సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీ ఆఫీసుపై దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ మోర్చా నాయకులు, కార్యకర్తలు.. బీజేపీ ఆఫీసు నుంచి గాంధీభవన్ ముట్టడికి బయలుదేరారు. అప్రమత్తమైన పోలీసులు.. బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. గాంధీ భవన్ వైపు బీజేపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో బీజేపీ పార్టీ శ్రేణులను అడ్డుకున్నారు. వారిపై లాఠీచార్జ్ చేశారు. దీంతో, మరోసారి ఉద్రికత్త చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. మరోవైపు.. బీజేపీ పార్టీ ఆఫీస్ వద్దకు కాషాయ పార్టీ నేతలు భారీగా చేరుకుంటున్నారు.
పార్టీ ఆఫీసుపై దాడి నేపథ్యంలో బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. బీజేపీ కార్యాలయంపైన కాంగ్రెస్ దాడి దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ లాగానే వ్యవహరిస్తోంది. తిరగబడి మేము కూడా దాడి చేస్తే ఢిల్లీలో మీ జాతీయ నాయకులు ఎక్కడ దాక్కుంటారు. ఇలాంటి సంస్కృతికి ముగింపు పలకాలి.
కేటీఆర్ తప్పించుకుని ఎన్ని రోజులు తిరుగుతారు. చంచల్‌గూడా వెళ్లాలా లేక తీహార్ జైలుకు వెళ్లాలా అనేది కేటీఆర్ డిసైడ్ చేసుకోవాలి. కేటీఆర్ జైలుకు వెళితే సానుభూతి రాదు. డబ్బులు ఎక్కువై కోర్టులలో పిటిషన్లు వేస్తున్నారు. కేసీఆర్ కుటుంబం భయంకరమైన అవినీతికి పాల్పడింది. లక్షల కోట్ల రూపాయలు లూటీ చేశారు. తెలంగాణ అధ్యక్ష పదవిపై ఎలాంటి చర్చ లేదు. దానిపై నన్ను ఎవరూ అడగలేదు. తెలంగాణలో బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది అంటూ కామెంట్స్ చేశారు.
బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..‘బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ దుండగులు దాడి చేయడం దారుణం. దాడుల వల్ల హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. తెలంగాణలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. శాంతిభద్రతల వైఫల్యానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. కేటీఆర్ కేసుల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కేటీఆర్ ఇప్పుడు అధికారులను బలి పశువులను చేస్తున్నారు. నాడు కేటీఆర్ అధికారులను భయపెట్టి పని చేయించుకున్నారు. కేటీఆర్ నిర్దోషి అయితే నిలబడి ఎదుర్కోవాలి. అంతేగానీ కోర్టులకి వెళ్లి తప్పించుకోవడానికి చూడకూడదు.
కాళేశ్వరంలో లక్షల కోట్ల కుంభకోణం జరిగింది. దానిపైన ప్రభుత్వం ఏం చేస్తుంది?. ధరణి స్కామ్‌పై ఏం కేసులు పెట్టారు?. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తోంది. వెయ్యి సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అని చెప్పిన రేవంత్ రెడ్డి చిన్న కేసులు పెడుతున్నారు. పెద్ద కేసుల నుంచి బీఆర్ఎస్ నేతలను తప్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment