టీఆర్‌ఎస్... కాస్కో
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేలా రాష్ర్ట ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. లేనిపక్షంలో ప్రజల్లోకి వెళ్లి పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సమాయత్తం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ ఓడిపోవడం బాధాకరమన్నారు. ప్రజల్లో ఆశలు, ఆకాంక్షలు పెరిగిపోవడం కూడా దేశంలో కాంగ్రెస్ ఓటమికి కారణమని విశ్లేషించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో ఆదివారం ఏర్పాటు చేసిన ‘కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సు’లో కాంగ్రెస్ ఓటమికి కారణాలు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ప్రతిపక్ష పాత్ర, భవిష్యత్ కార్యాచరణపై పార్టీ సీనియర్ నేతలు ప్రసంగించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌కు, రాష్ట్రానికి చేసిన కృషిని వక్తలు కొనియాడారు. వైఎస్ పేరు ను నేరుగా ప్రస్తావిస్తూ పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ఆయనను స్మరించుకోగా, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాత్రం వైఎస్ పేరును ప్రస్తావించకుండా నాటి ప్రభుత్వ గొప్పతనాన్ని వివరించారు.
వైఎస్ వల్లే నాడు పార్టీకి వైభవం: దిగ్విజయ్
‘‘రెండు ఎంపీ సీట్లున్న టీఆర్‌ఎస్ వల్ల తెలంగా ణ ఎలా సాధ్యమవుతుంది? అయినా ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయాం. నాడు కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాత్ర అమోఘం. ఆయన వల్లే కాంగ్రెస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. పదేళ్ల పాలనలో కాంగ్రెస్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసింది. అయితే ప్రజల్లో ఆశలు, ఆకాంక్షలు పెరిగాయి. వారి ఆశలే మరో పార్టీకి అవకాశమిచ్చాయి. గుజరాత్ మోడల్ అన్న నినాదంతో నరేంద్ర మోడీ చెప్పిన అబద్ధాలను ప్రజలు నమ్మారు. టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీల అమలుకు ఒత్తిడి తెద్దాం. రుణమాఫీ, గిరిజనులు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు వంటి హామీలను కేసీఆర్ అమలు చేయాల్సిందే. లేకుంటే నిలదీస్తాం’’ అని దిగ్విజయ్ అన్నారు.
తెలంగాణ ఇచ్చినా ఎలా ఓడాం?: కుంతియా
తెలంగాణ ఇచ్చినా ఎందుకు ఓడిపోయామో లోతుగా ఆలోచించాలని ఏఐసీసీ కార్యదర్శి ఆర్.కుంతియా అన్నారు. కాంగ్రెస్‌ను ఎలా బలోపేతం చేయాలో ఆలోచించాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు అన్నారు.
నాటి సీఎం మాటకు కట్టుబడ్డారు: పొన్నాల
‘‘అధికారంలోకి వచ్చిన నాలుగు రోజుల్లోనే అధికార పార్టీ కార్యకర్తలు, రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయడం చరిత్రలో ఎన్నడూ లేదు. కరెంటు లేక, నీరందక, రుణాలు మాఫీ కాక రైతులు రోడ్లపైకి వస్తుంటే కేసీఆర్ సింగపూర్ యాత్రకు వెళ్లడం గర్హనీయం. 2004లో అధికారంలోకి వచ్చిన 5 నిమిషాల్లోనే అసాధ్యమనుకు న్న ఉచిత విద్యుత్, బకాయిల రద్దు, కేసుల ఎత్తివేత వంటి హమీలన్నీ అమలు చేసిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రిదైతే.. అధికారంలోకి వచ్చి మూడు నెలలవుతున్నా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా కమిటీలతో కాలయాపన చేస్తున్న ఘనత ఈనాటి సీఎం కేసీఆర్‌ది.’’ అని పొన్నాల అన్నారు. ‘‘గత ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వ లోపాలున్నాయి. కార్యకర్తలంతా మమ్మల్ని క్షమించాలి.’’ అని ఉత్తమ కుమార్ రెడ్డి అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో పార్టీ ఫిరాయింపులను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు.