
110 సీట్లు గెలిస్తే విలీనం ఎందుకు?
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒంటిరిగా పోటీ చేసినా 110 అసెంబ్లీ, 15 ఎంపీ సీట్లు గెలుచుకుంటామంటున్న నమ్మకం ఆ పార్టీ నేతలకు ఉంటే టీఆర్‌ఎస్ పార్టీని విలీనం చేయమని ఎందుకు అడుగుతున్నారని ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒంటిరిగా పోటీ చేసినా 110 అసెంబ్లీ, 15 ఎంపీ సీట్లు గెలుచుకుంటామంటున్న నమ్మకం ఆ పార్టీ నేతలకు ఉంటే టీఆర్‌ఎస్ పార్టీని విలీనం చేయమని ఎందుకు అడుగుతున్నారని ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. పార్టీని విలీనం చేయలేదంటూ టీఆర్‌ఎస్ పార్టీని, కేసీఆర్‌ను విమర్శించే అర్హత తెలంగాణ కాంగ్రెస్ నేతలకెక్కడదని దుయ్యబట్టారు. పార్టీ నేతలతో కలిసి మంగళవారం తెలంగాణభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
పార్టీని విలీనం చేయనందుకు తెలంగాణ మంత్రులుగా పనిచేసిన నేతలు అవహేళన చేసి మాట్లాడుతున్నారని, వారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కేసీఆర్ వల్లే తెలంగాణ రాలేదంటున్నారు, కాకపోతే మీ వల్ల తెలంగాణ వచ్చిందా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నన్ని రోజులు మంత్రులుగా ఉంటూ ఏనాడు ఉద్యమానికి సహకరించిన నేతలు ఇప్పుడు విలీనం గురించి మాట్లాడుతున్నారని తప్పుపట్టారు.
జూలై 30వ తేదీన సీడబ్ల్యూసీ నిర్ణయం తరువాత కెడ్రిట్ కాంగ్రెస్ రావాలని ఈ నేతలందరికీ మాటలోచ్చాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ని పిట్టల దొర అని షబ్బీర్ అలీ అంటున్నాడని.. కేసీఆర్ దెబ్బకే ఢిల్లీ బెదిరింది.. పదేళ్లగా చంద్రబాబు కోలుకోవడం లేదన్నారు. ప్రభుత్వం వారం రోజులలో పోయే ముందు శ్రీధర్‌బాబు మంత్రి పదవికి రాజీనామా గొప్పులు చెప్పుకుంటున్నాడని విమర్శించారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల అభిప్రాయాల మేరకు రాష్ట్ర పునర్ నిర్మాణం కోసం పార్టీ తీసుకున్న నిర్ణయం తప్పెలా అవుతుందని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ప్రశ్నించారు.