దిగ్విజయ్ దృష్టి అంతా తెలంగాణపైనే!
హైదరాబాద్ : కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ గురువారం హైదరాబాద్ రానున్నారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన రాష్ట్ర నేతలతో చర్చించనున్నారు. దిగ్విజయ్ సింగ్ మూడు రోజుల పాటు హైదరాబాద్లోనే మకాం వేయనున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయినందున దిగ్విజయ్ దృష్టి అంతా తెలంగాణపైనే ఉంటుందని సమాచారం.
అలాగే టీఆర్‌ఎస్‌తో పొత్తు వ్యవహారం కూడా దిగ్విజయ్ పర్యటనలో కీలకం కానుంది. కేంద్రమంత్రి జైరాం రమేష్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న టీఆర్‌ఎస్ నాయకత్వాన్ని ఎలాగైనా పొత్తుల దారిలోకి తీసుకు రావడానికి దిగ్విజయ్ ఎప్పటి నుంచి ప్రయత్నాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మంత్రులంతా ఎంపీలుగా పోటీ చేయాలంటూ కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న సూత్రప్రాయ నిర్ణయాన్ని దిగ్విజయ్ తెలంగాణ ప్రాంత మంత్రులకు చేరవేయనున్నారు.
అలాగే ఒకే కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే టిక్కెటన్న రాహుల్ ఆలోచనలు అమల్లో భాగంగా.. టిక్కెట్ల కేటాయింపుపై కూడా దిగ్విజయ్ దృష్టి పెట్టనున్నారు. మరో వైపు పొన్నాల లక్ష్మయ్యకు పీసీసీ బాధ్యతలు అప్పగించడంపై గుర్రుగా ఉన్న సీనియర్లను బుజ్జగించేందుకు డిగ్గీరాజా తన వంతు ప్రయత్నం చేయనున్నారు. తెలంగాణ పీసీసీ పీఠంపై బోలెడన్ని ఆశలు పెట్టుకుని ...అసంతృప్తితో ఉన్న జానారెడ్డి అలక తీర్చే యత్నంలో అధిష్టాన పెద్దలు ఉన్నారు.