పొత్తుపై టీఆర్‌ఎస్‌తో చర్చిస్తాం: దిగ్విజయ్
అందుకు టీకాంగ్రెస్ నేతలతో త్వరలో కమిటీ: దిగ్విజయ్
విలీనం చేయాలని మేం కోరలేదు.. ఒంటరిపోరుకైనా మేం సిద్ధం
యూపీఏలో ఉంటామని కేసీఆర్ చెప్పడాన్ని స్వాగతిస్తున్నాం
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్‌ను విలీనం చేయాలని తమ పార్టీ కోరలేదని.. తెలంగాణలో ఒంటరిపోరుకు తాము సిద్ధమేనని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ స్పష్టం చేశారు. అయితే పొత్తులపై టీఆర్‌ఎస్ కమిటీతో చర్చలు జరుపుతామని వెల్లడించారు. ఇందుకోసం కాంగ్రెస్ తెలంగాణ సీనియర్ నేతలతో ఒక కమిటీని ఏర్పాటుచేయనున్నామని తెలిపారు. అయితే, టీఆర్‌ఎస్‌ను విలీనం చేయకున్నా.. ఎన్నికల అనంతరం యూపీఏతో ఉంటామని కేసీఆర్ పేర్కొనడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, సోనియాగాంధీని ఎలిజిబెత్‌రాణితో పోల్చుతూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆ మాటేదో ఆయన సోనియాగాంధీని కలిసినప్పుడే చెప్పాల్సిందని వ్యాఖ్యానించారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో దిగ్విజయ్‌సింగ్ విలేకరులతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే...
హా తెలంగాణ ప్రజల స్వప్నం నెరవేరబోతున్నందుకు నాకు ఆనందంగా ఉంది. యూపీఏ సర్కారుకు, సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్, రాహుల్‌గాంధీలకు.. తెలంగాణ ఏర్పాటుకు కృషి చేసిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు.
హా తెలంగాణపై మేం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. సీమాంధ్రకు కూడా మేం ఇచ్చిన హామీలు, ప్రధాని చేసిన హా మీలు నెరవేరుస్తాం. వాటి కార్యాచరణ కూడా పూర్తి చేయాలి.
హా ఎన్నికల షెడ్యూల్‌ను మేం స్వాగతిస్తున్నాం. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం. ఈ ఎన్నికలతో దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నా.
హా తెలంగాణ ఏర్పాటయ్యాక కాంగ్రెస్‌లో విలీనమవుతామని టీఆర్‌ఎస్ ప్రకటించింది. కానీ కేసీఆర్ చేసిన ప్రకటన మేం చూశాం. విలీనం కాకుండా ఎన్నిక లకు ఒంటరిగా వెళ్లినా... యూపీఏ కూటమిలోనే ఉంటామని ఆయన చెప్పారు. దాన్ని మేం స్వాగతిస్తున్నాం.
హా పొత్తుల కోసం కాంగ్రెస్ తెలంగాణ సీనియర్ నేతలతో ఒక కమిటీ వేయబోతున్నాం. ఆ కమిటీ టీఆర్‌ఎస్ కమిటీతో చర్చలు జరుపుతుంది.
హా విలీనం ప్రకటన కేసీఆర్ నుంచే వచ్చింది. విలీనం ఉండదని చెప్పిందీ ఆయనే. అందువల్ల ఈ వ్యవహారం వారిదే. మేం విలీనాన్ని స్వాగతించేవాళ్లం. సోనియాగాంధీని కలిసినప్పుడు కూడా విలీనం చేస్తానని కేసీఆర్ వాగ్దానం చేశారు. అందువల్ల విలీనం చేస్తారని నమ్మాం.
హా కానీ వాళ్లదొక రాజకీయ పార్టీ. వాళ్లు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. దానిపై కామెంట్ చేయను. కానీ పొత్తులకు సిద్ధంగా ఉన్నాం.
హా కాగా.. విభజనకు వ్యతిరేకంగా కిరణ్ సుప్రీంకు వెళ్లడంపై ప్రశ్నించగా... ‘‘ఆయన తన వైఖరి చూపిస్తున్నారు.. (వెల్ హి ఈజ్ షోయింగ్ హిజ్ కన్సిస్టెన్సీ)’’ అని పేర్కొన్నారు.
హా అయితే అనంతరం దిగ్విజయ్ కొన్ని టీవీ చానెళ్లతో మాట్లాడుతూ కాంగ్రెస్‌కు తెలంగాణలో భయమేమీ లేదని, ఒంటరి పోరుకైనా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
హా కేసీఆర్ సోనియాగాంధీని ఎలిజిబెత్ రాణిగా పోల్చడాన్ని ప్రస్తావించగా... ‘అలాంటప్పుడు సోనియాగాంధీని కలిసినప్పుడే ఆ మాట చెప్పాల్సింది’ అని పేర్కొన్నారు.