వచ్చే నెల ఐదో తేదీ తర్వాత ఎప్పుడైనా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ!
పీసీసీ అధ్యక్ష నియామకం పూర్తయిన నేపథ్యంలో.. కేబినెట్ విస్తరణకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్
డిప్యూటీ సీఎం భట్టి విదేశీ పర్యటన పూర్తికాగానే.. ఢిల్లీకి రేవంత్, ఉత్తమ్, మున్షీ, మహేశ్‌గౌడ్
మరోమారు చర్చల తర్వాత బెర్తుల ఖరారు.. సామాజిక సమతుల్యత ప్రాతిపదికగానే భర్తీ
ప్రస్తుతం సీఎం సహా 11 మంది మంత్రులు.. కొత్తగా మరో ఆరుగురికి అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. దసరా పండుగ సమయంలో కొత్త మంత్రులను నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. టీపీసీసీ అధ్యక్షుడి నియామక ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో.. కేబినెట్ విస్తరణకు అడ్డంకులు తొలగినట్టేనని, ఈసారి మంత్రివర్గ విస్తరణ ఖాయమని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే నెల 5వ తేదీ తర్వాత ఎప్పుడైనా కొత్త మంత్రులు కొలువుదీరనున్నారని నేతలు చెబుతున్నారు. ఎవరెవరికి చాన్స్ ఇవ్వాలన్న దానిపై మరోమారు చర్చలు జరిపి ఖరారు చేయనున్నట్టు వివరిస్తున్నారు.
బెర్తుల కోసం పోటాపోటీ
నిబంధనల ప్రకారం.. రాష్ట్రంలో గరిష్టంగా సీఎం సహా 18 మందికి మంత్రివర్గంలో చోటు ఉంటుంది. ప్రస్తుతం సీఎంతోపాటు 11 మంది మంత్రులు ఉన్నారు. దీనితో మరో ఆరుగురికి మంత్రివర్గంలో చోటు కల్పించే వెసులుబాటు ఉంది. వీటి కోసం తీవ్ర పోటీ నెలకొంది. పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. తమకంటే తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. ప్రస్తుతం కేబినెట్లో ప్రాతినిధ్యం లేని జిల్లాల నుంచే కాకుండా.. మిగతా జిల్లాల నుంచి కూడా డజను మందికి పైగా ఎమ్మెల్యేలు తమకు కేబినెట్ బెర్త్‌పై ఆశతో ఉన్నారు.
ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని జిల్లాల నుంచి పరిశీలిస్తే.. మల్‌రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి (రంగారెడ్డి), జి.వివేక్, జి.వినోద్, కె.ప్రేమ్‌సాగర్‌రావు (ఆదిలాబాద్), పి.సుదర్శన్‌రెడ్డి (నిజామాబాద్), దానం నాగేందర్, అమీన్ అలీఖాన్ (హైదరాబాద్) మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బాలు నాయక్ (నల్లగొండ), వాకిటి శ్రీహరి (మహబూబ్‌నగర్), టి.జీవన్‌రెడ్డి (కరీంనగర్) కూడా కేబినెట్ బెర్త్ కోసం ఒత్తిడి చేస్తున్నారు. వీరికితోడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే కె.మదన్‌మోహన్‌రావు, ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, వేముల వీరేశం తదితరులు కూడా సామాజిక వర్గాల ప్రాతిపదికన చాన్స్ ఇవ్వాలని విజ్ఞప్తులు చేస్తున్నారు.
సామాజిక సమీకరణాలే ప్రాతిపదికగా..
కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న దానిపై అధిష్టానం ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపింది. పీసీసీ అధ్యక్ష పదవికి, కేబినెట్ విస్తరణకు మధ్య సామాజిక వర్గాల వారీగా లెక్కలు కుదరకపోవడంతో నిర్ణయం వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా పీసీసీ అధ్యక్షుడిగా బీసీ నేతను నియమించడంతో మిగతా సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించే విషయంలో ఓ నిర్ణయం తీసుకునే వెసులుబాటు కలిగింది. ప్రస్తుతం మంత్రిమండలిలో ఏడుగురు ఓసీ వర్గానికి చెందినవారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇద్దరు ఎస్సీలు, ఇద్దరు బీసీలు, ఒక ఎస్టీ నేత ఉన్నారు. కులాల వారీగా చూస్తే నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. ప్రస్తుతం రెడ్లకే చెందిన మరో నేతకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వనున్నట్టు అంచనా. మాదిగ, ఎస్టీ (లంబాడా), బీసీ సామాజిక వర్గాలకు కూడా ఒక్కో బెర్త్ కేటాయించాల్సి ఉంటుందని చెబుతున్నారు. మిగతా రెండు పదవులు ఎవరికన్నది పార్టీ వెసులుబాటు ప్రకారం కేటాయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఇతర పదవుల భర్తీ కూడా..
వివిధ వర్గాలకు మంత్రివర్గంలో స్థానంతోపాటు అసెంబ్లీలో చీఫ్ విప్, విప్ పదవులు కూడా ఇచ్చే చాన్స్ ఉంది. వీటితోపాటు కీలకమైన ఆర్టీసీ, మైనింగ్, ఎంఐడీసీ, మూసీ డెవలప్‌మెంట్ వంటి కీలక కార్పొరేషన్లకు ఎమ్మెల్యేలను చైర్మన్లుగా నియమిస్తారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఏ పదవి ఎవరికి ఇవ్వాలన్న దానిపై సామాజిక వర్గాల కోణంలో నిర్ణయం ఉంటుందని అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత.. ఆయనతోపాటు సీఎం రేవంత్, సీనియర్ మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ తదితరులు ఢిల్లీ వెళ్లి.. అధిష్టానంతో చర్చించనున్నట్టు సమాచారం. మొత్తమ్మీద దసరా పండుగకు మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే చర్చ.. రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఆసక్తి రేకెత్తిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment