
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఉన్న విబేధాలు గాంధీభవన్ సాక్షిగా బహిర్గతమయ్యాయి. హస్తం నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు వచ్చిన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఎదుటే కాంగ్రెస్ నేతలు రెచ్చిపోయారు. గాంధీభవన్‌లో ఒకరినొకరు కాలర్లు పట్టుకుని వాగ్వాదానికి దిగారు.
వివరాల ప్రకారం.. గాంధీభవన్‌లో ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి నేతలతో అనిల్‌కుమార్ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అనిల్‌కుమార్‌పై ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి నేతలు దాడికి యత్నించారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డినే తిడతావా అంటూ అనిల్‌పై ఎన్‌ఎస్‌యూఐ నేతలు దాడి చేశారు. ఈ సందర్భంగా జై కాంగ్రెస్.. సేవ్ కాంగ్రెస్, దొంగల నుంచి పార్టీని కాపాడాలంటూ నినాదాలు చేశారు. అనంతరం, అనిల్ కుమార్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో, గాంధీభవన్‌లో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది.
గాంధీభవన్‌లో ఈ ఘటన అనంతరం కాంగ్రెస్ నేత మల్లురవి స్పందించారు. ఈ సందర్భంగా మల్లురవి మీడియాతో మాట్లాడుతూ.. అన్ని విషయాలు దిగ్విజయ్ సింగ్ దృష్టికి తీసుకువెళ్తాము. ఓయూ విద్యార్థుల అంశాలు పార్టీ దృష్టిలో ఉన్నాయి. వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత దూషణలు చేయవద్దు. అన్ని సమస్యలపై కూర్చుని మాట్లాడుకుందాము అని కామెంట్స్ చేశారు.
జానారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఎవరూ లేరు. దిగ్విజయ్ సింగ్‌కు కొన్ని సలహాలు ఇచ్చాను. ఆయన కూడా మాకు కొన్ని సలహాలు ఇచ్చారు. అందరం కలిసి రెండు రోజుల్లో మీ ముందుకు వస్తాము. మేమంతా ఐకమత్యంతో ముందుకు వెళ్తాము అని వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment