దిగ్విజయ్ సింగ్, పొన్నాలపై కార్యకర్తల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు భయపడినట్లే జరిగింది! పార్టీ కార్యాచరణ సదస్సు విషయంలో అంతా అనుకున్నట్లే అయ్యింది!! భవిష్యత్ మార్గాన్ని నిర్దేశించుకునేందుకు ఆదివారం నాడు మొదలైన కీలక సదస్సు ఆదిలోనే రసాభాసగా మారింది. వేదికపై ముఖ్య నేతలు ప్రసంగిస్తుండగానే కార్యకర్తలు అడ్డుతగిలారు. అంతా మీ వల్లే అంటూ చీవాట్లు పెట్టారు. ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహించాల్సిందేనని పట్టుబట్టారు. ఇదంతా మీడియా కెమెరాలు చిత్రీకరిస్తుండటంతో కాంగ్రెస్ పెద్దలు బిక్కమొహాలేయాల్సి వచ్చింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని శేరిగూడ వద్ద ఓ కాలేజీ ప్రాంగణంలో ‘కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సు’ ఆదివారం ప్రారంభమైంది.
రెండు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ఉదయం 10 గంటలకు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు, కార్యదర్శి రామచంద్ర కుంతియా, కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్ సహా దాదాపుగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రముఖులంతా ఈ సదస్సుకు హాజరయ్యారు. సదస్సు ప్రారంభమైన వెంటనే తెలంగాణ అమరవీరులకు, ఆత్మహత్య చేసుకున్న రైతులకు సంతాపం తెలిపే తీర్మానాలను ప్రవేశపెట్టడంతోపాటు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ప్రారంభ సదస్సులో దిగ్విజయ్, పొన్నాల, కుంతియా, కొప్పుల రాజు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఓటమికి కారణాలు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ప్రతిపక్ష పాత్ర, భవిష్యత్ కార్యాచరణపై ప్రసంగించారు.
అంతలోనే చుక్కెదురు..
సదస్సులో ముఖ్య నేతలు మాత్రమే ప్రసంగిస్తుండటం.. అక్కడికి వచ్చిన వేలాది మందిలో ఒక్కరికి కూడా అవకాశమివ్వకపోవడంతో కార్యకర్తలు ఆగ్రహానికి గురయ్యారు. పలుమార్లు సదస్సును అడ్డుకున్నారు. నేతలు ప్రసంగిస్తుండగా లేచి నిలబడి తిట్ల దండకం అందుకున్నారు. ‘‘మీ వల్లే కాంగ్రెస్‌కు ఈ దుస్థితి వచ్చింది. కష్టపడే కార్యకర్తలను పక్కనబెట్టి మీ చెంచాగాళ్లకే టిక్కెట్లు ఇచ్చుకున్నారు. సిగ్గులేకుండా మళ్లీ మీరే మాట్లాడుతున్నారా? ఎందుకు ఓడిపోయామనే దానిపై కనీసం కార్యకర్తలను మాట్లాడనీయరా?’’ అంటూ నిలదీశారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వల్లే పార్టీ ఓడిపోయిందని ఆరోపించారు. తక్షణమే ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సభ ఆరంభం నుంచి నేతల ప్రసంగాలు ముగిసే వరకు కార్యకర్తలు తమ నిరసనను కొనసాగించారు. కార్యకర్తలను బుజ్జగించేందుకు వేదికపైనున్న నేతలు ఎంత ప్రయత్నించినా వినలేదు.
కాంగ్రెస్ నేతలు జ్ఞాన సుందర్, నారాయణ స్వామి సహా నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు పదేపదే సదస్సును అడ్డుకున్నారు. పొన్నాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జానారెడ్డి, దానం నాగేందర్ మైక్ అందుకుని పలుమార్లు బుజ్జగించినా, కార్యకర్తలకు మాట్లాడే అవకాశం కల్పిస్తామని చెప్పినా గొడవ సద్దుమణగలేదు. అక్కడున్న మీడియా ఈ దృశ్యాలను చిత్రీకరిస్తుండటంతో సదస్సు ఉద్దేశం పక్కదారి పడుతోందని, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని గ్రహించిన దిగ్విజయ్ సింగ్ గొడవ చేస్తున్న కార్యకర్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సదస్సుకు అంతరాయం కలిగిస్తున్న కార్యకర్తలందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వారందరినీ వీడియో ద్వారా గుర్తించాలని టీపీసీసీని ఆదేశించారు. ఆయా కార్యకర్తలంతా తక్షణమే సదస్సు నుంచి బయటకు వెళ్లాలని హెచ్చరించారు. అయినా కార్యకర్తలెవరూ సదస్సును వీడలేదు. దిగ్విజయ్‌సింగ్, పొన్నాలకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పార్టీ ఓటమికి కారణం కాంగ్రెస్ నాయకత్వం, రాష్ర్ట పెద్దలేనని ఆరోపించారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన దిగ్విజయ్.. నినాదాలు చేసే కార్యకర్తలను తక్షణమే బయటకు పంపాలని ఆదేశించడంతో దానం నాగేందర్ అనుచరులు వారందరినీ బలవంతంగా బయటకు లాక్కెళ్లారు. ఈ సదస్సులో గొడవలు జరిగితే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయని, పార్టీకి నష్టం వాటిల్లుతుందని శనివారం నాటి సమీక్షా సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు పలువురు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కేవలం భవిష్యత్ కార్యాచరణకే ఈ భేటీని పరిమితం చేయాలని వారు గట్టిగా సూచించారు. అయినా అంతా అనుకున్నట్టే సదస్సులో కార్యకర్తల ఆవేశం కట్టలు తెంచుకుంది.