుగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. తెలంగాణకు ఒక్క జాతీయ సాగునీటి ప్రాజెక్టు ఇవ్వలేదు. హైదరాబాద్ శాంతిభద్రతలపై గవర్నరుకు అధికారాలు ఇచ్చి సూపర్‌పవర్ కేబినెట్‌ను సృష్టించవద్దని చెప్పినం. ప్రధానిని కలిసి వెంటనే అపాయింటెడ్ డే ప్రకటించాలని కోరిన. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు కావాలని సోనియాను కూడా అడిగాను. అది కూడా పట్టించుకోలేదు. విలీనం వద్దనడానికి ఇది కూడా కారణం.
 
కాంగ్రెస్‌కు అప్పుడే రాం రాం చెప్పినం...
కరెంటు అడిగితే కూడ ఇవ్వలేదు. జైపాల్‌రెడ్డి ఇంటికి వెళ్లి ముంపు గ్రామాలకు సంబంధించి ఆర్డినెన్స్ తెస్తానంటున్నారు.. అడ్డుకోండని చెప్పాను. డి.శ్రీనివాస్, జానారెడ్డి సహా అందరికీ చెప్పాను. అయినా పట్టించుకోలేదు. ఆంధ్రావాళ్లు చెవిలో ఇళ్లు కట్టుకుని అనుకున్నది సాధించారు. జైరాం సహకరించారు. టీ-కాంగ్రెస్ నేతలు ఎటుపోయిండ్రు? నేనేమైనా గట్టిగ మాట్లాడితే నాకు తెలంగాణ ఇష్టం లేదని ఒంటికాలిపై లేచిండ్రు. షరతుల్లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సెప్టెంబరు 30 (2012) లోగా ఇస్తే పార్టీని విలీనం చేస్తామని వయలార్ రవితో చెప్పిన. ఇవ్వలేదు. కాంగ్రెస్‌కు రాం రాం అని అప్పుడే చెప్పి, కరీంనగర్‌లో సమావేశం పెట్టి ఒంటరి పోరు అని ప్రకటించినం.
 
..నొసటితో వెక్కిరించడం కాదా?
కాంగ్రెస్ నేతల తీరు బాధించింది. అయినా ఓపిక పట్టాం. ఎందుకంటే తెలంగాణ రావాలనే ఉద్దేశంతోనే. కొన్ని సందర్భాల్లో మేం గట్టిగా మాట్లాడితే కాంగ్రెసోళ్లు మామీద విరుచుకుపడ్డారు. ఎక్కడి ఉద్యోగులు అక్కడే పనిచేయాలని అంటే నాకు తెలంగాణ రావడం ఇష్టం లేదని, రాజకీయాలు చేస్తున్నడని విమర్శలు చేశారు. బిల్లుకు ఆటంకం కాకూడదని ఆగినం. పార్టీని విలీనం అడిగినోళ్లు ఎంత మర్యాదగా ఉండాలి? స్నేహం అంటూనే టీఆర్‌ఎస్ బహిష్కరించిన ఎంపీలను, ఎమ్మెల్యేలను కలుపుకోవచ్చా? నోటితోని పొగిడి నొసటితో వెక్కిరించడం కాదా? టీఆర్‌ఎస్ ఆమ్ ఆద్మీ పార్టీ అవుతుందని, దొరల పాలన వస్తదని జైరాం అంటారా? పైగా జేఏసీని పిలిచి కాంగ్రెస్‌లో చేరండి.. టిక్కెట్లు ఇస్తామంటరా?
 
రాయల తెలంగాణను నేనే తీసేయించా...
రాష్ట్రపతి సంతకం సిరా కూడా ఆరలేదు. కొన్ని గంటల్లోనే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతున్నామని ఆర్డినెన్స్ తెస్తామన్నారు. ఇది రాజ్యాంగానికే వ్యతిరేకం. ఆ అధికారం కేంద్రానికే లేదు. పార్లమెంట్‌కు మాత్రమే ఉంది. దీనిపై సుప్రీంకోర్టుకు కూడా వెళ్తం. అందుకే విలీనం ప్రసక్తేలేదు. తెలంగాణ వాళ్లంతా ఢిల్లీలో ఒక బ్యాచ్‌గా ఉండండి. సీమాంధ్ర వాళ్లను అడ్డుకోండి అని చెప్పిన. ఇంకొక విషయం కూడా చెబుతా... రాయల తెలంగాణ అని కేంద్రం నిర్ణయం తీసుకుంది. చివరకు నేను వెళ్లి గట్టిగా ఒత్తిడి తెచ్చి బిల్లులో దానిని తీసేయించాను. వాళ్లు చేయరు.. మేం ఫైట్ చేస్తే మాపై నిందలేయడం.. రేపు కూడా వీళ్ల వ్యవహారం ఇట్లనే ఉంటదని గ్రహించే విలీనం వద్దని నిర్ణయించాం. నిజమైన పంపకాలు, ఇతరత్రా వ్యవహారాలన్నీ ఎన్నికల తరువాతే జరుగుతాయి. అప్పుడు తెలంగాణ వాయిస్‌ను గట్టిగా విన్పించాలనే ఉద్దేశంతోనే విలీనం వద్దనే నిర్ణయం తీసుకున్నాం.
 
విలీనంపై సోనియా నన్ను అడగలేదు...
సవరణలు చేయాల్సిన వాటిపై సోనియాగాంధీకి జాబితా కూడా ఇచ్చినం. ఎన్నికల నోటిఫికేషన్ ముందే చర్యలు తీసుకోవాలని కోరాను. వారు అంగీకరించలేదు. మా ఎంపీలందరం భారీగా గెలుస్తం. రేపు కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే మేం మద్దతిస్తాం. మధ్యలో ఉండే నేతలు సోనియాగాంధీని తప్పుదోవ పట్టించారు. రాజకీయ పార్టీ అన్నాక అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తాం కదా! విలీనం చేయాలని సోనియాగాంధీ అయితే నన్ను అడగలేదు. టీఆర్‌ఎస్ మొత్తం విలీనం వద్దంది. జైరాంరమేశ్ ఎవరండీ.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడటానికి?
 
నాకు పదవులపై ఆశలేదు...
పదవుల కోసం ఎవరు పాకులాడుతున్నారో, ఉద్యమం వచ్చినప్పుడు పడుకున్నదెవరో తెలుసు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకుపైసా ఇవ్వనంటే నోరు మూసుకుని పడి ఉన్నదెవరు? కేసీఆర్ పదవుల కోసం పాకులాడుతారా? పదవులను కాలి గోటితో సమానంగా తీసేసి ఎన్నికల్లోకి వెళ్లిన వ్యక్తి. నిన్నటి వరకు మాది ఉద్యమ పార్టీయే.. ఇప్పుడు పక్కా రాజకీయ పార్టీ. అట్లాగే మా వ్యవహారం ఉంటది. అందులో అనుమానమే లేదు. రాజకీయంగా మేం బలపడొద్దా? పునర్నిర్మాణం చేయొద్దా? తెలంగాణకు మేం ప్రత్యేక హోదా తెచ్చుకోవాలి.

జాతీయ ప్రాజెక్టు హోదా తెచ్చుకోవాలి. మాకు 15 ఎంపీలు వస్తే.. వాళ్లే మా దగ్గరకు వస్తరు. అడిగింది ఇస్తరు. తెలంగాణకు కావాల్సింది స్వీయ రాజకీయ అస్తిత్వమే. కేంద్రంలో వచ్చే సంకీర్ణ ప్రభుత్వమే కాబట్టి శక్తి పెంచుకోవాలి. అందుకే తెలంగాణ సమాజమంతా టీఆర్‌ఎస్‌ను విలీనం చేయొద్దని చెప్పారు. సోషల్ మీడియాలోనూ ఇదే చెప్పారు. రేపు సీమాంధ్రలో రెండు ప్రాంతీయ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తుంటే తెలంగాణలో ఎందుకు టీఆర్‌ఎస్ ఉండకూడదు? రైల్వే లైన్లు, డబ్బులు, తెచ్చుకోవాలంటే టీఆర్‌ఎస్ ఉండాల్సిందే.
 
ఇంక తెలంగాణలో టీడీపీ ఎక్కడుంది?
చంద్రబాబు పక్క రాష్ట్రమాయన. ఆయన గురించే మాట్లాడే అవసరం లేదు. ఇక్కడున్న ఆ పార్టీ వాళ్లంతా మా పార్టీలో చేరుతున్నరు. చివరి నిమిషం వరకు విభజనను అడ్డుకునేందుకు చంద్రబాబు ఢిల్లీలో కూర్చుని బీజేపీపై ఒత్తిడి తెచ్చిండు. టీడీపీ నేతల్లో కొందరు కాంగ్రెస్‌లోకి వెళుతున్నట్లు తెలిసింది. ఈ రోజు దయాకర్‌రావు రాజీనామా చేసిండట. టీడీపీ తెలంగాణలోనే లేదు. వేల మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నరు. బహిరంగ సభపై ఇప్పటి వరకు అనుకోలేదు. ఇప్పుడు ఆలోచిస్తున్నం. ఎన్నికల్లోకి టీఆర్‌ఎస్ వెళ్లాలని స్పష్టతతో ఉన్నం.
 
దళిత సీఎం గురించి ఏక్‌దమ్‌న అడుగుతరా?
దళిత సీఎం గురించి ఇప్పుడు చర్చ లేదు. ఇంకా ఎన్నికలే కాలేదు. ఏక్‌దమ్ (ఒక్కసారిగా)న ఇప్పుడా ప్రశ్న ఎందుకొచ్చింది? తెలంగాణ వచ్చింది. దాని గురించి అడగండి. నేనే తెలంగాణ ఉద్యమ నేతను. కచ్చితంగా ప్రముఖమైన పాత్రే తెలంగాణలో ఉంటది. ఉద్యమంలో ఉన్నట్టుగానే తెలంగాణ రాష్ట్రంలోనూ ఉంట. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు గాంధీ, నెహ్రూకు జనం దండలేసినరు. స్వాతంత్య్రం ఇచ్చింది కదా అని ఎలిజిబెత్ రాణికి సన్మానం చేసిండ్రా? లేదు కదా! తెలంగాణ కోసం పోరాడిన నాకు కాకుండా ఎవరికి వేస్తరు? టీఆర్‌ఎస్ ప్రభుత్వంలోకి రావాలి. ఆ స్థాయి సీట్లు మాకుండాలి. ఈ మధ్య జరిగిన సర్వేలన్నీ 14 ఎంపీ సీట్లు వస్తాని చెప్పాయి. అంటే దానర్థం.. టీఆర్‌ఎస్ తేలికగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని.. ఇప్పటికే 10 వేల సర్వేలు చెప్పాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు, వీటికి సంబంధమే ఉండదు.’’
 
మాతో పొత్తు కావాలంటే.. కేకే కమిటీని కలవొచ్చు
ఇతర పార్టీలతో టీఆర్‌ఎస్ ఎన్నికల పొత్తుల అంశాన్ని ఖరారు చేసేందుకు ఐదుగురు పార్టీ సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు కేసీఆర్ తెలిపారు. కె.కేశవరావు, నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, కడియం శ్రీహరి, వినోద్‌కుమార్‌లు కమిటీ సభ్యులు ఉంటారన్నారు. కాంగ్రెస్ పార్టీ సహా ఇతర పార్టీలు ఏవైనా తమతో పొత్తులు పెట్టుకోవాలని భావిస్తే కమిటీని సంప్రదించవచ్చని సూచించారు. కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు.

‘‘ఈ రోజు విలీనం చేయాలా? వద్దా? అనే అంశంపైనే సీరియస్‌గా, సుధీర్ఘంగా చర్చించినం. విలీనం వద్దని తీర్మానించినం. ఆ తరువాత వాళ్లేమైనా పొత్తులు అడుగుతారేమోననే ఉద్దేశంతోనే కమిటీ వేసినం. నాకు ఎన్నికలు, ప్రచారం ఇతరత్రా చాలా పనులు ఉంటాయి కాబట్టి కేకే డీల్ చేసేలా కమిటీ వేశాం’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement